
ఛేదనలో ఆరంభంలోనే కీలక వికెట్స్ కోల్పోయిన సమయంలో తాను, సచిన్ దాస్ పదే పదే మాట్లాడుకున్నామని భారత అండర్ 19 కెప్టెన్ ఉదయ్ సహరన్ తెలిపాడు. తాను క్రీజ్‌లో ఉంటానని, నువ్వూ కూడా ఉండు అని సచిన్ దాస్‌తో చెప్పానని ఉదయ్ చెప్పాడు. ఎలాంటి రిస్క్ తీసుకోకుండా.. మ్యాచ్‌ను చివరి వరకూ తీసుకెళ్లాలని తాను మనసులోనే అనుకున్నానని పేర్కొన్నాడు. దక్షిణాఫ్రికాపై 245 పరుగుల ఛేదనలో 32 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన సమయంలో ఉదయ్ (81; 124 బంతుల్లో 6 ఫోర్లు), సచిన్ (96; 95 బంతుల్లో 11 ఫోర్లు, 1 సిక్స్) వీరోచిత పోరాటం చేశారు. ఈ ఇద్దరి పోరాటంతో భారత్ 48.5 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 248 పరుగులు చేసి గెలిచింది.
మ్యాచ్ అనంతరం భారత అండర్ 19 కెప్టెన్ ఉదయ్ సహరన్ మాట్లాడుతూ… ‘విజయం సాధించినందుకు చాలా సంతోషంగా ఉంది. నా కెప్టెన్సీలో జట్టు ఫైనల్‌కు చేరుకోవడం బాగుంది. నాణ్యమైన ఆటతీరుతో ఛాంపియన్‌గా నిలుస్తామని భావిస్తున్నా. నా ఆటతీరుపై నాకు పూర్తి నమ్మకముంది. బ్యాటింగ్ కోసం మైదానంలోకి వచ్చినపుడు చివరి వరకూ క్రీజ్‌లో ఉండాలని నిర్ణయించుకున్నా. ఒక మంచి భాగస్వామ్యం వస్తే.. విజయం పెద్ద కష్టం కాదని అనుకున్నా. రిస్క్ షాట్స్ ఆడకుండా.. మ్యాచ్‌ను చివరి వరకూ తీసుకెళ్లాలని అనుకున్నా. నేను ఆరు ఫోర్లను మాత్రమే కొట్టానాని ఎలాంటి బాధ లేదు. ఇలా ఆడటం మా నాన్న నుంచి నేర్చుకున్నా. అవసరమైతే చివర్లో భారీ షాట్లు కొట్టాలని భావించా. నేను క్రీజ్‌లో ఉండటమే ముఖ్యమని భావించా’ అని తెలిపాడు.
‘నేను క్రీజ్‌లోకి వచ్చే సమయానికి బంతి బాగా బౌన్స్ అవుతోంది. పిచ్ పూర్తిగా పేసర్లకు అనుకూలంగా ఉంది. దాంతో ఆరంభంలో స్వేచ్ఛగా బ్యాటింగ్ చేయలేకపోయా. బంతి పాతబడిన కొద్దీ.. బ్యాటింగ్‌కు అనుకూలంగా మారింది. బంతి ఇంకా బౌన్స్ అవుతున్నా.. నేను, సచిన్ దాస్ క్రీజ్‌లో కుదురుకోవడంతో బ్యాటింగ్ కష్టంగా అనిపించలేదు. చివరి వరకూ క్రీజ్‌లో ఉండేందుకు ప్రయత్నించు, నేనూ ఉంటా అని సచిన్ దాస్‌తో చెప్పాను. అలా జరగకపోతే పరుగులు రాబట్టడం చాలా కష్టం లవుడాని చెప్పను. సచిన్ బాగా ఆడాడు. మంచి సహకారం అందించాడు. బౌండరీ లైన్ ఆవల మా కోచింగ్ సిబ్బంది ప్రోత్సహించారు’ అని ఉదయ్ సహరన్ చెప్పాడు.