Leading News Portal in Telugu

ఓటమి తర్వాత తొలిసారి తెలంగాణ భవన్ కు  వచ్చిన కెసీఆ ర్ 


posted on Feb 6, 2024 1:59PM

బిఆర్ఎస్ కు మళ్లీ జవసత్వాలు నింపాలన్న ఉద్దేశ్యంతో ఆ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ పావులు కదుపుతున్నారు. కెసీఆర్ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించడానికి సన్నాహక చర్యలు చేపట్టారు.వాటర్ వార్ అంశమే ఆయనకు ప్రధాన అస్త్రంగా ఎంచుకున్నారు.  కేడర్ లో జోష్ నింపి లోకసభ ఎన్నికలలో జోష్ నింపాలని కెసీఆర్ యోచిస్తున్నారు. అబద్దాలు చెప్పి కాంగ్రెస్ అధికారంలో వచ్చిందని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని పార్టీ నాయకత్వానికి ఆయన  దిశానిర్దేశం చేశారు. 

 రాష్ట్ర ఆవిర్బావం తర్వాత పదేళ్లు ముఖ్యమంత్రి హోదాలో ఉన్న బిఆర్ ఎస్ అధ్యక్షుడు కెసీఆర్  ఓటమితర్వాత తొలిసారి  తెలంగాణ భవన్ లో అడుగుపెట్టారు. తెలంగాణ ఎన్నికలలో ఘోర పరాజయం చవి చూసిన తర్వాత తన స్వంత వ్యవసాయక్షేత్రంలోని బాత్ రూంలో కాలుజారిపడటంతో ఆయన  తుంటి ఎముక విరిగింది. శస్త్ర చికిత్స అనంతరం ఇటీవల అసెంబ్లీకి మొదటి సారి వచ్చి తన ఎమ్మెల్యే పదవికి ప్రమాణ స్వీకారం  చేశారు.  తెలంగాణ భవన్ కు ఆయన మూడు నెలల తర్వాత రావడం గమనార్హం. ఈ సందర్భంగా మహిళా ప్రజాప్రతినిధులు ఆయనకు హారతి ఇచ్చి ఆహ్వానం పలికారు. కృష్ణా జలాల పరిరక్షణ సభ ఏర్పాట్లను కేసీఆర్ సమీక్ష చేశారు.  కృష్ణా బేసిన్ లో ఉన్న ఉమ్మడి ప్రాజెక్టులను కాంగ్రెస్ ప్రభుత్వం కేఆర్ఎంబీకి అప్పగించడంపై పోరుబాటకు సంబంధించిన కార్యాచరణపై నేతలకు కేసీఆర్ మార్గనిర్దేశం చేశారు కేసీఆర్ సమీక్షా సమావేశానికి ఉమ్మడి మహబూబ్ నగర్, నల్గొండ, ఖమ్మం, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలు హాజరయ్యారు. పార్టీ కీలక నేతలు కేటీఆర్, హరీశ్ రావు కూడా తెలంగాణ భవన్ కు వచ్చారు. అసెంబ్లీ సమావేశాలు, రాష్ట్ర కేబినెట్ సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలపై కూడా చర్చించారు.  .  రానున్న లోక్‌సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశా నిర్దేశం చేశారు.  క్యాడర్ లో జోష్ నింపేందుకు నేతలు సమాయత్తం కావాలని ఆయన వారికి ఉద్భోదించారు.  నేతలకు నిరాశ చెందాల్సిన పనిలేదని, కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజలలో ఇప్పుడిప్పుడే వ్యతిరేకత మొదలయిందని, దానిని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లి పార్లమెంటు ఎన్నికల్లో అత్యధిక స్థానాలు సాధించేలా అందరూ కష్టపడి పనిచేయాలని కేసీఆర్ నేతలకు హిత బోధ చేశారు.  యాక్టివ్ గా లేని నేతలను పార్టీ బాధ్యతల నుంచి తప్పిస్తానని కూడా ఆయన హెచ్చరించారు.