న్యాయపోరాటంతో పాటు రాజకీయ పోరాటం.. షర్మిలతో చేతులు కలిపిన డాక్టర్ సునీత | ys sunita meets sharmila| viveka murder| case| fight| justice| political
posted on Jan 29, 2024 11:54AM
డాక్టర్ వైఎస్ సునీత.. వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకు ముందు వరకూ ఈ పేరు పెద్దగా ఎవరికీ తెలియదు. అయితే తన తండ్రి హంతకులను చట్టం ముందు దోషులుగా నిలబెట్టాలన్న సంకల్పంతో ఆమె చేసిన అనితర సాధ్యమైన న్యాయపోరాటంతో తెలుగు ప్రజలందరికీ సుపరిచితురాలిగా మారిపోయారు.
మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డికి స్వయానా తమ్ముడైన వైఎస్ వివేకా హత్య జరిగే సమయానికి ప్రస్తుత సీఎం జగన్ విపక్ష నేతగా ఉన్నారు. తన చిన్నాన్నను దారుణంగా హత్య చేశారంటూ అప్పటి తెలుగుదేశం ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. నారాసుర రక్త చరిత్ర అంటూ కథనాలు వండి వార్చారు. తన బాబాయ్ హత్య కేసు సీబీఐకి అప్పగించాలంటూ డిమాండ్ చేశారు. ఆ సమయంలో వైఎస్ వివేకా కుమార్తె డాక్టర్ సునీత అన్న వెంటే ఉన్నారు. పెదనాన్న కుమారుడు, తన సోదరుడు అయిన జగన్ వివేకా హత్య కేసు నిందితులకు శిక్ష పడేలా చేసి తన తండ్రి ఆత్మకు శాంతి చేకూరుస్తారని భావించారు.
అయితే తన తండ్రి హత్యను తన రాజకీయ ప్రయోజనాలకు వాడుకున్న జగన్ ఎన్నికలలో విజయం సాధిం చిన తరువాత పట్టించుకోవడం మానేశారు. అంతే కాదు.. తాను విపక్ష నేతగా ఉన్నప్పుడు సీబీఐ విచారణను డిమాండ్ చేసిన జగన్, సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన వెంటనే మాట మార్చారు. మడమ తిప్పారు. తన బాబాయ్ హత్య కేసు విచారణ సీబీఐకి అప్పగించవద్దని అన్నారు. ఆ మేరకు కోర్టులో కూడా పిటిషన్ దాఖలు చేశారు. అప్పటికి కానీ డాక్టర్ సునీతకు వాస్తవం బోధపడలేదు. పెదనాన్న కుమారుడు జగనన్న తన తండ్రి హంతకులకు వత్తాసుగా వ్యవహరిస్తున్నారని గ్రహించిన ఆమె న్యాయపోరాటానికి నడుంబిగించారు. అన్న వద్దని అన్న సీబీఐ విచారణకు పట్టుబట్టి సాధించారు. అంతే కాదు ఏపీలో అయితే విచారణ సజావుగా సాగదంటూ సుప్రీం కోర్టుకు వెళ్లి మరీ పోరుగురాష్ట్రానికి మార్పించుకున్నారు.
ఇక గత ఐదేళ్లుగా వివేకా హత్య కేసు మలుపుల మీద మలుపులు తిరుగుతున్న సంగతి తెలిసిందే.
హత్య జరిగిన వెంటనే ఆరోపణలు గుప్పించిన వాళ్లే కేసు దర్యాప్తోల నిందితులుగా, అనుమానితులుగా బోనులో నిలబడాల్సి వచ్చింది. అప్పట్లో ఆరోపణలు ఎదుర్కొన్నవారికి ఆ కేసుతో ఏం సంబంధం లేదని విస్పష్టంగా తేలిపోయింది. అప్పట్లో నారాసుర రక్త చరిత్ర అంటూ ఆరోపణలు గుప్పించిన వారే ఇప్పుడు వివేకా హత్య కేసులో అభియోగాలను ఎదుర్కొంటున్నారు. నిందితులుగా కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. అరెస్టయ్యారు. బెయిలుపై తిరుగుతున్నారు. ముందస్తు బెయిలుతో అరెస్టులను తప్పించుకున్నారు.
అసలు వివేకా హత్య కేసు దర్యాప్తు నాలుగున్నరేళ్లుగా ఎందుకు సాగుతూ వస్తోంది. ఆ కేసు ఒక అడుగు ముందుకు, రెండడుగులు వెనక్కు చందంగా సాగడానికి కారకులెవరు అన్న విషయంలో కూడా ఇప్పుడు ఎవరికీ ఎలాంటి సందేహాలూ లేవు. హత్యకు కారకులెవరు? హత్య లో పాత్రధారులు, సూత్రధారులు ఎవరు అన్న విషయాన్ని కోర్టులు ఇంకా ధృవీకరించలేదు. కానీ ప్రజలకు మాత్రం ఈ విషయంలో క్లారిటీ వచ్చేసింది. రాష్ట్రంలో అందరికీ వివేకా హత్య మోటో ఏమిటి? చేసిందెవరు? చేయించిందెవరు? అన్నవిషయంలో అనుమానాలు కానీ సందేహాలు కానీ లేవు. అసలీ కేసు ఇంత వరకూ వచ్చి.. ఒక లాజికల్ ఎండ్ దిశగా సాగుతున్నదంటే అందుకు మాత్రం వైఎస్ వివేకా కుమార్తె డాక్టర్ సునీతే కారణం. తన తండ్రి వైఎస్ వివేకానందరెడ్డి హంతకులు తన తండ్రి హంతకులు, వారి వెనుకనున్న ముసుగువీరుల సంగతి తేల్చాలంటూ డాక్టర్ సునీత చేసిన, చేస్తున్న న్యాయ పోరాటం చారిత్రాత్మకం.
బహుశా చరిత్రలో ఏ హత్య కేసులోనూ ఇన్ని మలుపులు తిరిగి ఉండవు. అలాగే కోర్టు తీర్పులతో సంబంధం లేకుండా జనమే హంతకులు ఎవరు, వారి వెనుకనున్నది ఎవరు అన్న విషయంలో నిర్ధారణకు వచ్చేసిన సందర్భం కూడా గతంలో ఎన్నడూ లేదని చెప్పవచ్చు.
ఇదంతా కేవలం డాక్టర్ సునీత పోరాట ఫలితమే. ఇప్పుడు వివేకా హత్య కేసులో తీర్పు ఒక లాంఛనమే. హత్య ఎవరు చేశారు? ఎవరు చేయించారు అన్న విషయంలో ప్రజలలో ఎలాంటి అనుమానాలూ, సందేహాలూ లేవు.
ఒక మహిళగా, ఎవరి ఒత్తిళ్లకు లొంగకుండా, న్యాయం కోసం సునీత చేసిన, చేస్తున్న పోరాటం సాధించిన విజయంగానే దీనిని అభివర్ణించాల్సి ఉంటుంది. వ్యవస్థలను మేనేజ్ చేయడంలోనూ, నిర్వీర్యం చేయడంలోనూ అధికార వైసీపీ ఈ నాలుగున్నరేళ్లలో మాస్టర్ అయిపోయింది. ఆ కారణంగా కేసు దర్యాప్తు వేగాన్ని మందగించేలా చేసింది. చేస్తోంది. ఈ కేసులో తీవ్ర అభియోగాలు ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డికి రాష్ట్ర ప్రభుత్వం ఎంత వత్తాసుగా నిలిచింది. ప్రభుత్వంలో ఉండి కూడా కేసు నీరుగారే విధంగా మంత్రులు, ప్రభుత్వ సలహాదారులు వ్యవహరించారు. ఇన్ని రకాలుగా ప్రయత్నించినా జనం ముందు అవినాష్ దోషిగా నిలబడ్డారంటే అందుకు ఒకే ఒక్క కారణం డాక్టర్ సునీత న్యాయపోరాటం. ప్రభుత్వ మద్దతు పూర్తిగా ఉండి కూడా అరెస్టును తప్పించుకోవడానికి అవినాష్ ఎంతలా పరుగులు పెట్టారో ప్రజలు గమనించారు. సరే చివరికి కేసులో తీర్పు ఇంకా రాలేదు. అది వేరే విషయం. అయితే సునీత పోరాటం మాత్రం ఫలితం సాధించింది. ఆమె ప్రజల మనస్సులను గెలుచుకుంది. అయితే తండ్రి హత్య కేసులో పాత్రధారులు, సూత్ర ధారులపై ఇప్పుడు ఆమె రాజకీయ పోరాటానికి సైతం సిద్ధమయ్యారు. వివేకా హత్య కేసులో న్యాయం కోసం తాను చేస్తున్న న్యాయపోరాటానికి మద్దతుగా నిలిచిన వైఎస్ షర్మిల సమక్షంలో కాంగ్రెస్ గూటికి చేరి న్యాయపోరాటంతో పాటు రాజకీయ పోరాటం కూడా చేయాలని డిసైడైపోయారు. కడప లోక్ సభ స్థానం నుంచి డాక్టర్ సునీత కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగడం దాదాపు ఖాయమైపోయినట్లేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.