
Israeli Strike On Syria: ఇజ్రాయిల్ సిరియాపై విరుచుకుపడింది. రాజధాని డమాస్కస్‌పై దాడులు చేసింది. ఈ దాడుల్లో సిరియాకు చెందిన ఇరానియన్ రివల్యూషనరీ గార్డ్స్ ఇంటెలిజెన్స్ చీఫ్ మరియు అతని డిప్యూటీతో పాటు మరో ఇద్దరు గార్డ్స్ సభ్యులు శనివారం మరణించినట్లు ఇరాన్ మీడియా నివేదించింది. రివల్యూషనరీ గార్డ్స్ ఒక ప్రకటనలో.. సిరియా రాజధానిపై జరిగిన స్ట్రైక్స్‌లో నలుగురు సభ్యులు మరణించినట్లు ధృవీకరించింది. ఈ దాడి వెనక ఇజ్రాయిల్ ఉందని ఆరోపించింది. సిరియాలో కుద్స్ ఫోర్స్ ఉన్నతాధికారి జనరల్ సాదేగ్ ఒమిద్జాదే, అతడి డిప్యూటీ హజ్ గోలమ్‌లు చనిపోయినవారిలో ఉన్నట్లు సమాచారం.
డమాస్కస్‌లోని మజ్జే పరిసరాల్లోని నివాస భవనాన్ని ఇజ్రాయిల్ టార్గెట్ చేసింది. ఇరాక్ ఉత్తర ప్రావిన్స్ కుర్దిస్తాన్ రాజధాని అర్బిల్లోని “ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ హెడ్‌క్వార్టర్స్”పై రెవల్యూషనరీ గార్డ్ దాడి చేసిన నాలుగు రోజుల తర్వాత ఇజ్రాయిల్ దాడి చేసింది. ఈ దాడిలో నలుగురితో పాటు మరో ఆరుగురు మొత్తంగా 10 మంది మరణించినట్లు సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్ చీఫ్ రమీ అబ్దెల్ రెహమాన్ తెలిపారు. వెనిజులా, దక్షిణాఫ్రికా రాయబార కార్యాలయాలు ఉన్న సమీపంలో ఈ దాడి జరిగినట్లు సిరియా స్టేట్ టీవీ తెలిపింది. ఇజ్రాయిల్ నాలుగు అంతస్తుల భవనం ధ్వంసమైనట్లు అధికారులు వెల్లడించారు. అయితే ఈ దాడులపై ఇజ్రాయిల్ స్పందించలేదు.