Leading News Portal in Telugu

రెండు కోట్ల మంది యువ ఓటర్లకు ఓటు హక్కు: కేంద్ర ఎన్నికల సంఘం


posted on Feb 9, 2024 4:30PM

లోక్‌సభ ఎన్నికలు-2024 సమీపిస్తున్న వేళ భారత ఎన్నికల సంఘం శుక్రవారం కీలక ప్రకటన చేసింది. వచ్చే ఎన్నికల్లో ఓటు వేయడానికి దేశవ్యాప్తంగా 96.88 కోట్ల మంది అర్హత పొందనున్నారని వెల్లడించింది. 18 నుంచి 29 ఏళ్ల మధ్య వయసున్న 2 కోట్ల మంది యువ ఓటర్లు ఈ ఎన్నికల్లో ఓటు హక్కును ఉపయోగించుకోనున్నారని తెలిపింది. ఈ మేరకు ఓటు కోసం నమోదు చేసుకున్నారని తెలిపింది. కాగా గత లోక్‌సభ ఎన్నికలు-2019తో పోల్చితే నమోదైన ఓటర్ల సంఖ్య 6 శాతం మేర పెరిగిందని తెలిపింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ‘ఎక్స్’ వేదికగా ప్రకటన విడుదల చేసింది. 

ప్రపంచంలో అత్యధికంగా 96.88 కోట్ల మంది భారత ఓటర్లు రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఓటు వేయబోతున్నారని ఈసీ పేర్కొంది. కాగా లింగ నిష్పత్తి విషయంలో పెరుగుదల నమోదయిందని, 2023లో 940గా ఉన్న లింగ నిష్పత్తి 2024లో 948కి చేరిందని వెల్లడించింది. ఓటర్ల జాబితాపై ప్రత్యేకంగా దృష్టిసారించినట్టు పారదర్శకతతో జాబితాను రూపొందించామని పేర్కొంది..

 ప్రస్తుత 17వ లోక్‌సభ పదవీకాలం 16 జూన్ 2024తో యుగియనుంది. జూన్ 16లోపు సార్వత్రిక ఎన్నికలు నిర్వహించి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోంది. 2019లో 17వ లోక్‌సభకు ఏప్రిల్, మే నెలల్లో ఏడు విడతల్లో సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. 2019 ఏప్రిల్ 11 నుండి మే 19 వరకు ఏడు విడతల్లో ఓటింగ్ నిర్వహించి.. మే 23న ఓట్ల లెక్కింపు చేపట్టారు. దాదాపు 91.2 కోట్ల మంది ఓటర్లు ఉండగా, 67 శాతం మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. నాటి ఎన్నికల్లో బీజేపీ భారీ మెజారిటీతో విజయం సాధించి అధికార పగ్గాలు చేపట్టింది. బీజేపీకి 37.36 శాతం, కాంగ్రెస్‌కు 19.49 శాతం ఓట్లు దక్కాయి.

దేశంలో మొత్తం 543 లోక్‌సభ స్థానాలు ఉండగా, మెజారిటీకి 272 సీట్లు అవసరం. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 83 ప్రకారం, ప్రతి ఐదేళ్లకు ఒకసారి లోక్‌సభ ఎన్నికలు జరుగుతాయి. 18వ లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ను భారత ఎన్నికల సంఘం  త్వరలోనే ప్రకటించనుంది. 2024 లోక్‌సభ ఎన్నికల కోసం బీజేపీ 30కి పైగా పార్టీలతో పొత్తు పెట్టుకోగా, కాంగ్రెస్ తదితర విపక్షాలు ‘ఇండియా’ కూటమిని ఏర్పాటు చేశాయి.

సార్వత్రిక ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి నిర్వహిస్తారు. ఈ సారి కూడా ఏప్రిల్, మే నెలల్లో ఆరు నుంచి ఏడు విడతల్లో ఎన్నికలు జరిగే అవకాశముంది. తెలుగు రాష్ట్రాలకు సంబంధించినంత వరకు ఏపీలోని 175 అసెంబ్లీ స్థానాలు, 25 లోక్ సభ స్థానాలు, తెలంగాణలోని 17 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అత్యధికంగా యూపీలో 80 లోక్‌సభ స్థానాలు, మహారాష్ట్రలో 48, పశ్చిమ బెంగాల్‌లో 42, బీహార్ 42, తమిళనాడు 39 స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. సార్వత్రిక ఎన్నికల్లోనూ గెలుపొంది వరుసగా మూడోసారి అధికార పగ్గాలు సొంతం చేసుకోవాలని బీజేపీ ఉవ్విళ్లూరుతోంది.