
Pakistan Elections 2024: పాకిస్థాన్‌లో పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఈ ఎన్నికల్లో నవాజ్ షరీఫ్‌కు చెందిన పీఎంఎల్-ఎన్, బిలావల్ భుట్టో జర్దారీకి చెందిన పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ, ఇమ్రాన్‌ఖాన్ పాకిస్థాన్ తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్ల మధ్యే ప్రధాన పోటీ నెలకొంది. అవినీతి కేసుల్లో ఇమ్రాన్ ఖాన్ జైలులో ఉండటం.. పీటీఐ పార్టీ బ్యాట్ గుర్తుపై ఈసీ నిషేధం విధించడంతో షరీఫ్‌కు చెందిన పీఎంఎల్ (ఎన్).. ఈ ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా అవతరించే అవకాశం ఉంది. అయితే, ఎవరికీ పూర్తి మెజార్టీ రాకపోవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరోసారి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఈ ఎన్నికల్లో పాకిస్థాన్ ఆర్మీ బహిరంగంగానే నవాజ్ షరీఫ్‌కు అండగా నిలుస్తోందని భావిస్తున్నారు. పీటీఐ పార్టీకి చెందిన అభ్యర్థులందరూ స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు. మరోవైపు బిలావల్ భుట్టో జర్దారీ కూడా పాక్ ఆర్మీని ప్రసన్నం చేసుకునే పనిలో బిజీగా ఉన్నారు.
పాకిస్థాన్ ఎన్నికల్లో రిగ్గింగ్ ఉందా?
పాకిస్థాన్‌లో సార్వత్రిక ఎన్నికల ఓటింగ్ గురువారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. ప్రజలు తమ ఓటుహక్కును వినియోగించుకుంటున్నారు. మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ పార్టీకి సైన్యం మద్దతు ఉన్నందున ఈ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా అవతరించవచ్చని భావిస్తున్నారు. ఉదయం ప్రారంభమైన ఓటింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. ఈ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా మొత్తం 12,85,85,760 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఓటింగ్ దృష్ట్యా, ఈ రోజు దేశంలో ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటించారు. ఓటింగ్ పూర్తయిన వెంటనే ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. సార్వత్రిక ఎన్నికల కోసం దాదాపు 6,50,000 మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. బలూచిస్థాన్‌లో ఎన్నికలకు ఒకరోజు ముందు బుధవారం జరిగిన జంట పేలుళ్లలో కనీసం 30 మంది చనిపోయారు. మరోవైపు, ‘క్షీణిస్తున్న భద్రతా పరిస్థితి’ కారణంగా పాకిస్థాన్‌లో మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపివేసినట్లు ఆ దేశ తాత్కాలిక ప్రభుత్వం తెలిపింది. క్షీణిస్తున్న భద్రతా పరిస్థితుల దృష్ట్యా దేశవ్యాప్తంగా మొబైల్ సేవలను తాత్కాలికంగా నిలిపివేయాలని నిర్ణయించినట్లు హోం మంత్రిత్వ శాఖ తెలిపింది. కరాచీ, పెషావర్‌తో సహా కొన్ని నగరాల్లో ఫోన్ సేవలు కూడా ప్రభావితమైనట్లు నివేదికలు కూడా ఉన్నాయి.
పోలింగ్‌లో గందరగోళం
కొన్ని చోట్ల ఓటింగ్ ప్రారంభించే ముందు బ్యాలెట్ పేపర్లు కలిగిన బ్యాగులను అధికారులు తెరవగా.. వాటిలో భారీ సంఖ్యలో బ్యాలెట్ పేపర్లు మాయమయ్యాయి. దీంతో పెద్దఎత్తున రిగ్గింగ్ జరిగే అవకాశం ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. పలు ఎన్నికల కేంద్రాల వద్ద ప్రిసైడింగ్ అధికారులు బ్యాలెట్ పత్రాలు ఉన్న బ్యాగులను తెరిచి చూడగా వాటిలో కొన్ని చిరిగిపోయి ఉండగా, మరికొన్ని బ్యాలెట్ పత్రాలు కనిపించకుండా పోయాయి. కరాచీ ఎన్నికల అధికారి దీనిపై ఉన్నతాధికారులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఎన్నికల సమయంలో రిగ్గింగ్ చేసేందుకే ఈ బ్యాలెట్ పత్రాలను ఎవరో మాయం చేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఓటు హక్కు వినియోనించుకున్న ఇమ్రాన్ ఖాన్
పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, జైలు శిక్ష అనుభవిస్తున్న ఇతర ప్రముఖ రాజకీయ ప్రముఖులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేశారు. ఈ మేరకు పాక్ మీడియా కథనాలు వెల్లడించాయి. అయితే, పోస్టల్ ఓటింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఖాన్ భార్య బుష్రా బీబీని దోషిగా నిర్ధారించి అరెస్టు చేయడంతో ఆమె ఓటింగ్‌లో పాల్గొనలేకపోయారని డాన్ న్యూస్ నివేదించింది. పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసిన నాయకులలో మాజీ విదేశాంగ మంత్రి షా మెహమూద్ ఖురేషీ, పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి చౌదరి పర్వేజ్ ఇలాహి, అవామీ ముస్లిం లీగ్ చీఫ్ షేక్ రషీద్, మంత్రి ఫవాద్ చౌదరి కూడా ఉన్నారని అడియాలా జైలు వర్గాలు బుధవారం తెలిపాయి. మొత్తంమీద, అడియాలా జైలులో 100 కంటే తక్కువ మంది ఖైదీలు ఓటు వేయగలిగారు, ఇది జైలులో ఉన్న 7,000 మంది ఖైదీలలో ఒక శాతం మాత్రమే.