Leading News Portal in Telugu

చంద్రబాబు క్వాష్ లో కొత్త మలుపు.. జడ్జీలకే అర్ధం కాని కేసా ఇది?! | new turn in babu quash case| judges| anirudh| bise| bela| triwedi| cji


posted on Jan 16, 2024 4:08PM

స్కిల్ కేసులో తనను అక్రమంగా అరెస్టు చేయడాన్ని సవాల్ చేస్తూ తెలుగుదేశం అధినేత చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై సుప్రీం ద్విసభ్య ధర్మాసనం ఏటూ తెల్చకుండానే సీజేఐకి రిఫర్ చేసింది. తెలుగుదేశం అధినేత చంద్రబాబుపై వైసీపీ ప్రభుత్వం బనాయించిన  స్కిల్ స్కాం కేసు  నెలల తరబడి కోర్టుల్లో  సాగుతూనే ఉన్న సంగతి తెలిసిందే. గతేడాది ఈ కేసులో చంద్రబాబుపై నమోదు చేసిన కేసుకు సెక్షన్ 17ఏ వర్తిస్తుందా లేదా అన్న దానిపై సుప్రీంకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. దీంతో ఈ రోజు ఈ కీలక తీర్పు వెలువడనుందని గత రెండు రోజులుగా  ఉత్కంఠ వాతావరణం నెలకొంది. అయితే, నేటి తీర్పులో ద్విసభ్య ధర్మాసనంలో ఇద్దరు జడ్జీలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. స్పష్టంగా చెప్పాలంటే ఇద్దరు జడ్జిలు పరస్పర విరుద్ధమైన తీర్పులు వెల్లడించారు. ఈ కేసును విచారించిన ద్విసభ్య ధర్మాసనంలోని జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా త్రివేదీ ధర్మాసనం చంద్రబాబుకు సెక్షన్ 17ఏ వర్తిస్తుందా లేదా అన్న దానిపై స్పష్టమైన నిర్ణయం తీసుకోలేకపోయారు. ఒకరు సెక్షన్ 17ఏ వర్తిస్తుందంటే మరొకరు వర్తించదని అభిప్రాయపడ్డారు. దీనికి ఎవరికి వారు వారి వారి కారణాలు, సెక్షన్స్ లో షరతులు, లొసుగులు ఎన్నో చెప్పుకొచ్చారు. ఫైనల్ గా ఈ కేసును ద్విసభ్య ధర్మాసనం తేల్చలేక సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తికి అప్పగించారు. దీంతో ఈ కేసు అక్కడ ఎప్పటికి తేలుతుందన్నది చెప్పేలేని పరిస్థితి.

సీజేఐ ఈ కేసును ఎలా తేల్చనున్నారన్న దానిపై రకరకాల విశ్లేషణలు ఇప్పటికే మొదలయ్యాయి.  తీర్పు రావాలంటే మాత్రం మరికొన్ని నెలలు పట్టే అవకాశం ఉందన్నది న్యాయనిపుణుల అభిప్రాయం. న్యాయమూర్తులతో కూడిన ఓ కమిటీని నియమించడం, మరింత క్షుణ్ణంగా ఈ కేసులో లోతుకు వెళ్లి విచారణ చేయడం వంటి అంశాల నేపథ్యంలో ఈ కేసు ఇప్పటిలో తేలే పరిస్థితి లేదన్నది అర్ధమవుతుంది. ఇది చంద్రబాబుకు నష్టం తెచ్చే అంశమని  ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇది అక్రమంగా బనాయించిన కేసని ఇప్పటికే ఎందరో న్యాయ నిపుణులు, మేధావులు, రిటైర్డ్ న్యాయమూర్తులు తేల్చి చెప్పారు. హై ప్రొఫైల్ ఉన్న ఒక నేతను ముందస్తు సమాచారం లేకుండా, గవర్నర్ అనుమతి లేకుండా అరెస్ట్ చేయడం ముమ్మాటికీ సీఐడీ తప్పిదమే. అయితే, ఆ తప్పును కప్పిపుచ్చుకునేందుకు ఏపీ ప్రభుత్వం ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేసింది. చేస్తున్నది. 17ఏ ప్రకారం గవర్నర్ అనుమతి లేకుండా అరెస్ట్ చెల్లదు. అలాగే చంద్రబాబుపై బనాయించిన కేసులు కూడా చెల్లవు. అయితే  17ఏ 2018 తర్వాత కేసులకు మాత్రమే వర్తిస్తుంది. అంతకు ముందు కేసులలో ఈ సెక్షన్ వర్తించదు.

సరిగ్గా ఏపీ ప్రభుత్వం అదే అంశాన్ని అడ్డం పెట్టుకొని వింత వాదన తెరపైకి తెచ్చింది. స్కిల్ స్కాం కేసు 2018కి ముందే విచారణ మొదలైందని సీఐడీ తరపు న్యాయవాదులు వాదిస్తున్నారు. 2018కి ముందు స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టులో సర్వీస్ అందించిన సంస్థలకు సీబీఐ నోటీసులు ఇచ్చింది. నిజానికి ఈ నోటీసులు ఇచ్చింది జీఎస్టీ గురించి. ఆ నోటీసులకు ఇప్పటి సీఐడీ విచారణకు ఎలాంటి సంబంధం లేదు. కానీ ఆ నోటీసులు ఇచ్చినప్పటి నుండే ఈ కేసు విచారణ మొదలైనట్లు సీఐడీ లాయర్లు న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ద్విసభ్య ధర్మాసనంలో ఒకరైన జస్టిస్‌ బేలా ఎం.త్రివేది ఈ కేసుకు 17ఏ వర్తించదని అభిప్రాయపడ్డారు. అదే సమయంలో ఈ కేసుకు 2018 నోటీసులకు సంబంధం లేదు కనుక 2018 తర్వాత కేసుగా 17ఏ వర్తిస్తుందని మరో న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. దీంతో ఈ కేసు ఇప్పుడు మరింత మెలిక పడింది. 

అయితే ఇది న్యాయమూర్తులకే అర్ధం కాని కేసా అంటూ రాజకీయ వర్గాలలో ఆసక్తికర చర్చ సాగుతున్నది. ద్విసభ్య ధర్మాసనంలో ఇద్దరు న్యాయమూర్తులలో ఒకరు చంద్రబాబుకు ప్రతికూలంగా మరొకరు అనుకూలంగా అభిప్రాయపడ్డారు. ఈ కేసులో జస్టిస్ ఆలస్యమైతే నష్టపోయేది చంద్రబాబే. ఆయన విషయంలో ప్రభుత్వం, సీఐడీ తప్పు చేసిందా లేదా అన్నది తేలాల్సి ఉంది. ప్రభుత్వం కక్షసాధింపులో భాగంగా ఈ అక్రమ అరెస్టులు చేయించిందని స్పష్టంగా తెలుస్తుంది. కానీ, అది నిరూపించాలంటే మాత్రం న్యాయవ్యవస్థలో లొసుగులు అడ్డుపడుతున్నాయి. ఇది 2018కి ముందే విచారణ మొదలైన కేసా.. తర్వాత విచారణ ప్రారంభమైందా అన్నది కూడా స్పష్టమే. కానీ, సీఐడీ తరపున వాదించేందుకు వీలుగా సీబీఐ నోటీసులు అడ్డు పడుతున్నాయి. అదే ఇప్పుడు ఈ కేసు సీజేఐ వరకూ చేర్చింది. మరి ఈ కేసులో తీర్పు ఏపీలో ఎన్నికలకు ముందే వస్తుందా అన్నది తేలాల్సి ఉంది. ఎన్నికల తర్వాత తీర్పు వస్తే ఈ కేసులో ఎవరికీ ఎలాంటి లాభం ఉండదు. అందుకే ఈ కేసులో తీర్పు ఎంత ఆలస్యమైతే అంతగా నష్టపోయేది ఒక్క చంద్రబాబు మాత్రమే. కనుక అందుకే ప్రభుత్వం కూడా ఈ కేసులో సాగదీసేందుకు అన్ని మార్గాలను వాడుకుంటున్నట్లుంది.