ఒక్క ఎంపీ సీటు.. నాలుగు వికెట్లు.. జగన్ కు మామూలు దెబ్బ కాదుగా! | ycp mp lavu krishnadevarayulu| resign| guntur| mp| seat| ambati| macharla
posted on Jan 23, 2024 1:51PM
వైసీపీ టీమ్ ఆలౌట్ కు దగ్గరౌతోందా? ఒక దాని వెంట ఒకటిగా వికెట్లు పడిపోతున్నాయా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. తాజాగా నరసరావు పేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులు రాజీనామా చేశారు. ఆయన తన ఎంపీ పదవికీ, వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికీ కూడా రాజీనామా చేశారు.
ఒక్క గుంటూరు లోక్ సభ స్థానం కేంద్రంగా వైసీపీ నాలుగు వికెట్లను చేజార్చుకుంది. ఇప్పటికే రెండు వికెట్ల పడిపోయాయి. ఇహనో ఇప్పుడో మరో రెండు వికెట్లు కూడా డౌన్ కానున్నాయి. ఇంతకీ గుంటూరు లోక్ సభ స్థానం విషయంలో జగన్ నిర్ణయం ఏమిటి? ఆ నిర్ణయం నలుగురు రాజీనామాకు ఎందుకు కారణమైంది. అంటే జగన్ తన ఇష్టారీతిగా ఆశావహులకు హామీలు ఇచ్చేయడం, ఆ తరువాత తూచ్ ఇది కాదు.. మరోటి అంటూ నిర్ణయాన్ని మార్చేసుకోవడం పరిపాటే. ఇంత వరకూ ఎలాగో గడిచిపోయింది కానీ ఎన్నికల ముందు.. జగన్ నిర్ణయాలు తమ కొంపలు ముంచేసే విధంగా ఉండటంతో ఆయన నాయకత్వాన్ని అంగీకరించేందుకు సిద్ధంగా లేమంటూ పలువురు పార్టీని వీడుతున్నారు. అదే విధంగా గుంటూరు లోక్ సభ స్థానం నుంచి టికెట్ కేటాయిస్తానని హామీ ఇచ్చి క్రికెటర్ అంబటి రాయుడిని పార్టీలోకి ఆహ్వానించారు. నిజమే కాబోలనుకున్న అంబటి రాయుడు ఓ మూడు నెలల పాటు నియోజకవర్గం అంతా పర్యటించి పరిచయాలు పెంచుకుని మద్దతు కూడగట్టుకుని అంతా బానే ఉందన్న నిర్ణయానికి వచ్చి జగన్ సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకుని కండువా కప్పుకున్నారు. అంత వరకూ గుంటూరు లోక్ సభకు వైసీపీ అభ్యర్థిని తానే అనే భవనలో ఉన్న రాయుడికి ఆ సీటు నుంచి పోటీ చేయాల్సిందిగా నరసరావు పేట ఎంపీ లావు కృష్ణదేవరాయులిని జగన్ ఆదేశించినట్లు తెలియడంతో బిత్తర పోయారు. పార్టీ అధినేత ఇలా మాట ఇచ్చి అలా తప్పడానికి సిద్ధపడిపోవడంతో ఇహ లాభం లేదని నిర్ణయానికి వచ్చేశారు. అంతే క్షణం ఆలస్యం చేయకుండా పార్టీ తీర్థం పుచ్చుకున్న పది రోజుల్లోనే రాజీనామా చేసేశారు. జనసేన గూటికి చేరిపోయారు.
ఇక లావు కృష్ణ దేవరాయులు విషయానికి వస్తే ఆయన జగన్ కు ముఖం మీదే తాను గుంటూరు నుంచి పోటీకి సిద్ధంగా లేనని కుండబద్దలు కొట్టేశారు. గుంటూరులో తాను కాదు, వైసీపీ తరఫున ఎవరు పోటీ చేసినా ఓడిపోవడం ఖాయమని కూడా మొహమాటం లేకుండా చెప్పేశారు. తాను నరసరావు పేట నుంచే బరిలోకి దిగుతానని తెగేసి చెప్పారు. అప్పటికి సరే అన్న జగన్.. తన మాట కాదంటాడా అన్న అహంతో లావుకు నరసరావు పేట ఎంపీ టికెట్ ఖరారు చేయలేదు. దీంతో ఓ పది రోజులు ఓపిక పట్టిన లావు రెండో ఆలోచన లేకుండా రాజీనామా చేసేశారు.
ఆ సందర్భంగా ఆయన నేరుగా జగన్ పేరు ప్రస్తావించకుండానే పార్టీ పరిస్థితిని, పార్టీ అగ్రనాయకత్వం అడ్డగోలు వ్యవహారాన్నీ మీడియాకు సవివరంగా చెప్పేశారు. పార్టీలో గత కొంత కాలంగా అయోమయం నెలకొందనీ, దానికి పార్టీ అధిష్ఠానం తెరదించుతుందన్న ఇంత కాలం వేచి ఉన్నాననీ, ఆ పని హైకమాండ్ చేయకపోవడంతో తాను ముందుకు వచ్చి తన రాజీనామాతో తెరదించాలని భావించాననీ చెప్పారు.
గత నాలుగున్నరేళ్లలో నియోజకవర్గానికి ఎంతో సేవ చేశానని తెలిపారు. అయినప్పటికీ ఈ నియోజకవర్గంలో కొత్త అభ్యర్థిని నిలబెట్టాలని పార్టీ నాయకత్వం భావిస్తోందని చెప్పారు. అందుకే తాను రాజీనామా చేశాననీ చెప్పారు.
అయితే గుంటూరు లోక్ సభ స్థానం సెంట్రిక్ గా ఈ రెండు వికెట్ల పతనంతో ఆగేటట్లు కనిపించడం లేదు. నరసరావు పేట లోక్ సభ నియోజకవర్గ పరిధిలోని మాచర్ల సిట్టింగ్ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, అలాగే నర్సరావు పేట సిట్టింగ్ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కూడా రాజీనామా బాటలోనే ఉన్నారని పరిశీలకులు చెబుతున్నారు. తొలి నుంచీ లావు శ్రీకృష్ణదేవరాయులుకు గట్టి మద్దతుదారులుగా ఉన్న వీరిరువురూ లావు రాజీనామా చేసిన వెంటనే ఆయనతో భేటీ అయ్యారు. త్వరలోనే వారూ రాజీనామా చేసే అవకాశాలు ఉన్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మొత్తం మీద జగన్ సిట్టింగుల మార్పు ప్రయోగం.. గట్టిగానే ఫలిస్తున్నట్లు తోస్తున్నది. కొందరు మంత్రులు, సీనియర్ నేతలూ కూడా సమయం చూసుకుని వైసీపీకి గుడ్ బై కొట్టేసే అవకాశాలే మెండుగా ఉన్నాయని పరిశీలకులు చెబుతున్నారు.