Leading News Portal in Telugu

వైసీపీ@5వ జాబితా.. నాలుగు ఎంపీ, మూడు ఎమ్మెల్యే స్థానాలు ఖరారు | ycp releases 5th list| four mp| three| mla| seats


posted on Feb 1, 2024 12:54PM

ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయిదో అభ్యర్థుల జాబితాను  విడుదల చేసింది. ఈ జాబితాలో నలుగురు ఎంపీల పేర్లు ప్రకటించడంతో పాటు మూడు అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థులను మార్చింది. కాకినాడ ఎంపీ అభ్యర్థిగా చలమలశెట్టి సునీల్‌. నర్సరావుపేట ఎంపీ అభ్యర్థిగా అనిల్‌కుమార్‌ యాదవ్‌. తిరుపతి ఎంపీ అభ్యర్థిగా గురుమూర్తి. మచిలీపట్నం ఎంపీ అభ్యర్థిగా సింహాద్రి రమేష్‌ బాబు. సత్యవేడు ఎమ్మెల్యే అభ్యర్థిగా నూకతోటి రాజేష్‌. అరకు ఎమ్మెల్యే అభ్యర్థిగా రేగం మత్స్యలింగం. అవనిగడ్డ అసెంబ్లీ అభ్యర్థిగా డాక్టర్ సింహాద్రి చంద్రశేఖరరావు పేర్లను ప్రకటించింది. 

ఇప్పటికే జగన్ పార్టీ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులతో కూడిన నాలుగు జాబితాలను పలు దఫాలుగా విడుదల చేసిన విషయం విదితమే. మరికొద్ది రోజుల్లో మరిన్ని జాబితాలు విడుదల చేసే అవకాశం ఉంది. అయితే నరసరావుపేట ఎంపీగా నెల్లూరు సీటీ ఎమ్మెల్మే , మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్‌ను ఎంపిక చేశారు. అయితే ఇదే నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా టీటీడీ మాజీ చైర్మన్, రాయలసీమ టీడీపీ నాయకుడు పుట్టా సుధాకర్ యాదవ్ కుమారుడిని బరిలో దింపేందుకు సైకిల్ పార్టీ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆ క్రమంలో బీసీ అభ్యర్థిని రంగంలోకి దింపాలని ఫ్యాన్ పార్టీ అధినేత వైయస్ జగన్ నిర్ణయించారని.. దీంతో అనిల్ కుమార్ యాదవ్ పేరు ఖరారు చేసినట్లు సమాచారం. ఇక తిరుపతి ఎంపీ అభ్యర్థిగా గురుమూర్తినే మళ్లీ ఎంపిక చేశారు. 2019 ఎన్నికల్లో తిరుపతి ఎంపీగా బి దుర్గా ప్రసాద్ ఎన్నికయ్యారు. కానీ ఆయన ఆకస్మిక మృతితో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ నేపథ్యంలో  డాక్టర్ గురుమూర్తిని జగన్ పార్టీ బరిలో దింపింది. ఆ ఎన్నికల్లో ఆయన ఘన విజయం సాధించారు. దాంతో మళ్లీ ఆయనకే ఈ స్థానాన్ని కట్టబెట్టింది. 

 

అలాగే మచిలీపట్నం లోక్ సభ స్థానం ప్యాన్ పార్టీ అభ్యర్థిగా సింహద్రి రమేష్ బాబును ఎంపిక చేశారు. ఆయన ప్రస్తుతం అవనిగడ్డ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఇక ఇప్పటి వరకు మచిలీపట్నం ఎంపీగా ఉన్న వల్లభనేని బాలశౌరి పవన్ పార్టీ కండువా కప్పుకోవడంతో.. ఆ స్థానానికి ఎంపీ అభ్యర్థిగా సింహద్రి రమేష్ బాబును సీఎం వైయస్ జగన్ తెరపైకి తీసుకు వచ్చినట్లు తెలుస్తోంది. ఇక అవనిగడ్డ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎంపిక చేసిన డాక్టర్ సింహద్రి చంద్రశేఖరరావు.. టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి సింహద్రి సత్యనారాయణ కుమారుడన్న సంగతి అందరికీ తెలిసిందే. 

అలాగే కాకినాడ ఎంపీ అభ్యర్థిగా బరిలో నిలవనున్న చలమలశెట్టి సునీల్ సైతం గతంలో ఇదే స్థానం నుంచి అదే పార్టీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలైయ్యారు. మళ్లీ ఆయన రానున్న ఎన్నికల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకొనున్నారు.