Leading News Portal in Telugu

IND vs ENG: రాహుల్ vs భరత్‌.. వికెట్‌ కీపర్‌ ఎవరు! తెలుగోడిపై నమ్మకం పెడతారా?


IND vs ENG: రాహుల్ vs భరత్‌.. వికెట్‌ కీపర్‌ ఎవరు! తెలుగోడిపై నమ్మకం పెడతారా?

KS Bharat to play as a specialist wicketkeeper in IND vs ENG Test Series: ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు భారత్ సిద్ధమవుతోంది. జనవరి 25న హైదరాబాద్‌లోని రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్‌ స్టేడియంలో తొలి టెస్ట్ ఆరంభం కానుంది. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ సైకిల్‌లో ఫైనల్ చేరాలంటే ఇరు జట్లకు ఈ సిరీస్ కీలకం. అందుకే భారత్, ఇంగ్లండ్‌ గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగనున్నాయి. అయితే భారత వికెట్‌ కీపర్‌గా ఎవరు ఆడతారు? అనే చర్చ ఇప్పుడు సోషల్ మీడియాలో జోరందుకుంది. దక్షిణాఫ్రికా పర్యటనతో తొలిసారి టెస్టుల్లో వికెట్‌ కీపింగ్‌ చేసిన కేఎల్‌ రాహుల్‌ను కొనసాగిస్తారా? లేదా సెంచరీతో సత్తాచాటిన తెలుగు ఆటగాడు కేఎస్‌ భరత్‌పై నమ్మకం పెడతారా? అన్నది ఆసక్తి రేపుతోంది. మొదటిసారి జట్టులోకి వచ్చిన యూపీకి చెందిన యువ వికెట్‌ కీపర్‌ ధ్రువ్‌ జురెల్‌కు ఇప్పుడే ఛాన్స్‌ ఇవ్వకపోవచ్చు.


ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌ల కోసం బీసీసీఐ సెలెక్టర్లు ప్రకటించిన భారత జట్టులో కేఎల్‌ రాహుల్‌, కేఎస్‌ భరత్‌తో పాటు ధ్రువ్‌ జురెల్‌ కూడా వికెట్‌ కీపర్లుగా ఉన్నారు. దక్షిణాఫ్రికా పర్యటనలో టెస్టు జట్టులో భరత్‌ ఉన్నా.. టీమిండియా రాహుల్‌తోనే బరిలోకి దిగింది. మానసిక ఆందోళన కారణంగా విరామం తీసుకున్న ఇషాన్‌ కిషన్‌ స్థానంలో ధ్రువ్‌ జురెల్‌ జట్టులోకి వచ్చాడు. ఇప్పుడే జురెల్‌కు అరంగేట్ర అవకాశం రావడం కష్టమనే చెప్పాలి. దీంతో ప్రధాన పోటీ రాహుల్‌, భరత్‌ మధ్య నెలకొంది.

కేఎల్‌ రాహుల్‌ వన్డేల్లో వికెట్‌ కీపర్‌గా, మిడిలార్డర్‌లో బ్యాటింగ్‌ చేస్తున్నాడు. ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన రెండు టెస్టుల్లో కీపర్‌గా, మిడిలార్డర్‌లో ఆడాడు. బ్యాటర్‌గా రాహుల్‌కు తిరుగులేకున్నా.. కీపర్‌గా పెద్దగా అనుభవం లేదు. 92 ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌ల్లో మూడు సార్లు మాత్రమే కీపింగ్‌ చేశాడు. అవి కూడా విదేశాల్లోనే. అయితే భారత్‌లో పరిస్థితులు వేరు. ఆర్ అశ్విన్‌, ఆర్ జడేజా, అక్షర్‌ పటేల్, కుల్దీప్ యాదవ్ లాంటి స్పిన్నర్ల బౌలింగ్‌లో కీపింగ్‌ చేయడం సవాలుతో కూడుకున్నదే. ఒక్క అవకాశం చేజారినా.. అది మ్యాచ్‌లో తీవ్ర ప్రభావాన్ని చూపొచ్చు. వన్డేల్లో వికెట్‌ కీపర్‌గా రాహుల్‌ రాణిస్తున్నా.. టెస్టులో చాలా అనుభవం అవసరం.

కేఎస్‌ భరత్‌కు కీపింగ్‌లో మంచి అనుభవం ఉంది. అయితే రిషబ్ పంత్‌, ఇషాన్‌ కిషన్, లోకేష్ రాహుల్‌ కారణంగా అతడికి జట్టులో ఎక్కువగా అవకాశాలు రావడం లేదు. బ్యాటింగ్‌ వైఫల్యంతో దొరికిన అవకాశాలనూ వృథా చేసుకున్నాడు. 2023లో సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌తో అరంగేట్రం చేసిన భరత్‌.. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్లో ఆడాడు. 8 ఇన్నింగ్స్‌ల్లో 18.42 సగటుతో 129 పరుగులు మాత్రమే చేశాడు. కీపింగ్‌లో భరత్‌కు తిరుగులేదు. 91 ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌ల్లో 287 క్యాచ్‌లు, 33 స్టంపింగ్‌లు చేశాడు. ఇంగ్లండ్ లయన్స్‌తో జరిగిన ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో హాఫ్ కిన్తురీ, ఇంగ్లండ్ లయన్స్‌తో తొలి అనధికార టెస్టులో సెంచరీ బాదాడు. దాంతో ఇంగ్లండ్‌తో సిరీస్‌లో భరత్‌ను స్పెషలిస్టు కీపర్‌గా ఆడించి.. రాహుల్‌ను బ్యాటర్‌గా కొనసాగించే అవకాశాలు ఉన్నాయి.