షర్మిల పొలిటికల్ కెరీర్ కు పరిక్షా సమయం! | test to sharmila political career| ap| congress| committee| president| ycp| dissidents| elections
posted on Jan 20, 2024 12:28PM
పోరాడితే పోయేదేం లేదు బానిస సంకెళ్లు తప్ప అన్నది నినాదం. అయితే ఇప్పుడు ఇది వైసీపీలోని క్యాప్టివ్ నేతలు, అసంతృప్త ఎమ్మెల్యేలు, ఎంపీలకు సరిగ్గా వర్తిస్తుంది. ఛీ అన్నా, తూ అన్నా జగన్ పార్టీ చూరుపట్టుకు వేళాడక తప్పని పరిస్థితిని ఎదుర్కొంటున్న పలువురికి ఇప్పుడు కాంగ్రెస్ పర్ ఫెక్ట్ డెస్టినేషన్ లా కనిపిస్తోంది.
జగన్ వ్యూహాత్మకంగా గత నాలుగున్నరేళ్లలోనూ పార్టీలో గుర్తింపు, ప్రాముఖ్యత ఉండాలంటే విపక్షాలను మరీ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీని, ఆ పార్టీ అగ్ర నేతలను తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టాల్సిందే అన్న పరిస్థితి కల్పించారు. దీంతో జగన్ ప్రాపకం సంపాదించడానికో, పదవుల కోసమో పలువురు వైసీపీ నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రులు విపక్షాలపై మరీ ముఖ్యంగా చంద్రబాబు, లోకేష్, జనసేనాని పవన్ కల్యాణ్ పై అనుచితంగా నోరు పారేసుకున్నారు. సభ్య సమాజం అంగీకరించని భాషలో విమర్శలు గుప్పించారు. వ్యక్తిగత, కుటుంబ విషయాలను సైతం లేవనెత్తి దుర్భాషలాడారు.అలాంటి వారిలో అత్యధికులకు ఇప్పుడు జగన్ వచ్చే ఎన్నికలలో పోటీకి పార్టీ టికెట్లు నిరాకరించారు, లేదా నియోజకవర్గం మార్చేశారు. ఇలాంటి వారి సంఖ్య ఇప్పటికే 58 దాటింది. రానున్న రోజులలో ఆ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందంటున్నారు. దీంతో జగన్ ను నమ్ముకుని విపక్షాలపై ఇష్టారీతిగా నోరు పారేసుకున్న వారు ఇప్పుడు లబోదిబో మంటున్నారు. వైసీపీలో ఉండలేక, పార్టీ మరదామంటే చేర్చుకునే వారు లేక రోడ్డున పడ్డట్లుగా మిగిలిపోయారు.
పోనీ పోటీకే దూరంగా ఉందామా అంటే రాజకీయ జీవితానికి చేజేతులా చరమగీతం లిఖించుకున్నట్లు అవుతుందన్న భయం. అందుకే ఇష్టం లేకపోయినా జగన్ చెప్పినట్లు నియోజకవర్గం మారి ఓటమి తథ్యమని తెలిసీ పోటీకి రెడీ అవుతున్నారు. టికెట్ దక్కని వారు ఇంత కాలం నమ్మి మోసపోయాం, మరో సారి మోసపోదాం అన్నట్లుగా మౌనంగా ఉంటున్నారు. అదే సమయంలో విపక్షాలపై అనుచిత వ్యాఖ్యలు చేయకుండా అంశాల వారీ విమర్శలకు మాత్రమే పరిమితమైన వారు మాత్రం జగన్ ఆదేశాలను ధిక్కరించి బయటకు వచ్చేశారు. వచ్చేస్తున్నారు. అలా ఇప్పటికే బయటక వచ్చేసిన వారిని మినహాయిస్తే.. ఉండలేక, బయటకు రాలేక ఊగిసలాడుతున్న వారికి షర్మిల ఏపీ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టడంతో కొత్త ఆశలు చిగురించినట్లైంది. ఇప్పుడు వారి చూపు కాంగ్రెస్ వైపు ఉంది. ఆదివారం ఆమె పార్టీ రాష్ట్ర సారథిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత వైసీపీ నుంచి వలసలు వెల్లువెత్తుతాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ఇక కాంగ్రెస్ అటువంటి వారికి తలుపులు బార్లా తెరుస్తుందా? అన్న సంశయాలు ఎవరి నుంచీ వ్యక్తం కావడం లేదు. ఇందుకు కారణం ఉంది. రాష్ట్రంలో కాంగ్రెస్ గత ఎన్నికలలో ఏపీలో పోటీ చేసిన అన్ని స్థానాలలోనూ కూడా నోటాతో పోటీ పడింది. అంతే కాదు వరుసగా రెండు ఎన్నికలలో రాష్ట్రంలో జీరో స్థానాలతో అట్టడుగున నిలిచింది. అంటే ఆ పార్టీకి ఏపీలో ఇక పోగొట్టుకోవడానికి ఏమీ లేదు. ఇంత కంటే పతనమయ్యే చాన్సూ లేదు. కానీ షర్మిల పరిస్థితి అలా కాదు. కాంగ్రెస్ రాష్ట్ర పగ్గాలు చేతపట్టి ఆ పార్టీ పుంజుకునేలా చేయడంపైనే ఆమె రాజకీయ భవిష్యత్ ఆధారపడి ఉంది.
ఇప్పటికే తెలంగాణలో షర్మిల సొంతంగా రాజకీయ పార్టీ పెట్టి విఫలమయ్యారు. సుదీర్ఘ పాదయాత్ర చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. అయితే సరిగ్గా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆమె అక్కడ పోటీ నుంచి తన పార్టీని దూరంగా ఉంచి వ్యూహాత్మకంగా వ్యవహరించారు. ఒక వేళ ఆ ఎన్నికలలో షర్మిల పార్టీ పోటీ చేసి విఫలమై ఉంటే.. ఇప్పుడు ఆమె కాంగ్రెస్ లో చేరి ఏపీలో సారథ్య బాధ్యతలు చేపట్టినా ప్రయోజనం ఉండేది కాదు. తెలంగాణలో పోటీ నుంచి విరమించుకోవడం ద్వారా ఆమె తన రాజకీయ భవిష్యత్ ను కాపాడుకున్నారు. ఇక నుంచి ఆమె రాజకీయ పురోగతి అంతా ఏపీలో కాంగ్రెస్ ను ఆమె ఎలా నడిపించారు అన్నదానిపైనే ఆధారపడి ఉంటుంది. కాంగ్రెస్ హైకమాండ్ మాత్రం ఇలా షర్మిల పార్టీలో చేరగానే అలా ఏపీ సారథ్యం అప్పగించడం ద్వారా అమెపై అపారమైన విశ్వాసాన్ని ఉంచింది. ఆ విశ్వాసాన్ని కాపాడుకోవడానికి షర్మిల చాలా శ్రమించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఏపీలో ఆమె ఎదుర్కోవలసింది, పోరాడాల్సింది తోడబుట్టిన జగన్ మోహనరెడ్డితో, ఆయన పార్టీ వైసీపీతో. ఇందు కోసం షర్మిల కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి రావొచ్చని చెబుతున్నారు. అందులో మొదటిది తాను స్వయంగా కడప పార్లమెంట్ లేదా పులివెందుల అసెంబ్లీకి పోటీ చేయడం. షర్మిల ముందున్న టాస్క్ఆషామాషీది ఏమీ కాదు. అతి స్వల్ప సమయం అంటే మహాఅయితే రెండు మూడు నెలలలో ఆమె ఏపీలో తన మార్క్ చూపాల్సి ఉంటుంది. వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ ను రాష్ట్రంలో అధికారంలోకి తీసుకురాలేకపోయినా.. కొన్ని స్థానాలలో గెలిపించుకోవలసి ఉంటుంది. ఇందు కోసం ఆమె తీసుకునే ప్రతి నిర్ణయానికీ అధిష్ఠానం నుంచి సంపూర్ణ మద్దతు ఉంటుందనడంలో సందేహం లేదు.
పార్టీలోకి ఎవరిని తీసుకోవాలి, ఎవరికి టికెట్లు కేటాయించాలి వంటి అంశాలలో షర్మిలకు కాంగ్రెస్ హై కమాండ్ పూర్తి స్వేచ్ఛను ఇస్తుందనడంలో సందేహం లేదు. సో వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందన్నది పూర్తిగా ఆమె తీసుకునే నిర్ణయాలపైనే ఆధారపడి ఉంటుంది. అందుకే షర్మిల కాంగ్రెస్ ఏపీ సారథిగా ఆచితూచి అడుగులు వేయాల్సి ఉంటుంది. రాష్ట్రంలో ఏ మేరకు కాంగ్రెస్ పుంజుకుంటుంది అన్నదానిపైనే షర్మిల రాజకీయ భవిష్యత్ ఆధారపడి ఉంటుంది. అందుకే వచ్చే ఎన్నికలు షర్మిలకు నిజమైన పరీక్షగా పరిశీలకులు అభివర్ణిస్తున్నారు.