Leading News Portal in Telugu

జగన్ మాట తప్పాడు.. మడమ తిప్పాడు.. కన్ ఫర్మ్ చేసేసిన సోదరి షర్మిల | sharmila confirm jagan failure as cm| challange| question| promises| fulfill


posted on Jan 29, 2024 9:54AM

ఏపీ సీఎం జగన్ ఇచ్చిన మాట మీద నిలబడరనీ, ఇచ్చిన హామీలు నెరవేర్చరనీ గత నాలుగున్నరేళ్లుగా విపక్షాలు విమర్శలు గుప్పిస్తూనే ఉన్నాయి. ఆయన తప్పిన మాటలు, విస్మరించిన హామీలను ఉదాహరణలుగా చూపుతూనే ఉన్నాయి. అయితే అధికార పార్టీ నేతలు మాత్రం చెప్పినవన్నీ చేసేశామనీ, ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచిన హామీలన్నీ నెరవేర్చేశామనీ ఢంకా బజాయించి చెబుతున్నారు. 

అధికారంలో ఉన్నాం మేం చెప్పిందే జనం వినాలి. అలా కాదని విపక్షాలకు వంత పాడితే సంక్షేమం కట్ చేసేస్తామని బెదరింపులకు దిగుతున్నారు. జగన్ పాలనా వైఫల్యాలను ఎండగడుతున్న విపక్షాలపై దాడులకు తెగబడుతున్నారు. అక్రమ కేసులు బనాయిస్తున్నారు. జైళ్లకు పంపుతున్నారు. గత నాలుగు సంవత్సరాలుగా రాష్ట్రంలో ఇదే తంతు జరుగుతోంది. అక్రమ అరెస్టులపై కోర్టులు మొట్టికాయలు వేసినా.. తాను ఇంత చేశాను.. అంత చేశానంటూ ప్రతి బటన్ నొక్కే కార్యక్రమంలోనూ జగన్ ఊదరగొడుతుంటూ వినలేక జనాలు సభా ప్రాంగణం వదిలి పారిపోతున్నా.. అధికార పార్టీ పట్టించుకోలేదు. అధికారంలో ఉన్నాం, ఏం మాట్లాడినా, ఏం చేసినా చెల్లిపోతుందున్న భావనలో ఉండిపోయారు.

ఇప్పుడు ఎన్నికల వేళ చెప్పినవన్నీ చేసేశా.. మళ్లీ నాకే అధికారం అంటూ జగన్ ఎన్నికల  ప్రచారాన్ని ప్రారంభించేశారు. సరిగ్గా అలాంటి వేళ.. విపక్షాల విమర్శలకు తన గొంతు కలిపారు జగన్ సోదరి వైఎస్ షర్మిల. ఎవరేమనుకుంటే నాకేం.. నాష్టం వచ్చినట్లు మాట్లాడతాను, నా ఇష్టం వచ్చినట్లు చేస్తాను అంటూ ముందుకు వెడుతున్న జగన్ కాళ్లకు షర్మిల బ్రేక్ వేశారు. 

సొంత చెల్లి తనపై చేస్తున్న విమర్శలకు సమాధానం ఇవ్వకుండా జగన్ అడుగు ముందుకు వేసే పరిస్థితి లేదు. ఒక వేళ జగన్మొండి తనాన్ని ప్రదర్శిస్తూ అడుగు ముందుకు వేద్దామన్నా జనం నిలదీసే అవకాశం ఉంది. ఎందుకంటే రక్తం పంచుకుపుట్టిన చెల్లే తన అన్న మాటమీద నిలబడే రకం కాదనీ, మడమతప్పే రకమని బాహాటంగా చెబుతుంటే.. సొదరి చెబుతున్న మాటలు సత్యం కాదని రుజువు చేసుకోవలసిన బాధ్యత జగన్ పై పడింది. లేకపోతే ఇంత కాలం ఊకదంపుడు మాటలు, ప్రసంగాలూ వినివినీ విసిగిపోయిన నేతలు ఇప్పుడు షర్మిల మాటలను అక్షర సత్యాలుగా భావించే అవకాశాలు ఉన్నాయి.  

ఆదివారం తిరుపతి, అనంతపురంలలో ఆయా ఉమ్మడి జిల్లాల కాంగ్రెస్‌ శ్రేణులతో  సమావేశమైన షర్మిల  వైసీపీ ఆవిర్భావం నాటి పరిస్థితులను జనం కళ్లకు కట్టారు. అప్పట్లో   వైసీపీని తన భుజాలపై మోశానని, తన సోదరుడు జగన్  రాజకీయ భవిష్యత్‌ కోసం 3,200 కి.మీ. పాదయాత్ర చేశానని.. వైసీపీని గెలిపించానని.. ఆయన కోసం అనేక ఇబ్బందులకు ఓర్చాననీ చెప్పిన షర్మిల.. జగన్ కు కృతజ్ణత లేదనీ, అధికారం చేపట్టగానే  మారిపోయారనీ విమర్శించారు. ఇప్పుడు తన మీద  తన వ్యక్తిత్వం మీదా, వ్యక్తిగత జీవితం మీదా దాడి చేస్తున్నారు, చేయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే తాను బెదిరే రకం కాదనీ, వైఎస్ బిడ్డగా, ఆయన ఆశయ సాధన కోసం ఎన్ని కష్టాలు ఓర్వడానికైనా రెడీ అని స్పష్టం చేశారు.   

రాష్ట్రంలో సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు చేసిన తరువాతే ఓట్లడుగుతానని గత ఎన్నికల ముందు  చెప్పిన జగన్ ఇప్పుడు మద్యాంధ్రప్రదేశ్ గా రాష్ట్రాన్ని మార్చేసి ఏ ముఖం పెట్టుకుని ఓట్లడగడానికి రెడీ అయ్యారో చెప్పాలని నిలదీశారు.  మేనిఫెస్టో అంటే తనకు బైబిల్‌, ఖురాన్‌, భగవద్గీత వంటిదని చెప్పిన జగన్ గత ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచిన ఏ హామీని అమలు చేశారో చెప్పాలని ప్రశ్నించారు.  

అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా తెస్తామని జగన్‌ అన్నాడు. పోలవరం పూర్తి చేస్తామన్నారు. రాజధాని కడతామన్నాడు. అవేమీ సాధించలేదు. ఆయన హయాంలో ఒక్క పరిశ్రమ రాష్ట్రానికి రాలేదు సరికదా, గత ప్రభుత్వ హయాంలో వచ్చిన పరిశ్రమలు  తరలిపోయాయి. జాబ్ క్యాలెండర్ అన్నారు. విడుదల చేశారా, ఏపీలో నిరుద్యోగ యువత పొట్ట చేతపట్టుకుని వలసలు పోతున్నారన్నారు.   తన ప్రశ్నలకు జగన్ సమాధానం చెప్పాలనీ, తన సవాళ్లు స్వీకరించాలనీ డిమాండ్ చేస్తున్న షర్మిలను విస్మరించి జగన్ ఎన్నికల ప్రచారాన్ని కొనసాగించే పరిస్థితి లేదని పరిశీలకులు అంటున్నారు. చంద్రబాబు స్క్రిప్ట్ చదువుతున్నారనీ, కాంగ్రెస్ తన కుటుంబాన్ని చీల్చిందనీ బేల మాటలతో తప్పిచుకునే అవకాశం లేదని అంటున్నారు.