Leading News Portal in Telugu

Skydiver: 29వ అంతస్తు నుంచి పడి స్కైడైవర్ దుర్మరణం.. పారాచూట్ విఫలం కావడంతో ప్రమాదం..


Skydiver: 29వ అంతస్తు నుంచి పడి స్కైడైవర్ దుర్మరణం.. పారాచూట్ విఫలం కావడంతో ప్రమాదం..

Skydiver: సాహసం చేయాలనే ప్రయత్నం విషాదాన్ని నింపింది. డేర్ డెవిల్‌గా పిలువబడే నాతీ ఓడిన్సన్ అనే స్కైడైవర్ 29వ అంతస్తు నుంచి పడి ప్రాణాలు కోల్పోయాడు. బ్రిటన్‌కి చెందిన 33 ఏళ్ల ఓడిన్సన్ థాయ్‌లాండ్ లోని పట్టాయాలో భవనం నుంచి స్కై డైవింగ్ చేయాలని అనుకున్నాడు. అందుకు తగ్గట్లుగానే పారచూట్, హెల్మెట్ సిద్ధమైన తర్వాత ఈ ఫీట్‌ని అతని స్నేహితుడు కింద నుంచి రికార్డ్ చేయడానికి ప్రయత్నించాడు. అయితే, ఈ స్టంట్ సమయంలో ఓడిన్సర్ ధరించిన పారాచూట్ తెరుచుకోకపోవడంతో చెట్టును బలంగా ఢీకొట్టి నేలపై పడ్డాడు. దీంతో అతను అక్కడికక్కడే మరణించాడు. ఈ స్టంట్ కోసం అతను పర్మిషన్ తీసుకోలేదని తెలుస్తోంది.


ఓడిన్సన్ ఓ నిపుణుడైన స్కైడైవర్. కానీ అతని సాహసం విషాదంగా మిగిలింది. అతను నేలపై పడిపోయిన తర్వాత పారామెడిక్స్ టీమ్ సంఘటన స్థలానికి చేరుకుని అతను మరణించినట్లు ప్రకటించారు. సెక్యూరిటీ గార్డు కానెట్ చాన్సోంగ్ ఈ భయంకరమైన ఘటనను గుర్తు చేసుకున్నారు. ‘‘ నేను చెట్టు శబ్ధం విన్నాను. ఒక మహిళ కేకులు వేయగా అక్కడికెళ్లి చూడగా అతను చనిపోయి ఉన్నాడు’’ అని చెప్పాడు. దీనిపై పోలీసులు మాట్లాడుతూ.. పారాచూట్ విఫలం కావడం వల్లే ప్రమాదం జరిగిందన్నారు. ఈ ఘటనను రికార్డ్ చేసిన అతని స్నేహితుడిని విచారిస్తున్నట్లు తెలిపారు. ఈ ఘటనపై థాయ్‌లాండ్ బ్రిటన్ ఎంబసీకి సమాచారం ఇచ్చింది.