Leading News Portal in Telugu

IND vs ENG: మరో 10 వికెట్స్.. టెస్టుల్లో చరిత్ర సృష్టించనున్న అశ్విన్!


IND vs ENG: మరో 10 వికెట్స్.. టెస్టుల్లో చరిత్ర సృష్టించనున్న అశ్విన్!

R Ashwin 10 Wickets Short Of Creating History in Tests: భారత్‌, ఇంగ్లండ్‌ జట్ల మధ్య ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు సమయం అసన్నమవుతోంది. తొలి టెస్టు జనవరి 25 నుంచి హైదరాబాద్‌ వేదికగా ప్రారంభం కానుంది. ఈ హైవోల్టేజ్‌ మ్యాచ్‌ కోసం ఇరు జట్లు ప్రాక్టీస్ చేస్తున్నాయి. ఈ టెస్ట్ కోసం ఇంగ్లండ్ జట్టు ఇప్పటికే హైదరాబాద్ చేరుకోగా.. నేడు భారత జట్టు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ టెస్ట్ సిరీస్ టీమిండియా వెటరన్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌కి ప్రత్యేకంగా నిలవనుంది.


టెస్టు చరిత్రలో తన పేరును సువర్ణాక్షరాలతో లిఖించే అవకాశం రవిచంద్రన్ అశ్విన్‌కు ఉంది. టెస్ట్ క్రికెట్‌లో ఎలైట్ రికార్డ్ సాధించడానికి కేవలం 10 వికెట్ల దూరంలో ఉన్నాడు. అశ్విన్ ఇప్పటివరకు భారత్ తరపున 95 టెస్టు మ్యాచ్‌లు ఆడి.. 179 ఇన్నింగ్స్‌లలో 23.7 సగటుతో 490 వికెట్లు తీశాడు. 500 టెస్ట్ వికెట్ల మైలురాయిని చేరుకోవడానికి 10 వికెట్ల దూరంలో ఉన్నాడు. సొంతగడ్డపై యాష్ అద్భుత ప్రదర్శనను పరిశీలిస్తే.. హైదరాబాద్‌లో జరిగే మొదటి టెస్టులో 500వ టెస్ట్ వికెట్ల మార్క్‌ను చేరుకునే అవకాశం ఉంది. భారత మాజీ కెప్టెన్‌ అనిల్‌ కుంబ్లే ప్రస్తుతం టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా ఉన్నాడు. కుంబ్లే 132 టెస్టు మ్యాచ్‌లలో 619 వికెట్లు పడగొట్టాడు.

ఇంగ్లండ్‌తో తొలి రెండు టెస్ట్‌లకు భారత జట్టు: రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), యశస్వి జైస్వాల్‌, శుభ్‌మన్‌ గిల్‌, విరాట్‌ కోహ్లీ, శ్రేయస్‌ అయ్యర్‌, రవిచంద్రన్‌ అశ్విన్‌, రవీంద్ర జడేజా, అక్షర్‌ పటేల్‌, కేఎల్‌ రాహుల్‌, కేఎస్‌ భరత్‌, దృవ్‌ జురెల్‌, కుల్దీప్‌ యాదవ్‌, ముకేశ్‌ కుమార్‌, మొహమ్మద్‌ సిరాజ్‌, జస్ప్రీత్‌ బుమ్రా, ఆవేశ్‌ ఖాన్‌.
భారత్‌తో సిరీస్‌కు ఇంగ్లండ్ క్రికెట్ జట్టు: బెన్ స్టోక్స్ (కెప్టెన్), రెహాన్ అహ్మద్, జేమ్స్ ఆండర్సన్, గుస్ అట్కిన్సన్, జానీ బెయిర్‌స్టో (వికెట్ కీపర్), షోయబ్ బషీర్, జాక్ క్రౌలీ, బెన్ డకెట్, బెన్ ఫోక్స్, టామ్ హార్ట్లీ, జాక్ లీచ్, ఒల్లీ పోప్, రాబిన్సన్, జో రూట్, మార్క్ వుడ్.