జనవరిలోనే అయోధ్య రామమందిర ప్రాణప్రతిష్ఠ.. బీజేపీ రాజకీయ లబ్థి కోసమేనా? | bjp political favour strategy behind rama mandir| opposition| allege| pithadipatis| object
posted on Jan 20, 2024 9:15AM
బీజేపీ ఈరోజున జాతీయ స్థాయిలో అత్యంత శక్తివంతమైన రాజకీయ శక్తిగా ఎదిగింది. అందులో అనుమానం లేదు. వరసగా రెండు సార్లు అంటే 2014, 2019 సార్వత్రిక ఎన్నికలలో విజయం సాధించింది. ఎన్డీయే కూటమికి నేతృత్వం వహిస్తూ, కేంద్రంలో ఆ కూటమి సంకీర్ణ ప్రభుత్వానికి సారథ్యం వహిస్తున్నప్పటికీ బీజేపీకి స్వయంగా సంపూర్ణ మెజారిటీ ఉంది. ఆ రకంగా చెప్పాలంటే దేశంలో మూడు దశాబ్దాలకు పైగా నడుస్తున్న సంకీర్ణ రాజకీయ చరిత్రను బీజేపీ తిరగరాసింది. కేంద్రంలోనే కాకుండా దేశంలోని సగానికి పైగా రాష్ట్రాలలో అధికారంలో వుంది. ఇవన్నీ వాస్తవాలే.. అయితే ఈ విజయం వెనుక విపక్షాల బలహీనత, అనైక్యత ఎంత కారణమో అంత కంటే ఎక్కువగా అయోధ్య రామమందిరం పేరిట ఆ పార్టీ దేశ ప్రజలలో ఎగదోసిన భావోద్వేగం కారణం అనడానికి సందేహం అవసరం లేదు.
1990వ దశకంలో దేశాన్ని కదిలించిన రామజన్మ భూమి ఆందోళన..అద్వానీ రథ యాత్ర. దేశంలో బీజేపీ బలోపేతం కావడానికి పునాదులు వేశాయి. అవును నిజం. 1990 లో అప్పటి ప్రధాని వీపీ సింగ్ ప్రభుత్వం మండల్ కమిషన్ చేసిన సిఫార్సుల ఆధారంగా వెనక బడిన కులాలకు 27 శాతం రిజర్వేషన్ కల్పించే బిల్లును తెచ్చింది. వీపీ సింగ్ ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా అగ్రవర్ణాల ప్రజలు ఆందోళనకు దిగారు. అదే సమయంలో వీపీ సింగ్ ప్రభుత్వ రాజకీయ ఎత్తుగడకు జవాబుగా బీజేపీ అప్పటికే విశ్వ హిందూ పరిషత్ ఇతర సంఘ పరివార్ సంస్థలు సాగిస్తున్న రామ జన్మభూమి ఆందోళనకు మద్దతు ప్రకటించింది. ప్రకటించి ఊరుకోకుండా, బీజేపీ అప్పటిఅధ్యక్షుడు ఎల్కే అద్వానీ 1990లో రథ యాత్ర చేపట్టారు.ఇక ఆ తర్వాత 1992 డిసెంబర్ 6న అయోధ్యలోని వివాదాస్పద కట్టడం, (బాబ్రీ మసీదు) కూల్చివేత వరకూ సాంస్కృతిక జాతీయవాదం పేరిట బీజేపీ సాగించిన ప్రయాణమే బీజేపీ ఎదుగుదలకు బీజం వేసింది. కారణమైంది.
ఇక అప్పటి నుంచి బీజేపీ, ప్రతి ఎన్నికలలోనూ తమ పార్టీ అధికారంలోకి వస్తే రామజన్మభూమి అయోధ్యలో రామ మందిరం నిర్మిస్తామని వాగ్దానం చేస్తూనే వుంది. అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి సుప్రీం కోర్టు 2019 నవంబర్ లో అనుమతి ఇచ్చింది. ప్రధాని నరేంద్ర మోడీ, 2020 ఆగష్టులో శంకుస్థాపన చేశారు.
2024 సార్వత్రిక ఎన్నికలలో బీజేపీ ఇదే రామమందిర నిర్మాణం నినాదంతో ఎన్నికలకు వెడుతోంది. రామమందిర నిర్మాణం పూర్తి చేశామని చెప్పుకుని ప్రచారం చేయడానికి హడావుడి పడుతోంది. ఇందు కోసం కేంద్రంలోని మోడీ ప్రభుత్వం.. దేశంలో పుంజుకుంటున్న కాంగ్రెస్ పార్టీని బలహీనపరిచేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నది. సరిగ్గా సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడానికి రోజులు లేదా వారాల ముందుగా అంటే సోమవారం (జనవరి 22) రామమందిర ప్రాణ ప్రతిష్ఠకు ముహూర్తం ఖరారు చేసింది. ఏకపక్షంగా ఎన్నికల సమయం చూసుకుని మరీ రాజకీయలబ్ధి కోసం మోడీ సర్కార్ ప్రయత్నిస్తున్నదన్న విమర్శలు సహజంగానే వెల్లువెత్తాయి. అన్నిటికీ మించి రామమందిర ప్రాణప్రతిష్ట కార్యక్రమాన్ని బీజేపీ సొంత కార్యక్రమంలో నిర్వహిస్తుండటం కూడా విపక్షాలు తప్పుపడుతున్నాయి.
ఆ కారణంగానే కాంగ్రెస్ ఈ కార్యక్రమానికి హాజరు కాబోవడం లేదని ప్రకటించింది. అంటే బీజేపీ పన్నిన వ్యూహంలో కాంగ్రెస్ చిక్కుకున్నట్లే అయ్యింది. రామ మందిర నిర్మాణానికి కాంగ్రెస్ వ్యతిరేకమని, అయోధ్యలో రామమందిర నిర్మాణం విషయంలో తొలి నుంచీ కాంగ్రెస్ అలాగే వామపక్ష పార్టీలూ అడ్డుకుంటూ వస్తున్నాయనీ బీజేపీ అగ్రనాయకత్వం విమర్శలు గుప్పిస్తూ, అసలు రామమందిర నిర్మాణం ఇంత కాలం జాప్యం కావడానికి కాంగ్రెస్, లెఫ్ట్ ఇతన లౌకికవాద పార్టీలే కారణమంటూ నిందిస్తోంది. అదే సమయంలో కాంగ్రెస్ ను హిందూ వ్యతిరేక పార్టీగా చిత్రీకరించి ఎన్నికల లబ్ధి కోసం ప్రయత్నిస్తున్నది.
అయితే బీజేపీ రాజకీయ ప్రయోజనాల కోసం హిందుత్వ కార్డ్ ను అడ్డగోలుగా వాడేస్తున్నదనీ, ఇందు కోసం ధర్మశాస్త్రాన్నీ, ఆగమ శాస్త్రాన్నీ కూడా పక్కన పెట్టేసి సొంత రాజకీయ శాస్త్రాన్ని అనుసరిస్తోందనీ దేశంలోని ప్రతిష్ఠాత్మక పీఠాల అధిపతులు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి.
ఆధ్యాత్మిక వ్యాప్తి కోసం ఆదిశంకరాచార్యుడు దేశంలోని నాలుగు ప్రాంతాలలో ధర్మం నాలుగు పాదాలా నడవాలన్న ఉద్దేశానికి సంకేతంగా నెలకొల్పిన ఉత్తరాఖండ్ లోని జ్యోతిష్యపీఠం, గుజరాత్ లోని ద్వారకా పీఠం, ఒడిశాలోని పూరీ పీఠం, కర్నాటకలోని శృంగేరీ పీఠాల ప్రస్తుత అధిపతులు అయోధ్య రామమందిర ప్రాణప్రతిష్ట ముహూర్తాన్ని తప్పు పట్టారు. ఆగమశాస్త్ర విరుద్ధంగా ఆలయ నిర్మాణం పూర్తికాకుండానే ప్రాణప్రతిష్ట చేయడం ధర్మ విరుద్ధమని చాటారు. అంతే కాకుండా శుభప్రదమైన నెల కాదని ఈ నెలలో ఆలయ ప్రాణప్రతిష్ట కార్యక్రమం సమంజసం కాదనీ, శుభకరం కాదనీ పీఠాధిపతులు అంటున్నారు.
ఈ నేపథ్యంలోనే రామమందిర ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని అన్ని అభ్యంతరాలూ తోసి పుచ్చి సరిగ్గా ఎన్నికల వేళ ముహూర్తాన్ని నిర్ణయించడం రాజకీయ లబ్ధి కోసమేనన్న విమర్శలకు బలం చేకూరుతోంది.