
Paytm CEO: డిజిటల్ చెల్లింపులలో ఓ వెలుగు వెలిగిన పేటిఏం సంస్థ ప్రస్తుతం తీవ్ర సంక్షోభంలో కొనసాగుతోంది. అయితే, ఫెమా నిబంధనల ప్రకారం కంపెనీపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారులు దర్యాప్తు ప్రారంభించినట్లు వార్తలు వస్తున్నాయి. మరోవైపు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) అధికారులు కంపెనీ వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మను కలిశారని తెలుస్తుంది. ఈ సమావేశంలో కంపెనీకి సంబంధించి కొనసాగుతున్న నియంత్రణ ఆందోళనలను పరిష్కరించ మార్గంపై చర్చించినట్లు టాక్. ఈ భేటీలో పేటిఏం కంపెనీ అధికారులు కూడా పాల్గొన్నారు. ఫారెక్స్ ఉల్లంఘనకు సంబంధించి కంపెనీపై విచారణ కొనసాగుతుంది. అయితే, ఫెమా ఉల్లంఘన నివేదికలను పేటిఏం పూర్తిగా తోసిపుచ్చింది.
పేటిఏం యొక్క బ్యాంకింగ్ శాఖ అయిన పేటిఏం పేమెంట్ బ్యాంక్ సేవలను నిలిపివేయాలని జనవరి 3వ తేదీన ఆర్బీఐ (RBI) ఆదేశించింది. ఇది, ఈ ఏడాది (2024) ఫిబ్రవరి 29 నుంచి ఇది అమలులోకి వస్తుందని తెలిపింది. అయితే, మరోవైపు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారులు పేటిఏం బ్రాండ్‌తో నడుస్తున్న కంపెనీలు విదేశీ మారకద్రవ్య నిబంధనలను ఉల్లంఘించాయా లేదా అనే దానిపై విచారణ చేస్తున్నారు. అయితే, ఫెమా నిబంధనల ప్రకారం ఏయే నిబంధనలను పరిశీలిస్తున్నారు అనేది స్పష్టంగా వెల్లడించలేదు.. పేటిఏం ప్లాట్‌ఫారమ్‌లకు సంబంధించిన లావాదేవీల గురించి సమాచారాన్ని సేకరించాలని ఈడీ అధికారులు ఆర్బీఐని కోరినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.