Leading News Portal in Telugu

China ship: భారత్ తో వివాదం.. మాల్దీవులకు చైనా నిఘా నౌక..


China ship: భారత్ తో వివాదం.. మాల్దీవులకు చైనా నిఘా నౌక..

భారతదేశంతో మాల్దీవుల వివాదం వేళ పరిశోధన నౌకగా చెప్పే చైనా నిఘా నౌక ఒకటి ఆ దేశం దిశగా ప్రయాణం కొనసాగిస్తుండటం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ చైనీస్‌ నౌక జావా-సుమత్రా మధ్య ఉండే సుండా జలసంధిని దాటిన తర్వాత ప్రస్తుతం హిందూ మహాసముద్రం రీజియన్‌లోని ఇండోనేషియా తీరంలో ప్రయాణిస్తుందని మైరెన్‌ ట్రాకర్‌ యాప్‌ పేర్కొనింది. ఈ షిప్‌ ఫిబ్రవరి 8న మాల్దీవులకు చేరే ఛాన్స్ ఉన్నట్టు సమాచారం. ఈ చైనా గూఢచారి నౌక హిందూ మహాసముద్ర జలాల్లో 2019, 2020లలో సర్వే చేసిందని భౌగోళిక నిపుణుడు డామియెన్‌ సైమన్‌ తెలిపాడు.


అయితే, మాలె దిశగా ప్రయాణిస్తున్న ‘షియాంగ్‌ యాంగ్‌ హాంగ్‌ 03’ నౌకపై భారత నేవీ నజర్ పెట్టింది. ఈ నౌక విషయం తమకు తెలుసు.. దాని కదలికలను నిశితంగా గమనిస్తున్నామని భారత్ నౌవీ అధికారులు పేర్కొన్నారు. చైనాకు అనుకూలంగా ఉండే మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్‌ ముయిజ్జు భారత్‌తో వివాదాలకు దారి తీస్తున్నాడు. భారత్‌పైనా, ప్రధాని మోడీ పైనా మాల్దీవుల మంత్రులు చేసిన అనుచిత కామెంట్స్ వల్ల ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు రాజేసింది. ఇది జరిగిన తర్వాతనే చైనాలో పర్యటించిన ముయిజ్జు.. ఆ దేశాధ్యక్షుడు జిన్‌పింగ్‌తో ప్రత్యేకంగా సమావేశం అయ్యాడు. ఆ తర్వాత తమ దేశంలోని భారత సైనికులు ఇక్కడి నుంచి వెళ్లిపోవాలంటూ డెడ్‌లైన్‌ పెట్టారు. తాజాగా మాల్దీవుల వైపు చైనా నిఘా నౌక వెళ్తుండటంతో తీవ్ర పరిణామం చోటు చేసుకొన్నది. గతంలో కూడా ఇదే తరహాలో చైనా నౌక శ్రీలంక తీరంలో నిఘా కార్యకలాపాలు నిర్వహించడంపై భారత్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.