సుప్రీంలో జగన్ కు ఝలక్.. బెయిలు రద్దు పిటిషన్ డిస్మిస్ కు నో | a big back lash to jagan in supreme court| reject| dismiss| rrr| petition| cancil
posted on Jan 19, 2024 1:28PM
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ కు దేశ అత్యున్నత న్యాయస్థానంలో గట్టి ఎదురు దెబ్బ తగిలింది. గత పదేళ్లుగా బెయిలు మీద ఉన్న జగన్ బెయిలు రద్దు చేయాలంటూ వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు దాఖలు చేసిన పిటిషన్ ను కొట్టి వేయాలంటూ జగన్ దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీం కోర్టు తోసి పుచ్చింది.
ఈ సందర్భంగా జగన్ తరఫు న్యాయవాది ముకుల్ రోహత్గి వాదనలను సుప్రీం పక్కకు పెట్టేసింది. రఘురామకృష్ణం రాజుపై అనర్హత పిటిషన్ వేసినందునే ఆయన జగన్ బెయిలు రద్దు చేయాలన్న పటిషన్ వేశారంటూ ముకుల్ రోహత్గి చేసిన వాదనను తోసిపుచ్చిన సర్వోన్నత న్యాయస్థానం, ఈ కేసు విషయంలో తాము రాజకీయాల జోలికి పోవడం లేదనీ, కేవలం న్యాయపరమైన అంశాలనే పరిశీలిస్తామని స్పష్టం చేసింది. జగన్ బెయిలు రద్దు పిటిషన్ విచారణను ఏప్రిల్ కు వాయిదా వేసింది. ఈ సందర్భంగా జగన్ అక్రమాస్తుల కేసు విచారణలో జాప్యంపై సీబీఐని నిలదీసింది. విచారణ జాప్యానికి బాధ్యులెవరని ప్రశ్నించింది. దీనికి సీబీఐ తరఫు న్యాయవాది విచారణలో జాప్యం, వాయిదాలతో తమకు సంబంధం లేదని చెప్పారు.
దీనిపై సీరియస్ అయిన సుప్రీం అయితే ఎవరికి సంబంధం ఉంటుందని సూటిగా ప్రశ్నించారు. ఆ సమయంలో జోక్యం చేసుకున్న రఘురామకృష్ణం రాజు తరఫు న్యాయవాది సీబీఐ, జగన్ కుమ్మక్కై కేసు విచారణను జాప్యం చేస్తున్నారని పేర్కొన్నారు. దీనిపై గతంలో సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో హై ప్రొఫైల్ కేసుల విచారణను త్వరిత గతిన పూర్తి చేయాలని తెలంగాణ హైకోర్టు గత ఏడాది డిసెంబర్ 15వ తేదీన ఆదేశాలు ఇచ్చిన అంశాన్ని జగన్ తరపు న్యాయవాది ముకుల్ రోహత్గీ కోర్టులో ప్రస్తావించారు. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో జగన్ కేసుల విచారణ ఎంత త్వరగా తేలుతుందో చూద్దామని సుప్రీం ధర్మాసనం సెటైరికల్ గా వ్యాఖ్యానించింది. కాగా ఏపీ సీఎం జగన్ బెయిల్‌ను రద్దు చేయడంతో పాటు జగన్ అక్రమాస్తుల కేసులను వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలంటూ ఎంపీ రఘురామరాజు సుప్రీం కోర్టులో రెండు పిటిషన్లను దాఖలు చేసిన సంగతి తెలిసిందే.
ఈ రెండు పిటిషన్లపై జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తా నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారం (జనవరి 19) విచారణ జరిపింది. జగన్ బెయిల్ రద్దు, ట్రాన్స్ ఫర్ పిటిషన్లపై సీబీఐకి గతంలోనే సుప్రీంకోర్టు నోటీసులు జారీచేసిన సంగతి విదితమే.