Leading News Portal in Telugu

France President: నేడు జైపూర్‌కి ఫ్రాన్స్‌ అధ్యక్షుడు.. ప్రధాని మోడీతో కలిసి రోడ్ షో..


France President: నేడు జైపూర్‌కి ఫ్రాన్స్‌ అధ్యక్షుడు.. ప్రధాని మోడీతో కలిసి రోడ్ షో..

Republic Day Parade: ఈ ఏడాది గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మాక్రాన్‌ ముఖ్య అతిథిగా వస్తున్నారు. కాగా, రెండు రోజుల పాటు ఆయన భారత్ లో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా ఇవాళ మాక్రాన్‌ భారత్‌కు చేరుకుంటారు. జైపూర్‌ విమానాశ్రయానికి చేరుకుంటారు. ఫ్రాన్స్‌ అధ్యక్షుడికి భారత ప్రధాని నరేంద్ర మోడీ, ఇతర అధికారులు ఘనంగా స్వాగతం పలకనున్నారు. ఇక, ఆ తర్వాత మోడీతో కలిసి మాక్రాన్‌ జైపూర్‌లోని పలు పర్యాటక ప్రదేశాలను సందర్శించనున్నారు.


అలాగే, యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం అయిన 16వ శతాబ్దానికి చెందిన అమెర్ ఫోర్ట్‌ను ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ సందర్శించనున్నట్లు తెలుస్తుంది. ఆ తర్వాత ఇద్దరు నేతలు ట్రిపోలియా గేట్‌కు కాలినడకన వెళ్లనున్నట్లు టాక్. ఇక, జైపూర్‌లో ఇద్దరు నేతలు రోడ్‌ షో నిర్వహించేందుకు ప్లాన్‌ చేస్తున్నట్లు సంబంధిత అధికారవర్గాలు వెల్లడించాయి. ఈ పర్యటన తర్వాత మాక్రాన్‌ నేటి రాత్రికి దేశ రాజధాని ఢిల్లీకి చేరుకోనున్నారు. అలాగే, రేపు (జనవరి 26వ) జరిగే రిపబ్లిక్‌ డే పరేడ్‌లో ముఖ్య అతిథిగా పాల్గొంటారు. ఆ తర్వాత రాష్ట్రపతి భవన్‌లో ‘ఎట్‌ హోమ్‌’ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈ రెండు రోజుల పర్యటనలో భారత్‌తో ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌ భారత్ లో పలు ఒప్పందాలు చేసుకోనున్నారు. ముఖ్యంగా రక్షణ, భద్రత, క్లీన్‌ ఎనర్జీ, వాణిజ్యం, పెట్టుబడులు, కొత్త సాంకేతికత తదితర రంగాల్లో ఒప్పందాలు చేసుకోనున్నట్లు సమాచారం.