Leading News Portal in Telugu

ఎవరి సాయం లేకుండానే హ్యాండ్ స్టిక్ పట్టుకుని కేసీఆర్ నడక!.. ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం | kcr sworn ias mla| speaker| chamber| walk| hand| stic| telangana| assombly| opposition


posted on Feb 1, 2024 1:27PM

మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు.  గజ్వేల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించిన ఆయన దాదాపు రెండు నెలల తరువాత గురువారం (ఫిబ్రవరి 1) ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఆయనకు అసెంబ్లీ వద్ద బీఆర్ఎస్ నేతలు స్వాగతం పలికారు. స్పీకర్ ఛాంబర్ లో కేసీఆర్ ప్రమాక స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో దాదాపు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ పాల్గొన్నా ఇద్దరు ఎమ్మెల్యేలు మాత్రం హాజరు కాకపోవడం రాజకీయ ఊహాగానాలకు తెరలేపింది. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన ఎమ్మెల్యేలు అందరూ కూడా కేసీఆర్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరైనా, వారిలో ఇద్దరు కొత్త ప్రభాకరరెడ్డి, ప్రకాష్ గౌడ్ లు మాత్రం గైర్హాజరయ్యారు. 

కేసీఆర్ ఫామ్ హౌస్ లో కాలుజారి పడటంతో ఆయన ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయడం జాప్యమైంది. అయితే.. అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ పరాజయం తరువాత కేసీఆర్ అసెంబ్లీలో అడుగుపెడతారా? అసలు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేస్తారా? అన్న అనుమానాలు పొలిటికల్ సర్కిల్స్ లో గట్టిగా వ్యక్తం అయ్యాయి.  అయితే ఆ అనుమానాలన్నీ నిరాధారమేనని కేసీఆర్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయడంతో తేలిపోయింది. 

అయితే కేసీఆర్ తుంటి ఎముక విరగడంతో ఆపరేషన్ చేయించుకుని విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో బీఆర్ఎస్ లో చోటు చేసుకున్న పరిణామాలే కేసీఆర్ ను రాజకీయాలకు గుడ్ బై చెబుదామన్న యోచనను విరమించుకునేలా చేశాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఆయన విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో బీఆర్ఎస్ ఎల్పీ సమావేశంలో నేతను ఎవరన్న దానిపై ఏకాభిప్రాయం కుదరకపోవడం, అదే సమయంలో పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తీరుపై పార్టీ ఎమ్మెల్యేలు బాహాటంగానే అసంతృప్తి వ్యక్తం చేయడంతో పార్టీని కాపాడుకోవడం, ఎమ్మెల్యేలు జారిపోకుండా నిలువరించడం కేసీఆర్ వినా మరెవరు బీఆర్ఎస్పీ నేతగా ఎన్నికైనా సాధ్యం కాదన్న అభిప్రాయంతోనే కేసీఆర్ మళ్లీ క్రియాశీలంగా వ్యవహరించాలని నిర్ణయించుకున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

ఇలా ఉండగా తుంటి ఎముక  గాయం నుంచి కేసీఆర్ చాలా వరకూ కోలుకున్నట్లుగా కనిపిచారు. కొన్ని రోజుల కిందటి వరకూ హ్యాండ్ స్టిక్ ఉన్నాఎవరో ఒకరు సాయం చేస్తే తప్ప అడుగులు వేయలేకపోయిన కేసీఆర్ ఇప్పుడు ఎవరి సాయం లేకుండానే హ్యాండ్ స్టిక్ పట్టుకుని నడవడం కనిపించింది. మొత్తంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తరువాత ఆయన తొలిసారిగా విపక్ష నేతగా అసెంబ్లీలో అడుగు పెట్టారు. ఆయన ఎవరినైతే అసెంబ్లీలో చూడడానికి ఇష్టపడలేదో అదే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా అసెంబ్లీలో సభా నాయకుడిగా ఉన్నారు.