Leading News Portal in Telugu

California Rainstorm: కాలిఫోర్నియాలో రికార్డు వర్షపాతం.. ముగ్గురు మృతి!


California Rainstorm: కాలిఫోర్నియాలో రికార్డు వర్షపాతం.. ముగ్గురు మృతి!

3 killed in California due to Rainstorm: అమెరికాలోని కాలిఫోర్నియాను శక్తివంతమైన తుఫాను ముంచెత్తింది. తుపాను కారణంగా కాలిఫోర్నియా రాష్ట్రంలో కుంభవృష్టి కురిసింది. భారీ స్థాయిలో వరదలకు తోడు బలమైన గాలులు కూడా వీస్తున్నాయి. రికార్డు స్థాయిలో వర్షం కురవడంతో విద్యుత్తుకు అంతరాయం ఏర్పడింది. చాలా చోట్ల వీధుల్లోకి బురద కొట్టుకొచ్చింది. చెట్లు కూలిపోవడంతో ముగ్గురు మరణించారు. మంగళవారం కూడా భారీ వర్షాలు, ఆకస్మిక వరదలు కొనసాగుతాయని వాతావరణ నిపుణులు పేర్కొన్నారు.


130 చోట్ల నుంచి వరదల సమాచారం అందిందని అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపారు. చాలా చోట్ల రెస్క్యూ ఆపరేషన్స్ నిర్వహించారు. రికార్డు స్థాయిలో కురుస్తున్న వర్షపాతం కారణంగా రాష్ట్రంలోని ఎనిమిది కౌంటీల్లో గవర్నర్ అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. లాస్ ఏంజిల్స్‌తో సహా కాలిఫోర్నియా రాష్ట్రంలోని దక్షిణాన ఉన్న కొండ ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రదేశాలకు వెళ్లాలని అధికారులు ఆదేశించారు. తుపాను కారణంగా దెబ్బతినడంతో పసిఫిక్‌ తీర హైవేను మూసివేయాలని అధికారులు నిర్ణయించారు.

అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని లాస్‌ ఏంజిలెస్‌ మేయర్‌ కరెన్ బాస్ విజ్ఞప్తి చేశారు. చాలా చోట్ల వీధుల్లోకి బురద కొట్టుకొచ్చింది. శాన్ ఫ్రాన్సిస్కో, పరిసర ప్రాంతాలు కొండచరియలు విరిగిపడ్డాయి. లాస్‌ ఏంజిలెస్‌ ప్రాంతంలో గత 150 ఏళ్లలో నమోదైన అత్యధిక వర్షపాతాల్లో ఇది మొదటి ఐదు స్థానాల్లో ఉంది. రెండు రోజుల్లో 6.35 అంగుళాల వర్షం కురిసింది. 1934లో పడిన 7.98 అంగుళాల వర్షపాతమే రికార్డు. నేడు కూడా వాతావరణం ఇలానే ఉంటుందని అధికారులు వెల్లడించారు. మరోవైపు ఇదే తుపాను లాస్‌వేగాస్‌, నెవాడ ప్రాంతాల్లో భారీ హిమపాతానికి కారణమైంది. రాష్ట్ర వ్యాప్తంగా 2,90,000 గృహాలకు విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. కాలిఫోర్నియా, అరిజోనా, నెవాడాల్లో 3.5 కోట్ల మంది ప్రస్తుతం వరద ముప్పులో ఉన్నారు. కుంభవృష్టి కారణంగా వేల సంఖ్యలో విమాన సర్వీసుల్లో జాప్యం లేదా రద్దు చోటుచేసుకొంది.