వైసీపీకి గుంటూరు కారం.. అధిష్ఠానం నషాళానికి అసమ్మతి ఘాటు! | ycp internal fight in combined guntur district| party| fear| clean| sweep| key| ambat| facing| opposition
posted on Jan 22, 2024 1:25PM
ఉమ్మడి గుంటూరు జిల్లాలో వైసీపీ కష్టాలు అన్నీ ఇన్నీ కాదు. ఎవరి మాటా లెక్క చేయకుండా సీఎం జగన్ తమ పార్టీ అభ్యర్థులను ప్రకటించేయగా.. పాత అభ్యర్థులు ఆయా స్థానాలలో రచ్చ లేపుతున్నారు. కొత్త అభ్యర్థులను వైసీపీ క్యాడర్ దగ్గరకు కూడా రానివ్వడం లేదు. కొందరు కొత్త అభ్యర్థులకు టికెట్లు ఇస్తే తాము మద్దతుగా పని చేసేది లేదని ద్వితీయ శ్రేణి నేతలు తేల్చి చెప్పేస్తున్నారు. పాత, కొత్త నేతలు కలిసి పనిచేసుకుంటూ ముందుకెళ్లాలని అధిష్టానం ఆదేశాలను ఎటూ ఎవరూ లెక్క చేయడం లేదు. ఇప్పుడు అధిష్ఠానం దిగి వచ్చి బాబ్బాబు ఈ సారికి కలిసి పని చేయడం అంటూ బతిమలాడుతున్నా పట్టించచుకోవడం లేదు. ఇక్యత అన్నది రియాలిటీలో కనిపించడం లేదు. దీంతో ఉమ్మడి గుంటూరు జిల్లాలో వైసీపీ కాడి వదిలేసినట్లైంది.
పార్టీలో ఉన్న వారిలో కొందరు ఇప్పటికే పక్క పార్టీలలో చేరేందుకు సన్నాహాలు చేసుకుంటుండగా.. ఆ అవకాశం లేక వైసీపీలోనే మిగిలిపోయే వారు కూడా వారు ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు వ్యవహరిస్తున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లా వైసీపీకి ఒకవైపు రాజధాని అమరావతి సెగ ఇప్పటికే కాకపుట్టిస్తున్నది. మరోవైపు ఇలా సొంత పార్టీ నేతలే ధిక్కార స్వరం వినిపిస్తూ, పార్టీ గెలుపు, ఓటములతో తమకు సంబంధం లేదు. అసలు పార్టీతోనే మాకు సంబంధం లేదన్నట్లు వ్యవహరిస్తున్నారు. దీంతో జగన్ చేష్టలుడిగి చేతులెత్తేసినట్లు పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ఉమ్మడి గుంటూరు జిల్లాలో సిట్టింగు ఎమ్మెల్యేలపై రెండు చోట్ల, కొత్తగా ప్రకటించిన అభ్యర్థులపై అసమ్మతి భారీ ఎత్తున చెలరేగింది. సత్తెనపల్లిలో మంత్రి అంబటి రాంబాబు కు ఈసారి టికెట్ ఇవ్వొద్దంటూ సొంత పార్టీ నేతలే రోడ్డెక్కి ఆందోళనకు దిగారు. అంబటి కోసం గత ఎన్నికల్లో జెండా భుజాన వేసుకుని ఊరూ వాడా తిరిగిన నేతలే ఇప్పుడు అంబటి వద్దు బాబోయ్ అంటున్నారు. నానా కష్టాలూ పడి అంబటిని గెలిపిస్తే ఆయన తిరిగి మాపై కేసులు పెట్టి వేధించారని స్థానిక నేతలు అధిష్ఠానానికి ఫిర్యాదులు చేశారు. ఆయన ఓటమికి పని చేస్తాం తప్ప విజయానికి కాదని అల్టిమేటం జారీ చేస్తున్నారు. అంబటి స్థానంలో ఎవరిని నిలబెట్టినా పనిచేస్తాం కానీ.. అంబటి మాత్రం వద్దు అని ముఖమాటం లేకుండా అధిష్థానానికి చెప్పేస్తున్నారు. అలాగే ప్రత్తిపాడు నియోజకవర్గంలో కొత్త ఇంచార్జ్ కిరణ్‌కుమార్‌కూ అసమ్మతి సెగ దడపుట్టిస్తోంది. ఆయనకు కూడా సొంత పార్టీ నుండే తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. నియోజకవర్గంలోని ఎస్సీ వర్గం కిరణ్ కుమార్ వద్దని గంటా బజాయించి మరీ చెబుతోంది. ఆయనకు టికెట్ ఇస్తే ఓడించి తీరుతామని శపథం చేసి మరీ పార్టీ పెద్దలకు హెచ్చరికలు చేసింది.
ఇక ఉమ్మడి జిల్లాలోనే అత్యంత కీలకమైన నియోజకవర్గం గుంటూరు తూర్పు. ఈ నియోజకవర్గంలో కూడా వైసీపీకి సొంత పార్టీ నుంచే తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే ముస్తాఫా ఈసారి తన కుమార్తె నూరి ఫాతిమాకు టికెట్ దక్కేలా చేసుకున్నారు. ఇప్పటికే ఫాతిమాను అభ్యర్థిగా ప్రకటించగా ఆమె కూడా ప్రస్తుతం నియోజకవర్గంలో దూకుడుగా పనిచేసుకుంటూ వెళ్తున్నారు. అయితే అధిష్టానం ఒకటి తలిస్తే ఇక్కడ వైసీపీ క్యాడర్ మరొకటి తలిచింది. ముస్తఫాపై అవినీతి ఆరోపణలు, పోలీస్ కేసులు కూడా నమోదలైన నేపథ్యంలో ఆయనను తప్పించి ఆయన స్థానంలో కుమార్తె ఫాతిమాని దింపారు. కానీ ఇక్కడ క్యాడర్ మాత్రం అసలు ఈ కుటుంబం నుంచి ఎవరు పోటీ చేసినా ఓడించి తీరుతామని తెగేసి చెప్తున్నారు. అసలు ఈ కుటుంబానికి టికెట్ ఇవ్వడానికి వీల్లేదని సొంత పార్టీలో ని ముస్లిం మైనారిటీ నాయకులే గట్టిగా పట్టుబడుతున్నారు. ఈ కుటుంబంలో ఎవరికి టికెట్ ఇచ్చినా ఓటేసేది లేదని.. అభ్యర్థిని మార్చకపోతే తామే పార్టీ మారిపోతామని తెగేసి చెబుతున్నారు.
అలాగే ఉమ్మడి జిల్లాలోని మరో కీలక నియోజకవర్గం తాడికొండలో కూడా వైసీపీలో అసంతృప్తి జ్వాల ఎగసి పడుతోంది. ఇక్కడ దళిత ఎమ్మెల్యే శ్రీదేవిని అవమానకరంగా పార్టీ నుండి పంపించేశాక.. నియోజకవర్గ టికెట్‌ను మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆశిస్తున్నారు. కానీ తాడికొండను మాజీ హోంమంత్రి సుచరితకు రాసిచ్చేశారు. దీంతో డొక్కా ఏం చేస్తున్నారో ఎక్కడ ఉన్నారో కూడా జాడ కనిపించడం లేదు. పార్టీ పెద్దలకు అందుబాటులో లేకుండా పోయారు. ఆయన వర్గం క్యాడర్ మాత్రం సుచరిత ఓటమికి కంకణం కట్టుకుని మరీ పని చేస్తామని ప్రతిజ్ణ పూనారు. మరోవైపు అసలు సుచరితకు కూడా తాడికొండలో పోటీ చేయడం ఇష్టం లేదని సొంత పార్టీ నేతలే చెబుతున్నారు. అన్నిటికంటే మించి వైసీపీ ద్వితీయ శ్రేణి నాయకత్వం తాడికొండలో తెలుగుదేశం విజయం ఖాయమని బాహాటంగానే చెప్పేస్తోంది. అటువంటి పరిస్థితిలో పని చేయడం ఎదుకని వైసీపీ కార్యకర్తలు పార్టీ కార్యక్రమాలకు సాధ్యమైనంత దూరంగా ఉంటున్నారు.
ఉమ్మడి గుంటూరు జిల్లాలోని కీలకమైన స్థానాలలోనే ఈ తరహా ఇబ్బందులతో వైసీపీ తీవ్రంగా సతమతమవుతుంటే.. మిగిలిన నియోజకవర్గాల గురించి ఇక చెప్పుకోవడానికి ఏముంటుంది. మొత్తంగా జిల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలలోనూ వైసీపీకి వ్యతిరేక గాలి వీస్తోంది. అన్నిటికీ మించి రాజధాని విషయంలో జిల్లా ప్రజలలో వైసీపీ పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతున్నది. వీటన్నిటినీ ఉటంకిస్తూ పరిశీలకులు ఉమ్మడి జిల్లాలో వైసీపీ బోణీ కొట్టడమే కష్టమని విశ్లేషిస్తున్నారు.