Leading News Portal in Telugu

Indore T20 Records: ఇండోర్‌లో టీమిండియా రికార్డులు అదుర్స్.. అఫ్గానిస్థాన్‌కు చుక్కలు తప్పవా?


Indore T20 Records: ఇండోర్‌లో టీమిండియా రికార్డులు అదుర్స్.. అఫ్గానిస్థాన్‌కు చుక్కలు తప్పవా?

Indore T20 Records Ahead Of IND vs AFG 2nd T20: మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా ఈరోజు భారత్, అఫ్గానిస్థాన్‌ జట్ల మధ్య రెండో టీ20 మ్యాచ్ జరగనుంది. ఇండోర్‌లోని హోల్కర్‌ స్టేడియంలో రాత్రి 7 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది. మొహాలీ వేదికగా జరిగిన తొలి టీ20లో విజయం సాధించిన భారత్.. ఇండోర్ టీ20లో గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలని చూస్తోంది. స్టార్లతో నిండిన టీమిండియాకు ఇది పెద్ద కష్టమేమీ కాకపోవచ్చు. మరోవైపు ఇండోర్‌లో టీమిండియాకు మంచి రికార్డులు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో రెండో టీ20లో భారత్ విజయాన్ని అఫ్గాన్‌ అడ్డుకోవడం దాదాపు అసాధ్యమే.


ఇండోర్‌లోని హోల్కర్‌ స్టేడియంలో భారత్ ఇప్పటివరకు 7 వన్డేలు ఆడి.. అన్నింటిలోనూ విజయం సాధించింది. ఈ మైదానంలో ఒక టీ20, ఒక టెస్టు మ్యాచ్‌లో ఓడిపోయింది. ఈ మైదానంలో చివరిసారిగా 2022 అక్టోబర్‌లో దక్షిణాఫ్రికాతో భారత్ టీ20 మ్యాచ్ ఆడింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ప్రోటీస్ 20 ఓవర్లలో 227 పరుగులు చేసింది. ఆపై భారత్ 18.3 ఓవర్లలో 178 పరుగులకు ఆలౌట్ అయింది. ఇక భారత్ తరపున రోహిత్ టీ20లో ఫాస్టెస్ట్ సెంచరీ ఇండోర్‌లోనే చేశాడు. 2017లో శ్రీలంకపై రోహిత్ 35 బంతుల్లోనే సెంచరీ బాదాడు.

హోల్కర్ స్టేడియం పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. సరిహద్దు కూడా చిన్నదిగా ఉండడంతో బ్యాట్స్‌మెన్‌ పండగ చేసుకుంటారు. ఈ పిచ్‌పై సగటు టీ20 స్కోరు 210 పరుగులుగా ఉంది. ఇక్కడ టాస్ గెలిచిన జట్టు ముందుగా బ్యాటింగ్ చేయనుంది. ఇప్పటివరకు రెండు టీ20 మ్యాచ్‌ల్లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమ్ గెలుపొందగా, ఛేజింగ్ టీమ్ ఓసారి గెలిచింది. ఇండోర్‌లో రాత్రి ఉష్ణోగ్రత పడిపోతుంది. మంచు ప్రభావం బాగా ఉంటుంది. ఈ మ్యాచ్‌లో టాస్ కీలక పాత్ర పోషించనుంది.