Leading News Portal in Telugu

బాబు బెయిలు రద్దుకు సుప్రీం నో.. ఐఆర్ఆర్ కేసులో సుప్రీంలో జగన్ సర్కార్ కు షాక్.. | supreme court dismiss jagan sarkar petition| shock| government| election| cbn| big


posted on Jan 29, 2024 1:01PM

ఇన్న‌ర్ రింగ్ రోడ్డు కేసులో సుప్రీం కోర్టులో జగన్ సర్కార్ కు భారీ షాక్ తగిలింది.  తెలుగు దేశం పార్టీ అధినేత‌ చంద్ర‌బాబు నాయుడికి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ఏపీ హైకోర్టు మంజూరు చేసిన ముందస్తు బెయిలును రద్దు చేయాలంటూ ఏపీ సర్కార్ దాఖలు చేసిన పిటిషన్ ను  సుప్రీం కోర్టు కొట్టి వేసింది.  హైకోర్టు అన్ని అంశాల‌ను ప‌రిగ‌ణ‌నలోకి తీసుకునే ఉత్త‌ర్వులు ఇచ్చింద‌ని, కేసు ద‌ర్యాప్తుపై ముంద‌స్తు బెయిల్ ప్ర‌భావం ఎంత మాత్రం ఉండదని సుప్రీం కోర్టు ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది.  ఈ కేసులో చంద్ర‌బాబుకు నోటీసులు ఇచ్చేందుకు నిరాక‌రించడమే కాకుండా ఈ దశలో కేసులో జోక్యం చేసుబోమని స్పష్టం చేసింది. 

ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో విపక్ష నేత చంద్రబాబును ప్రజలకు దూరం చేయడమే లక్ష్యంగా జగన్ సర్కార్ వరుసగా కేసులు నమోదు చేసిన సంగతి విదితమే. స్కిల్ కేసులో చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేసి రిమాండ్ కు తరలించిన సమయంలో వచ్చిన ప్రజా స్పందన కారణంగా జగన్  లక్ష్యం నెరవేరడం అటుంచి ఆయనను ప్రజలకు మరింత చేరువ చేసింది.  ఆయన రాజమహేంద్రవరం జైలులో ఉన్నన్ని రోజులూ చంద్రబాబు విజన్, చంద్రబాబు హయాంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఆ తరువాత  విభజిత ఆంధ్రప్రదేశ్ లో జరిగిన అభివృద్ధి, ఉపాధి, ఉద్యోగ కల్పనలో ఆయన అవలంబించిన విధానాలు, ఐటీ రంగంలో చేసిన అభివృద్ధి ఇవే రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా చర్చకు వచ్చాయి. దేశ విదేశాల్లో ఆయన అరెస్టుకు వ్యతిరేకంగా నిరసనలు వెల్లువెత్తాయి.  సరే స్కిల్ కేసులో ఆయన బెయిలు కంటే క్వాష్ కే ప్రాధాన్యత ఇవ్వడంతో హైకోర్టు నుంచి సుప్రీం కోర్టు వరకూ జరిగిన సుదీర్ఘ విచారణల కారణంగా ఆయన నెలల తరబడి రాజమహేంద్రవరం జైలులోనే ఉండాల్సి వచ్చినప్పటికీ… అదే కారణంగా ఆయన ప్రజల హృదయాలలో మరింత సుస్థిర స్థానం ఏర్పాటు చేసుకోగలిగారు.

సరే స్కిల్ కేసులో చంద్రబాబుకు ఏపీ హైకోర్టు మధ్యంతర బెయిలు మంజూరు చేయడంతో ఆయన బయటకు వచ్చారు.  ఆయన రాజమహేందరవరం జైలు నుంచి బయటకు వచ్చిన సమయంలో ఆయన కోసం జనం స్వచ్ఛందంగా రోడ్లపైకి వచ్చి మరీ మద్దతు తెలిపారు. అర్థరాత్రి దాటినా, తెల్లవారు జాము అయినా జనం ఆయన కోసం రోడ్లపై వేచి ఉన్నారు. రాజమహేంద్ర వరం నుంచి విజయవాడ కరకట్టపై ఉన్న ఆయన నివాసానికి చంద్రబాబు కాన్వాయ్ చేరుకోవడానికి పది గంటలకు పైగా సమయం పట్టిందంటేనే అర్ధం చేసుకోవచ్చు జగన్ సర్కార్ ఆయనను అక్రమంగా అరెస్టు చేయడాన్ని జనం ఎంతగా వ్యతిరేకించారో.  సరే ఇక మిగిలిన కేసులలో కూడా ఆయనకు కోర్టులు ముందస్తు బెయిలు మంజూరు చేశాయి. అయితే వాటిలో ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబుకు హైకోర్టు ముందస్తు బెయిలు మంజూరు చేయడాన్ని సవాల్ చేస్తూ జగన్ సర్కార్ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. అక్కడా జగన్ సర్కార్ కు షాక్ తగిలింది.  జగన్ సర్కార్ పిటిషన్ ను సుప్రీం కోర్టు కొట్టివేసింది.