సజ్జల బాధ..ఓదార్పు ఏది? | no solace to sajjala pain| suffer| incur| affliction| annoyance| sharmila| criticize| jagan
posted on Jan 22, 2024 9:39AM
ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న వైసీపీలో జగన్ తరువాత ఆ స్థాయిలో పెత్తనం, పెత్తందారి తనం చేసేవారెవరైనా ఉన్నారంటే అది సకల శాఖల మంత్రిగా గుర్తింపు పొందిన ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మాత్రమే. పార్టీలో కానీ, ప్రభుత్వంలో కానీ ఏ కీలక నిర్ణయాన్ని ప్రకటించాలన్నీ, ప్రధాన విధానాలను వివరించాలన్నా, నియోజకవర్గ ఇన్ చార్జ్ లను ఉంచాలా, మార్చేయాలా? ఎవరికి టికెట్లు ఇవ్వాలి, ఎవరికి నిరాకరించాలి వంటి ప్రతి విషయంలోనూ, ప్రతి నిర్ణయంలోనూ కీలకంగా వ్యవహరించేది సజ్జల మాత్రమేనని అందరికీ తెలిసిందే.
అటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి వైఎస్ షర్మిల కాంగ్రెస్ ఏపీ పగ్గాలు చేపట్టిన సందర్భంగా చేసిన వ్యాఖ్యలు తనను చాలా చాలా బాధపెట్టాయని దాదాపు కన్నీరు పెట్టుకున్నంత పని చేశారు. తననే కాదు.. సాక్షాత్తూ షర్మిల సోదరుడు జగన్ ను, పార్టీ నేతలు, కార్యకర్తలనూ కూడా షర్మిల వ్యాఖ్యలు బాధించాయని ఆయన చెబుతున్నారు. మీడియా ముందుకు వచ్చిన ప్రతి సారి ప్రతిపక్షాలను, ప్రతిపక్ష నేతలనూ తూర్పారపట్టడం, జగన్ సర్కార్ తప్పిదాలను సమర్ధించడం తప్ప మరో మాట మాట్లాడని సజ్జల తొలి సారిగా షర్మిల వ్యాఖ్యలు బాధించాయంటూ తెగబాధపడిపోయారు.
ఇంత కాలం వైసీపీ నేతలు వాడిన బాష, ప్రతిపక్ష నేతలు, వారి కుటుంబ సభ్యులపై చేసిన దూష ణలను ఒక్క సారి కూడా మీడియా ముందుకు వచ్చి ఖండిచని సజ్జల.. షర్మిల వైఎస్ జగన్ సర్కార్ తప్పిదాలను, ఆర్థిక అరాచకత్వాన్ని, జగన్ హయాంలో రాష్ట్రంలో కనిపించని ప్రగతిని, సరిగ్గా పంపిణీ కాని సంక్షేమాన్ని ప్రశ్నించడం తనను తీవ్రంగా బాధించిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన ప్రషర్మిల వాడిన భాష సరికాదంటూ సూక్తులు చెప్పారు. ఆమె ఏపీ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టడం, జగన్ ప్రభుత్వాన్ని విమర్శించడం వైఎస్ కుటుంబానికి ద్రోహం చేయడంగా అభివర్ణించారు. అసలు ఆమె కాంగ్రెస్ గూటికి చేరడమే తప్పన్నారు. కాంగ్రెస్ పార్టీ వైఎస్ కుటుంబానికి ఎంతో ద్రోహం చేసిందని చెప్పారు.
అదే సమయంలో వైసీపీ విజయం కోసం, అన్న జగన్ ను ముఖ్యమంత్రి చేయడం కోసం ఒక చెల్లెలుగా షర్మిల పడిన శ్రమ, చేసిన త్యాగం గురించి మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అలాగే ఏపీ ముఖ్యమంత్రిగా జగన్ అధికార పగ్గాలు చేపట్టిన తరువాత.. తాను ఆ స్థానంలో కూర్చోవడానికి శ్రమపడి, చెమట చిందించి, కాళ్లు అరిగేలా నడిచి, గొంతు చిరిగేలా ప్రచారం చేసిన షర్మిలను రాష్ట్రం నుంచి తరిమేదాకా ఊరుకోని జగన్ ద్రోహం గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అంతెందుకు షర్మిల తెలంగాణలో వైఎస్సార్టీపీ పేరిట సొంత రాజకీయ పార్టీని ఏర్పాటు చేసిన సమయంలో ఆమె రాజకీయాలతో కానీ, ఆమె పార్టీతో కానీ వైసీపీకి కానీ జగన్ కు కానీ ఎటువంటి సంబంధం లేదని మీడియా సమావేశం పెట్టి మరీ వైఎస్ కుటుంబంలో ఆమె ఏకాకి అని తానే స్వయంగా చాటిన విషయం పాపం సజ్జలకు గుర్తు రాలేదు.
ఇక తెలంగాణలో పార్టీ నడపడానికి అవసరమైన ఆర్థిక వనరులు షర్మిలకు అందకుండా చేసిన విషయమూ గుర్తు రాలేదు. ఇప్పడు సొంత చెల్లి తన రాజకీయ భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకుని తన నిర్ణయం తాను తీసుకుంటే మాత్రం ఎక్కడలేని బాధా సజ్జలలో తన్నుకొచ్చేసోతోందని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. ఇక షర్మిల ఏపీ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టిన తరువాత చేసిన తొలి ప్రసంగంలో జగన్ మణిపూర్ హింసాకండపై మౌనంగా ఉండటాన్నిప్రశ్నిస్తూ, ఆయన క్రైస్తవుడేనా అని ప్రశ్నించడాన్ని జగన్ పార్టీ తట్టుకోలేకపోతోందని అంటున్నారు.
ఇక షర్మిల ఇలా ఏపీ కాంగ్రెస్ పగ్గాలు అందుకున్నారో లేదో అలా వైసీసీ సోషల్ మీడియా వింగ్ ఆమెను టార్గెట్ చేస్తూ దూషణల పర్వాన్ని ప్రారంభించేసింది. అంత దాకా ఎందుకు ఆమె ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు స్వీకరించడానికి ముందే ఆమె కాన్వాయ్ ను అడ్డుకుని, దారి మల్లించి వైసీపీ సర్కార్ నిర్బంధకాండను ప్రారంభించేసింది.
జగన్ పాలనలో రాష్ట్రం అధోగతికి చేరుకుందని కాంగ్రెస్ ఏపీ అధినేత్రిగా షర్మిల విమర్శలు నేరుగా సూటిగా ఉండటమే కాకుండా.. ఎన్నికల ప్రచారంలో జగన్ చేసిన వాగ్దానాలను ఎత్తి చూపుతో, వాటిని నెరవేర్చడంలో ఎలా విఫలమయ్యారో పూసగుచ్చినట్లు వివరించడం సహజంగానే సజ్జలను బాధపెట్టింది. షర్మిల జగన్ రెడ్డిని నేరుగా టార్గెట్ చేయడం ద్వారా జగన్ తీరుపై అసంతృప్తితో ఉన్న వైసీపీ నేతలకు పరోక్షంగానైనా ఆహ్వానం పలికారు. ఇది సజ్జలను అమితంగా బాధపెట్టింది. సిట్టింగుల మార్పు పేరున చేస్తున్న ప్రయోగం కారణంగా ఇప్పటికే పలువురు పార్టీకి గుడ్ బై చెప్పేశారు. ఇకా మరింత మంది తమ దారి తాము చూసుకోవడానికి దిక్కులు వెతుకుతున్నారు. అటువంటి వారందరికీ తన ప్రసంగం ద్వారా షర్మిల కాంగ్రెస్ గేట్లు తెరిచే ఉన్నాయని చాటారు. వారికి మార్గం చూపడానికా అన్నట్లు తాను ఇలా ఏపీ కాంగ్రెస్ పగ్గాలు చేరగానే మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇలా కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. అలాగే ఒకప్పుడు వైఎస్ రాజశేఖరరెడ్డికి అత్యంత ఆప్తులుగా ఉన్న కేవీపీ, రఘువీరా వంటి నేతలు షర్మిల పక్కన నిలబడి వైఎస్ రాజకీయ వారసురాలు ఆమె మాత్రమేనని చాటేశారు. దీంతో పార్టీ నుంచి వలసలు వెల్లువెత్తడం ఖాయమన్న భయమే సజ్జలలో బాధకు కారణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మొత్తం మీద షర్మిల ఏపీ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టడంతో వైసీపీ నేతలూ, శ్రేణులే కాదు, అగ్రనాయకత్వం కూడా భయంతో వణికి పోతోందని సజ్జల బాధ లోకానికి చాటింది.