Leading News Portal in Telugu

Jasprit Bumrah Bowling: బుమ్రా దెబ్బకు బ్యాట్‌ కిందపడేసిన స్టోక్స్‌.. వీడియో వైరల్!


Jasprit Bumrah Bowling: బుమ్రా దెబ్బకు బ్యాట్‌ కిందపడేసిన స్టోక్స్‌.. వీడియో వైరల్!

Ollie Pope Stuns with Jasprit Bumrah’s Yorker in IND vs ENG 2nd Test: విశాఖలో ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా చెలరేగాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఏకంగా 6 వికెట్లు పడగొట్టి ఇంగ్లండ్‌ పతనంలో కీలకపాత్ర పోషించాడు. బుమ్రా దెబ్బకు ఇంగ్లీష్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 253 పరుగులకు ఆలౌట్ అయింది. యార్కర్స్, స్వింగ్ బంతులతో బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. అయితే ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ కెప్టెన్‌ బెన్‌ స్టోక్స్‌ని పెవిలియన్‌కు పంపిన బంతి హైలెట్ అని చెప్పాలి. బుమ్రా దెబ్బకు స్టోక్స్‌ ఏకంగా బ్యాట్‌ కిందపడేశాడు. ఇందుకుసంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది.


జస్ప్రీత్ బుమ్రా వేసిన ఇన్నింగ్స్‌ 50వ ఓవర్‌లో రెండో బంతిని బెన్ స్టోక్స్‌ ఎదుర్కొన్నాడు. కట్టర్‌ సంధించి స్టోక్స్‌ని బుమ్రా బోల్తా కొట్టించాడు. ఆఫ్‌ స్టంప్‌ దిశగా తక్కువ ఎత్తులో వచ్చిన బంతిని స్టోక్స్‌ డిఫెండ్ చేయబోయాడు. అయితే బంతి మిస్‌ అయి ఆఫ్‌ స్టంప్‌ని పడగొట్టింది. దీంతో స్టోక్స్‌ వెనక్కి కూడా చూడకుండా బ్యాట్ కింద పడేసి నిరాశతో క్రీజును వదిలివెళ్లాడు. ఈ వికెట్‌కు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్‌ అయ్యాయి. స్టోక్స్‌ను ఔట్‌ చేయడం ద్వారా బుమ్రా టెస్టుల్లో 150 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు.

అంతకుముందు 28వ ఓవర్లో ఓ అద్భుత యార్కర్‌తో తొలి టెస్ట్ సెంచరీ హీరో ఓలి పోప్‌ను ఔట్ చేశాడు. 28వ ఓవర్ ఐదవ బంతిని ఫుల్ లెంత్ యార్కర్‌ వేయగా.. పోప్‌ బోల్డ్ అయ్యాడు. ‘ఎలా ఆడాలి ఈ బంతిని?’ అన్నట్టుగా నిరాశతో అతడు పెవిలియన్ చేరాడు. ఈ వికెట్‌కు సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. మొదటి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 253 పరుగులకు ఆలౌట్ కావడంతో.. భారత్‌కు 143 పరుగుల తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం లభించింది. రెండోరోజు ఆట ముగిసేసరికి భారత్ వికెట్ నష్టపోకుండా 28 పరుగులు చేసింది. రోహిత్‌ శర్మ (13), యశస్వి జైస్వాల్ (15) క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం భారత్‌ ఆధిక్యం 171 రన్స్‌గా ఉంది.