
ఇజ్రాయెల్- హమాస్ మధ్య కొనసాగుతున్న యుద్ధం ఇప్పుడు కొన్ని రోజులు విరామం ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. ఈ మేరకు ఇజ్రాయెల్ హమాస్‌కు ఒక ప్రతిపాదనను పంపింది. అందులో 2 నెలల పాటు యుద్ధాన్ని నిలిపివేయాలని కోరింది. ఈ పోరాటంలో మధ్యవర్తి పాత్ర పోషిస్తున్న ఖతార్- ఈజిప్ట్ ద్వారా ఈ ప్రతిపాదన పంపించింది. గాజాలో బందీలుగా ఉన్న ప్రజలందరినీ విడుదల చేయాలనే షరతులతో కూడిన ఈ ఒప్పందంలో ఉంచబడింది. ఇజ్రాయెల్ రక్షణ శాఖతో సంబంధం ఉన్న ఇద్దరు అధికారులు ఈ సమాచారం అందించారు. అయితే, ఇప్పుడు హమాస్ యోధులు దీనికి సిద్ధంగా ఉన్నారా లేదా అనేది వేచి చూడాలి.
కాగా, గాజాలో హమాస్ చేతిలో బందీలుగా ఉన్న డజన్ల కొద్దీ ఇజ్రాయిలీల కుటుంబాలు ప్రభుత్వంపై చాలా ఒత్తిడి తీసుకు వస్తున్నాయి. ఫైనాన్స్ కమిటీ సమావేశంలో ఈ వ్యక్తులు ఇజ్రాయెల్ పార్లమెంట్‌లోకి ప్రవేశించారు. బందీల బంధువులు గత కొద్ది రోజులుగా తమ నిరసనలను తీవ్రం చేశారు. తమ వారిని విడుదల చేసేందుకు ఇజ్రాయేల్ ప్రభుత్వం మరింత కృషి చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక, ఇజ్రాయెల్ దక్షిణ గాజా స్ట్రిప్‌లోని ఖాన్ యునిస్‌లో భారీ బాంబు దాడి చేసింది. ఈ దాడిలో 50 మంది పాలస్తీనియన్లు మరణించారు. షెల్టర్ సెంటర్లపై బాంబు దాడి కారణంగా స్థానభ్రంశం చెందిన వారిలో మరణాలతో పాటు తీవ్రంగా గాయాలైనట్లు పలు నివేదికలు అందుతున్నాయని పాలస్తీనాలోని రెడ్ క్రెసెంట్ సొసైటీ మీడియాకు తెలిపింది.