posted on Jan 16, 2024 4:32PM
రాష్ట్ర శాసన మండలిలో ఖాళీ అయిన రెండు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే ఎన్నికల సంఘం షెడ్యూల్ ను ప్రకటించింది. జనవరి 18వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. వీటి భర్తీకి ఈసీ వేర్వురు నోటిఫికేషన్లు విడుదల చేయటంతో…ఈ రెండు స్థానాలు కూడా కాంగ్రెస్ ఖాతాలోకి వెళ్లే అవకాశం ఉంది. అయితే ఇందుకోసం పార్టీలని పలువురు కీలక నేతలు పోటీ పడుతున్నారు. నామినేషన్ల స్వీకరణకు గడువు దగ్గరపడుతున్న నేపథ్యంలో… ఏ క్షణమైనా కాంగ్రెస్ పార్టీ జాబితాను ప్రకటించే అవకాశం ఉంది. పలువురిని పేర్లను పరిశీలించిన హైకమాండ్… ఇద్దరిని ఖరారు చేసినట్లు తెలుస్తోంది.
తెలంగాణ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ ఇద్దరు అభ్యర్థులను ఖరారు చేసింది. పార్టీ సీనియర్ నాయకులు అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్ పేర్లను ఫైనల్ చేసింది. కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ పెద్దలు వారికి ఫోన్ చేసి సమాచారం అందించారు. నామినేషన్ పత్రాలను సిద్ధం చేసుకోవాలని సూచించారు.అద్దంకి దయాకర్ ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో తుంగతుర్తి నుంచి టిక్కెట్ ఆశించారు. కానీ టిక్కెట్ దక్కలేదు. బల్మూరి వెంకట్ 2021 హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు.
ఉన్నది రెండు ఎమ్మెల్సీ పదవులే అయినా.. పోటీలో మాత్రం ఎక్కువ మందే ఉన్నారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో వివిధ నియోజకవర్గాల నుంచి పోటీ చేసి ఓడిపోయిన షబ్బీర్ అలీ, అజారుద్దీన్, సంపత్, మధు యాష్కీ గౌడ్ వంటి నేతలు కూడా ఎమ్మెల్సీ పదవుల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే కాంగ్రెస్ నుంచి ఒక్క ముస్లిం మైనారిటీ నాయకుడు కూడా ఎమ్మెల్యేగా లేరు. అదే మాదిరిగా ఎమ్మెల్సీలు కూడా లేరు. మంత్రి వర్గంలోకి ఒక ముస్లిం మైనారిటీ నేతను తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. రానున్న లోక్ సభ ఎన్నికల్లో మెజారిటీ ఎంపీ స్థానాలపై కన్నేసిన కాంగ్రెస్ కు ముస్లిం మైనారిటీ ఓట్లు కీలకం కానున్నాయి. ఇక గవర్నర్ కోటాలో కూడా రెండు ఎమ్మెల్సీ పదవులు ఖాళీగా ఉన్నాయి. వీటిలో ఒకటి ప్రొఫెసర్ కోదండరామ్ కు ఇచ్చే అవకాశం ఉండగా… ఒకటి మైనార్టీ వర్గానికి చెందిన వ్యక్తికి ఇస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే వీటిపై కూడా క్లారిటీ రానుంది.