Leading News Portal in Telugu

చంద్ర‌బాబు మాస్టార్ ప్లాన్‌.. తిరువూరు అసెంబ్లీ బ‌రిలో ఫైర్‌ బ్రాండ్‌ కొలికిపూడి | kolikipudi as tiruvuru tdp candidate| sc| st| amarawati| charishma| aurator| ycp


posted on Feb 2, 2024 6:26PM

ఏపీలో ఎన్నిక‌ల వేడి తారస్థాయికి చేరింది.  మ‌రో మూడునాలుగు నెల‌ల్లో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో అధికార వైసీపీ, తెలుగుదేశం, జ‌న‌సేన కూట‌మి అభ్య‌ర్థుల ఎంపికపై ఆచితూచి అడుగులు వేస్తున్నాయి. వైసీపీ అధినేత‌, సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి మరో చాన్స్ కోసం నేల విడిచి సాము చేస్తున్నారు. ఈక్ర‌మంలో ప‌లు నియోజ‌క‌వ‌ర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేల‌కు చెక్‌పెడుతూ కొత్త‌గా ఇంచార్జిల‌ను నియ‌మిస్తున్నారు. ఇప్ప‌టికే ఐదు ద‌పాలుగా విడుద‌లైన జాబితాల్లో  60 నియోజ‌క‌వ‌ర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేల‌ను మార్చేశారు. ఈ క్ర‌మంలో తెలుగుదేశం, జ‌న‌సేన కూట‌మి అభ్య‌ర్థుల ఎంపిక‌పై ఆచితూచి వ్య‌వ‌హ‌రిస్తోంది. వైసీపీ అభ్య‌ర్థుల‌కు దీటుగా బ‌ల‌మైన అభ్య‌ర్థుల‌ను బ‌రిలో నిలిపేందుకు చంద్ర‌బాబు, ప‌వ‌న్ స‌మాలోచ‌న‌లు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఎన్టీఆర్ జిల్లాలోని తిరువూరు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి అమ‌రావ‌తి ఉద్య‌మంలో కీల‌క పాత్ర పోషిస్తున్న, ఫైర్ బ్రాండ్ గా పేరుగడించిన కొలిక‌పూడి శ్రీ‌నివాస్ ను బ‌రిలోకి దింపాల‌ని చంద్ర‌బాబు నిర్ణయించారు. వైసీపీలో టికెట్ ద‌క్క‌ని తిరువూరు సిట్టింగ్ ఎమ్మెల్యే ర‌క్ష‌ణ నిధి తెలుగుదేశంలోకి వ‌స్తారని, తిరువూరు నుంచి తులుగుదేశం అభ్య‌ర్థిగా బ‌రిలోకి దిగుతారని స్థానికంగా చ‌ర్చ‌జ‌రుగుతున్నది. అయితే  చంద్ర‌బాబు మాత్రం కొలిక‌పూడి శ్రీ‌నివాస్ వైపే మొగ్గు చూపుతున్న‌ట్లు స‌మాచారం. 

తిరువూరు నియోజ‌క‌వ‌ర్గంలో తెలుగుదేశం నేత‌గా ఉన్న మాజీ ఎమ్మెల్యే న‌ల్ల‌గ‌ట్ల స్వామిదాస్ ఇటీవ‌లే వైసీపీలో చేరారు. వైసీపీ అధిష్టానం ప్ర‌క‌టించిన నాలుగో జాబితాలో తిరువూరు అసెంబ్లీ ఇంచార్జిగా న‌ల్ల‌గ‌ట్ల స్వామిదాస్ పేరును ఉంది. దీంతో తిరువూరు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి వైసీపీ అభ్య‌ర్థిగా స్వామిదాస్ బ‌రిలో నిల‌వ‌డం దాదాపు ఖ‌రారైంది. స్వామిదాస్ కు దీటుగా బ‌ల‌మైన అభ్య‌ర్థిని బ‌రిలోకి దింపాల‌ని తెలుగుదేశం అధిష్టానం భావిస్తోంది. ఈ క్ర‌మంలో ఒక‌రిద్ద‌రి పేర్లు తెర‌పైకి వ‌చ్చిన‌ప్ప‌టికీ.. కొలిక‌పూడి శ్రీ‌నివాస్ ను తిరువూరు నుంచి బ‌రిలో దింప‌డ‌మే స‌రైంద‌ని చంద్ర‌బాబు భావిస్తున్నారని తెలుస్తోంది. ఇటీవ‌లే కొలిక‌పూడి శ్రీ‌నివాస్ చంద్ర‌బాబు స‌మ‌క్షంలో తెలుగుదేశం పార్టీలో చేరిన సంగతి తెలిసిందే.  తాటికొండ నియోజ‌క‌వ‌ర్గం సీటును ఆయ‌న ఆశిస్తున్న‌ప్ప‌టికీ.. తిరువూరు నియోజ‌క‌వ‌ర్గం అయితేనే విజ‌యావ‌కాశాలు పుష్క‌లంగా ఉంటాయ‌ని టీడీపీ అధిష్టానం భావిస్తోంది. ఎస్సీ సామాజిక వ‌ర్గానికి చెందిన శ్రీ‌నివాస్ భార్య ఎస్టీ  కావ‌డంతో ద‌ళితులు, గిరిజ‌నుల ఓట్లే ల‌క్ష్యంగా కొలిక‌పూడి పేరును తెలుగుదేశం అధిష్టానం తెర‌పైకి తెచ్చింది.

 అమ‌రావ‌తి ఉద్య‌మంలో కొలిక‌పూడి శ్రీ‌నివాస్ కీల‌క పాత్ర పోషిస్తున్న విష‌యం తెలిసిందే. ప‌లు ఛాన‌ళ్లలో డిబేట్ ల‌లోనూ కొలిక‌పూడి త‌న వాగ్దాటితో ప్ర‌త్య‌ర్థుల‌కు చుక్క‌లు చూపిస్తుంటాడు. ముఖ్యంగా అమ‌రావ‌తి ఉద్య‌మంలో పదునైన మాట‌ల‌తో ప్ర‌భుత్వ విధానాలు ఎండ‌గ‌ట్ట‌డం,  ఉద్యమాల్లో చురుకుగా పాల్గొన‌డంతోపాటు ఉమ్మ‌డి గుంటూరు స‌హా కృష్ణా జిల్లాలోనూ ప్ర‌జ‌ల్లో  శ్రీ‌నివాస్ మంచి పేరు తెచ్చుకున్నారు. ఇటీవ‌ల చంద్ర‌బాబు అరెస్టై జైలుకెళ్లిన స‌మ‌యంలో హైద‌రాబాద్‌లోని ఐటీ ఉద్యోగుల‌ను ఏక‌తాటిపైకి తీసుకువ‌చ్చి వారిని చైత‌న్య‌ ప‌రిచి చంద్ర‌బాబుకు మ‌ద్ద‌తుగా అక్క‌డి ఆందోళ‌న‌లకు కొలిక‌పూడి శ్రీ‌నివాస్ నేతృత్వం వ‌హించారు. అన్ని అంశాల్లోనూ ప్ర‌త్య‌ర్థుల‌ను దీటుగా ఎదుర్కోగ‌ల స‌త్తాఉన్న కొలిక‌పూడిని ఎలాగైనా అసెంబ్లీలోకి తీసుకురావాల‌ని చంద్ర‌బాబు భావిస్తున్నారని చెబుతున్నారు‌. ఈ క్ర‌మంలో తిరువూరు నుంచి కొలిక‌పూడి శ్రీ‌నివాస్ పేరును చంద్ర‌బాబు  దాదాపు ఖ‌రారు చేసిన‌ట్లు తెలుస్తోంది. 

ఎస్సీ సామాజిక వ‌ర్గానికి రిజ‌ర్వు అయిన తిరువూరులో ఎస్సీ సామాజిక వ‌ర్గ ఓట్ల‌తో పాటు ఎస్టీ సామాజిక వ‌ర్గానికి చెందిన ఓట్లుకూడా ఎక్కువ‌గానే ఉన్నాయి. ఈ క్ర‌మంలో శ్రీ‌నివాస్ ఎస్సీ సామాజిక వ‌ర్గం వ్య‌క్తి కావ‌డం, అత‌ని భార్య ఎస్టీ సామాజిక వ‌ర్గానికి చెందిన  వ్య‌క్తికావ‌డంతో రెండు సామాజిక వ‌ర్గాల ఓట్లూ ప్రభావితమౌతాయని   టీడీపీ అధిష్టానం భావిస్తున్నద‌ని స‌మాచార‌. తిరువూరుతో పాటు మైల‌వ‌రంలో ఉన్న ప‌లు తండాల్లో కూడా కొలిక‌పూడి శ్రీనివాస్ స‌తీమ‌ణితో ప్ర‌చారం చేయించ‌డం ద్వారా మంచి  మైలేజ్ వ‌స్తుంద‌ని తెలుగుదేశం భావిస్తోంది. అమ‌రావ‌తి ఉద్య‌మంలో కొలిక‌పూడి కీల‌కంగా వ్య‌వ‌హ‌రించిన నేప‌థ్యంలో తిరువూరు నియోజ‌క‌వ‌ర్గం ప్ర‌జ‌లుకూడా ఎక్కువ‌గా ఆద‌రిస్తార‌ని, త‌ద్వారా వైసీపీని తిరువూరులో వైసీపీని మ‌ట్టిక‌రిపించాలంటే కొలిక‌పూడి శ్రీ‌నివాస్ క‌రెక్ట్ క్యాండెంట్ అని చంద్రబాబు భావిస్తున్నారు. కొలిక‌పూడి   తిరువూరు నుంచి బ‌రిలోకి దిగితే భారీ మెజారిటీతో విజయం సాధించడం ఖాయమని పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు.