ఏపీ వేదికగా అన్నా చెల్లెళ్ల రాజకీయ రణం! | jagan sharmila political fight| arena| ap| apcc| chief| police
posted on Jan 22, 2024 2:22PM
ఏపీలో ఇప్పుడు వైఎస్ కుటుంబ రాజకీయ రణం ఓ రేంజ్ లో ప్రారంభమైంది. ఏపీ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టేందుకు షర్మిల రాష్ట్రంలో ఎంట్రీ ఇచ్చారు. రాజధాని నగరానికి వచ్చే దారిలో ఆమె కాన్వాయ్ ను పోలీసులు అడ్డగించడంతో రానున్న రోజులలో అన్నా చెళ్లెల్ల పొలిటికల్ వార్ ఏ స్థాయిలో సాగనుందన్న విషయం అందరికీ అవగతమైంది. ఈ వార్ లో మాటల తూటాలే కాదు, కుటుంబ రహస్యాలూ ఫైర్ వర్క్స్ మాదిరిగా ఆకాశమే హద్దుగా బయటకు వస్తాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
అన్నయ్య జగన్ సర్కార్ పతనమే అజెండాగా చెల్లి షర్మిల ఏపీలో అడుగుపెట్టారు. ఆమె కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలిగా బాధ్యత తీసుకోవడానికి ముందే ఏపీలో పోలీసు వ్యవస్థ పంజా విసిరింది. అన్న సర్కార్ ఇలా ఆదేశాలు జారీ చేసిందో లేదో.. అలా పోలీసులు ఆమె కాన్వాయ్ ని అడ్డుకున్నారు. అయితే ఇటువంటి ఉడుత బెదరింపులకు బెదిరే రకం కాదు వైఎస్ బిడ్డ షర్మిల. అసలే ఫైర్ బ్రాండ్.. ఈ ఘటనే నాందిగా ఆమె అన్న సర్కార్ పై నిప్పులు చెరిగారు. ఏపీ కాంగ్రెస్ దళపతిగా పదవీ బాధ్యతలు స్వీకరించేందుకు ఆదివారం, గన్నవరం నుంచి బెజవాడకు భారీ కాన్వాయ్‌లో పార్టీ ఆఫీసుకు బయలుదేరారు. వెంటనే పోలీసులు రంగప్రవేశం చేశారు. ర్యాలీకి అనుమతి లేదంటూ కాన్వాయ్ ని ఆపేశారు. దారి మళ్లాలని ఆదేశించారు. అయితే షర్మిల ససేమిరా అన్నారు. ఏపీలో నియంత పాలన నడుస్తోంది. కాంగ్రెస్ పార్టీని చూసి జగన్ సర్కారు వణికిపోతోంది. అంటూ ఎలుగెత్తారు.
అక్కడితో ఆగకుండా ఏంటి సార్ మమ్మల్ని చూసి భయపడుతున్నారా? ఇదేమైనా ఇండియా పాకిస్తాన్ బోర్డరా? మీ అక్రమాలిక సాగవు. కార్యకర్తల కోసం జైలుకయినా వెళతా అంటూ షర్మిల చేసిన ఘాటు వ్యాఖ్యలు సోషల్‌మీడియాలో వైరల్ అయ్యాయి. పోలీసుల వైఖరికి నిరసనగా షర్మిల అక్కడే రోడ్డుపై బైఠాయించారు. దానితో దిగొచ్చిన పోలీసులు షర్మిల కాన్యాయ్‌ను అనుమతించారు. ఈ పరిణామంతో గంటల తరబడి ట్రాఫిక్ చాలాసేపు జామయింది. తాడేపల్లి ప్యాలెస్ ఆదేశాల మేరకే.. పోలీసులు ఓవరాక్షన్ చేశారని ఎలాంటి అనుమానాలకూ తావు లేకుండా కాంగ్రెస్ నేతలు కుండబద్దలు కొట్టినట్లు చెప్పేశారు. తాడేపల్లి ప్యాలస్ నుంచి ఆదేశాలు రాకపోతే వైఎస్ బిడ్డ షర్మిలను ఆపే ధైర్యం పోలీసులు చేయరని అంటున్నారు. సీఎం జగన్ ఆదేశాలు, సజ్జల డైరక్షన్ ప్రకారమే షర్మిలను పోలీసులు అడ్డుకున్నారని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. పోలీసులు ఇప్పటికైనా జగన్ సర్కారు భజన మానకపోతే, భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకుంటారని కాంగ్రెస్ హెచ్చరించింది.
కాగా.. వైఎస్‌కు అసలైన వారసురాలొచ్చిదంటూ కాంగ్రెస్ పెద్ద ఎత్తున నినాదాలు చేయడం ఈ సందర్భంగా ప్రత్యేకించి చెప్పుకోవాల్సి ఉటుంది. ఇక తనను పోలీసులు అడ్డుకోవడం వరకూ అన్న జగన్ పై విమర్శల విషయంలో కొంచం ముందు వెనుకలాడిన షర్మిల ఇక ఏ శషబిషలూ లేకుండా జగన్ కు నేరుగా లైవ్ లోనే వార్నింగ్ ఇచ్చేశారు. ఏపీలో నియంత రాజ్యం నడుస్తోంది, అయితే రాజన్న బిడ్డ ఎవరికీ భయపడదు, రాష్ట్రంలో నియంత పాలనను అంతం చేస్తా అంటూ ప్రతిన పూనారు షర్మిల. ఆ నియంత జగనేననీ, తాను అంతమొందించేది జగన్ పాలననేననీ షర్మిల ఇంత కంటే నేరుగా చెప్పాల్సిన అవసరం ఏమైనా ఉందా? ఆ ఒక్క హెచ్చరికతో షర్మిల అన్నపై రాజకీయ యుద్ధం ప్రకటించేశారు.