Leading News Portal in Telugu

ఒంగోలులో కాక రేగుతోన్న రాజకీయం | Political heat in Ongole


posted on Feb 2, 2024 5:07PM

ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని ఒంగోలు కేంద్రంగా రాజకీయం కాక రేగుతోంది. ఒంగోలు పార్లమెంటరీ సమన్వయకర్తగా చెవిరెడ్డి భాస్కరరెడ్డిని నియమించడంతో మొదలైన రగడ.. ఆయన ఫ్లెక్సీలను గుర్తు తెలియని వ్యక్తులు రాత్రికి రాత్రే చింపి.. తగలబెట్టారు. దీంతో ఒంగోలులో అధికార పార్టీలో పోరు తారస్థాయికి చేరినట్లు అయింది. దాంతో జిల్లాలో రాజకీయ పరిస్థితులు మళ్లీ మొదటికి వచ్చాయని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. అయితే ఈ చర్యకు పునుకొంది మాత్రం బాలినేని వర్గీయులేననే ఓ ప్రచారం అయితే జిల్లాలో వాడి వేడిగా ఊపందుకొన్నట్లు తెలుస్తోంది.   

ఒంగోలు ఎంపీ అభ్యర్థి ఎంపిక అంశంపై స్తానిక ఎమ్మెల్యే, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తన పంతం వీడడం లేదని.. దీంతో స్థానిక రాజకీయ పరిస్థితులు ఒక కొలిక్కి రావడం లేదని వారు వివరిస్తున్నారు. ఇదే అంశంపై ఇటీవల బాలినేనితో సీఎం వైయస్ జగన్ ప్రతినిధులు సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయిరెడ్డి భేటీ కావడం.. ఆ క్రమంలో ఎంపీ అభ్యర్థిగా చెవిరెడ్డిని నిలుపుతామంటూ వారు బాలినేనితో స్పష్టం చేయడం.. ఆ ప్రతిపాదనను బాలినేని వ్యతిరేకించడమే కాకుండా.. ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా మాగుంట శ్రీనివాసులరెడ్డి లేకుంటే ఆయన కుమారుడు రాఘవరెడ్డిని ప్రకటించాలని.. అలా అయితే వారిని గెలిపించుకుంటామని… అలా కాదు.. కూడదంటూ.. చెవిరెడ్డి భాస్కరరెడ్డికి  ఇస్తామంటే మాత్రం అది కుదరని పని అని వారి ఎదుటే బాలినేని కుండ బద్దలు కొట్టినట్లు.. స్థానికంగా ఓ చర్చ అయితే వైరల్ అవుతుందని చెబుతున్నారు.  ఇక బాలినేని ఆలోచనలను ముందే పసిగట్టిన తాడేపల్లి ప్యాలెస్‌లోని పెద్దలు.. ఒకానొక సమయంలో మంత్రి ఆర్కే రోజాను ఒంగోలు ఎంపీగా బరిలో దింపేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు మీడియాలో కథనాలు సైతం వెల్లువెత్తాయని.. కానీ ఆ తర్వాత ఏం జరిగిందో ఏమో కానీ.. మళ్లీ చెవిరెడ్డిని తెరపైకి తీసుకు వచ్చారని.. అయితే చెవిరెడ్డి ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని చంద్రగిరి ఎమ్మెల్యే అని… అదీకాక ఆయన ఒంగోలులో నాన్ లోకల్ అని..  దాంతోపాటు తన బావమరిది, టీటీడీ బోర్డ్ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి ఈ చెవిరెడ్డి జాంగ్ జిగ్రీ దోస్త్ అని.. దీంతో తన శత్రువుకు మిత్రుడు.. తనకు శత్రువే అవుతారన్నట్లుగా బాలినేని వ్యవహారశైలి ఉందని రాజకీయ విశ్లేషకులు ఈ సందర్బంగా విపులీకరిస్తున్నారు. 

ఓ వేళ ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా చెవిరెడ్డి టికెట్ ఇస్తే.. రేపు ఆయన గెలిస్తే.. జిల్లాలో తన రాజకీయ ప్రాబల్యం దాదాపుగా కనుమరుగు అవుతోందని బాలినేని ఆలోచిస్తున్నారని…. ఇంకా క్లారిటీగా చెప్పాలంటే.. సదరు జిల్లాలో చెవిరెడ్డి అండ చూసుకొని వైవీ సుబ్బారెడ్డి రాజకీయంగా మరింత చెలరేగిపోయే అవకాశాలు ఉన్నాయని.. ఈ విషయాన్ని గ్రహించిన బాలినేని.. ఎంపీ అభ్యర్థి విషయంలో.. తాను పట్టిన కుందేటికి మూడే కాళ్లన్న చందంగా వ్యవహరిస్తున్నారని వారు వివరిస్తున్నారు. ఇక ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా మాగుంట శ్రీనివాసుల రెడ్డి లేదా ఆయన కుమారుడు. అది ఇది కాకుంటే తన కుమారుడు బాలినేని ప్రణీత్ రెడ్డికి ఇస్తే.. ఉమ్మడి జిల్లాలో ఫ్యాన్ పార్టీ గెలుపు బాధ్యతలు తన నెత్తికి ఎత్తుకుంటాననే ఓ బలమైన సందేశాన్ని సైతం ఇప్పటికే బాలినేని తాడేపల్లి ప్యాలెస్‌కు పంపినట్లు.. ఓ ప్రచారం అయితే జిల్లాలో జోరుగా కొన.. సాగుతోందనే ఓ ప్రచారం సైతం నడుస్తోంది. ఓ వేళ ఒంగోలు ఫ్యాన్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా చెవిరెడ్డి భాస్కరరెడ్డి పేరును జగన్ అండ్ కో ఖరారు చేస్తే.. బాలినేని ఆ వెంటనే పెట్టి బేడా సర్దుకొని.. వైయస్ షర్మిల సమక్షంలో హస్తం పార్టీలో చేరే అవకాశాలు మెండుగా ఉన్నాయని.. ఆ క్రమంలో తనతోపాటు తన కుమారుడికి సైతం టికెట్లు ఇప్పించుకొని.. జిల్లాలో మళ్లీ తన రాజకీయాన్ని పదును  పెట్టుకొనే అవకాశాలు సైతం ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు తమదైన శైలిలో విశ్లేషణలు చేస్తున్నారు.