Leading News Portal in Telugu

Pakistan: పోలింగ్‌కి ఒక రోజు ముందు పేలుళ్లతో దద్ధరిల్లిన పాక్.. 22 మంది మృతి..


Pakistan: పోలింగ్‌కి ఒక రోజు ముందు పేలుళ్లతో దద్ధరిల్లిన పాక్.. 22 మంది మృతి..

Pakistan: పాకిస్తాన్ సార్వత్రిక ఎన్నికలు గురువారం జరగబోతున్నాయి. ఎన్నికలకు ఒక రోజు ముందు పాకిస్తాన్ ఉగ్రదాడులతో నెత్తురోడుతోంది. పాకిస్తాన్ బలూచిస్తాన్ ప్రావిన్స్‌లో ఎన్నికల అభ్యర్థుల కార్యాలయాల సమీపంలో రెండు బాంబు పేలుళ్లు సంభవించాయి. ఈ ఘటన బుధవారం జరిగింది. ఈ జంట పేలుళ్లలో 22 మంది మృతి చెందారు. గురువారం ఎన్నికల నేపథ్యంలో ఈ ఘటన భద్రతపై ఆందోళన పెంచుతోంది.


పిషిన్ జిల్లాలోని ఇండిపెండెంట్ అభ్యర్థి కార్యాలయం వద్ద మొదటి బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 12 మంది మరణించారు. ఆఫ్ఘన్ సరిహద్దు పట్టణమైన ఖిల్లా సైఫుల్లాలో రెండో పేలుడు సంభవించింది. జమియాత్ ఉలేమా ఇస్లాం కార్యాలయంలో ఈ పేలుడు సంభవించింది. ఈ దాడుల వెనక ఎవరున్నారనేదానిపై ఇంకా స్పష్టత రాలేదు. అయితే, ఇస్లామిక్ తాలిబాన్, బలూచిస్తాన్ వేర్పాటువాద గ్రూపులు ఇటీవల పాక్ వ్యాప్తంగా దాడులు చేస్తున్నాయి. ముఖ్యంగా బలూచిస్తాన్, ఖైబర్ ఫఖ్తుంఖ్వా, సింధ్ ప్రాంతాల్లో పోలీసులు, పాక్ ఆర్మీ లక్ష్యంగా దాడులకు దిగుతున్నాయి.

మరోవైపు, పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ జైలులో ఉండటం, మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ మళ్లీ పాక్ ఎన్నికల్లో పాల్గొనడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆర్థిక సంక్షోభం, ఉగ్రవాదంతో అల్లాడుతున్న పాకిస్తాన్కి ఈ ఎన్నికలు కీలకం కాబోతున్నాయి. అయితే, ఈ ఎన్నికల కోసం పాక్ ఆర్మీనే లండన్‌లో ఉన్న నవాజ్ షరీఫ్‌ని ఎన్నికల బరిలో దింపినట్లు ఆరోపణలు ఉన్నాయి.