ఇలా జాబితాలు.. అలా అసమ్మతులు!.. వైసీపీలో గందరగోళం | pandemonium in ycp| sittings| change| lists| one| way| resignations
posted on Feb 1, 2024 2:58PM
వైసీపి అధినేత జగన్మోహన్ రెడ్డి వైనాట్ 175, అలాగే లోక్ సభ స్థానాలు కూడా 25 అవుటాఫ్ 25 అంటూ తెగ ఊదరగొట్టేసి.. ఇప్పుడు గెలవాలంటే అభ్యర్థులను మార్చేయాలని భావిస్తున్నారు. అయితే అభ్యర్థులను కాదు.. గెలవాలంటే అధినేతను మార్చాలని, ఆయన నిర్ణయంతో తీవ్ర అసంతృప్తికి లోనై పార్టీ విడిచి వెళ్లి పోతున్న నేతలు చెబుతు
న్న మాట. ఇప్పటి వరకూ ఆయన ఇలాంటి మార్పులు చేర్పులతో ఐదు జాబితాలు విడుదల చేశారు. మొత్తం 61 అసెంబ్లీ, 14 లోక్ సభ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేశారు. ఒంగోలు వైసీపి ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డికి మళ్ళీ టికెట్ ఇవ్వాలని ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ రెడ్డి పట్టుబట్టినా పట్టించుకోలేదు. అక్కడి నుంచి ఈసారి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పోటీ చేస్తారని కుండబద్దలు కొట్టినట్లు చెప్పేశారు. అలా చెప్పినట్లే ఒంగోలు లోక్‌సభ బాధ్యతలు చెవిరెడ్డికి కట్టబెట్టారు. గత్యంతరం లేక బాలినేని సర్దుకుపోయి ఒంగోలు అసెంబ్లీ సీటుతో సరిపెట్టకుంటానని చెప్పేశారు. అయినా ఆయనలో అసమ్మతి నివురుగప్పిన నిప్పులా ఉంది. అది ఏక్షణంలోనైనా నివురు తొలగించుకుని భగ్గుమనడం తథ్యమని పరిశీలకులు అంటున్నారు. ఇక మాగుంట అయితే పార్టీని వీడేందుకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఇక నెల్లూరు అర్బన్ వైసీపి ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ ఇంతకాలం తనకు నెల్లూరులో తిరుగే లేదని, పార్టీని వీడిన కోటంరెడ్డి, మేకపాటి, ఆనం ముగ్గురికీ తన తడాఖా చూపిస్తానంటూ గంభీర ఉపన్యాసాలు ఇస్తూ వచ్చారు.
తీరా ఇప్పుడు ఆయనను నెల్లూరు నుంచి మార్చేసి నరసరావు పేట ఎంపీగా పోటీ చేయమంటున్నారు. ఆయన ఇప్పటి వరకూ మౌనంగానే ఉన్నా.. పార్టీ మారే యోచన చేస్తున్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. అందుకు కారణం లేకపోలేదు. అనీల్ కుమార్ యాదవ్ మాకు వద్దంటే వద్దని నరసరావుపేట వైసీపీ శ్రేణులు ఇప్పటికే ఆందోళన బాట పట్టారు. ఎలాగోలా సర్దుకుని పోటీ చేసినా నరసరావు పేట లోక్ సభ అభ్యర్థిగా పార్టీ శ్రేణుల సహకారం లేకుండా గెలిచే అవకాశాలు లేవని అనీల్ కుమార్ యాదవ్ భావిస్తున్నారు.
అదే విధంగా సత్యవేడు వైసీపి ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంను ఈసారి తిరుపతి నుంచి లోక్‌సభకు పోటీ చేయాలని జగన్ ఆదేశించి సత్యవేడు టికెట్ నూకతోటి రాజేష్‌కి ఇచ్చారు. ఈ మార్పును అంగీకరించని ఆదిమూలం పార్టీకి గుడ్ బై చెప్పేశారు. ఇంకా మరిన్ని జాబితాలు ఉన్నాయంటున్నారు. ఒక్కో జాబితాతో పార్టీలో అసమ్మతి, అసంతృప్తి పెరిగిపోతోంది. జాబితాలు పూర్తయ్యే నాటికి పార్టీలో ఉండేదెవరో, గుడ్ బై చెప్పి వెళ్లేదెవరో అన్న అయోమయం పార్టీ శ్రేణుల్లో నెలకొంది.