రేవంత్ మద్దతు దారులకు కీలక పోస్టింగులు | mallu ravi telangana government special representative in delhi| three| advisors| cabinet| rank| postings
posted on Jan 21, 2024 1:01PM
పాలనలో చంద్రబాబును, నమ్మకున్న వారికి న్యాయం చేయడంలో వైఎస్ ను తలపిస్తూ రేవంత్ ముఖ్యమంత్రిగా సత్తా చాటుకుంటున్నారు. నామినేటెడ్ పదవుల నియామకంలో రేవంత్ సర్కార్ స్పీడ్ పెంచింది. ముగ్గురు సలహాదారులను నియమించింది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలలో క్రియాశీలంగా వ్యవహరించి పార్టీ విజయానికి తమ వంతు దోహదం చేసిన కీలక నేతలకు కేబినెట్ హోదాతో కూడిన సలహాదారు పదవులలో నియమించింది. ప్రభుత్వం తాజాగా చేపట్టిన నియామకాల ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట నిలుపుకున్నట్లు అయ్యింది.
మాట ఇస్తు తప్పనన్న నమ్మకాన్ని రేవంత్ పార్టీలో కలిగించగలిగారు. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సోదరుడు మల్లు రవిని ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిథిగా నియమిస్తూ రేవంత్ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. అదే విధంగా సీఎం సలహాదారుగా మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్ రెడ్డిని, ప్రభుత్వ సలహాదారులుగా మాజీ మంత్రి షబ్బీర్ అలీ, సీనియర్ నేత వేణుగోపాల్ ను నియమించింది. మొత్తం ఈ నాలుగు నియామకాలతో కాంగ్రెస్ సర్కార్ నామినేటెడ్ పదవుల భర్తీపై దృష్టి పెట్టింది. షబ్బీర్ అలీ ఎస్సీఎస్టీ, బీసీ మైనారిటీ వ్యవహారాల సలహాదారుగా, ప్రొటోకాల్, పబ్లిక్ రిలేషన్స్ సలహాదారుగా వేణుగోపాల్ బాధ్యతలు నిర్వర్తించనున్నారు.ఇదే జోరులో రానున్న రోజులలో మరిన్ని నామినేటెడ్ పోస్టుల భర్తీకి రేవంత్ సర్కార్ సమాయత్తమౌతోంది.
ప్రభుత్వ సలహాదారుల నియామకం ద్వారా నలుగురు కీలక నేతలకు పోస్టింగులు ఇచ్చిన నలుగురూ కూడా సీఎం రేవంత్ కు అత్యంత సన్నిహితుల కావడం ఇక్కడ ప్రత్యేకించి ప్రస్తావించాల్సిన అవసరం ఉంది. వేం నరేందర్ రెడ్డి రేవంత్ కు ఆయన తెలుగుదేశంలో ఉన్నప్పటి నుంచే సన్నిహితుడు. ఓటుకు నోటు కేసులో వేం నరేందర్ రెడ్డి కూడా జైలుకు వెళ్లిన సంగతి విదితమే. కాంగ్రెస్ లో చేరిన తరువాత కూడా వేం నరేందర్ రెడ్డి రేవంత్ కు అత్యంత సన్నిహితుడిగానే ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికలలో పోటీ కోసం టిక్కెట్ అంటూ ఒత్తిడి చేయలేదు. రేవంత్ పీసీసీ పగ్గాలు చేపట్టిన సమయంలో పార్టీలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైన సమయంలో కూడా వే నరేందర్ రెడ్డి రేవంత్ కు గట్టి మద్దతుదారుగా నిలబడ్డారు. ఇప్పుడు రేవంత్ ఆయనకు కేబినెట్ హోదా ఇచ్చారు.
ఇక మల్లు రవి కూడా రేవంత్ కు నమ్మకమైన నేతగా, సన్నిహితుడిగా ఉన్నారు. షబ్బీర్ అలీ కూడా రేవంత్ నే సమర్థిస్తున్నారు. అలా తనకు కష్టకాలంలో మద్దతుగా నిలిచిన వారందరికీ రేవంత్ పదవులు కట్టబెట్టారని చెప్పారు. ఇక త్వరలో ఆర్టీసీ ఛైర్మన్ సహా మరికొన్ని కీలక పదవుల నియామకానికి కూడా రేవంత్ సీరియస్ గా కసరత్తు చేస్తున్నారని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఇక పార్టీలో తనకు గట్టి మద్దతు ఇచ్చిన అద్దంకి దయాకర్ కు కూడా వచ్చే సార్వత్రిక ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇచ్చే దిశగా రేవంత్ యోచిస్తున్నట్లు చెబుతున్నారు.