Leading News Portal in Telugu

SA20 2024: హెన్రిస్‌ క్లాసెన్‌ విధ్వంసం.. సౌతాఫ్రికా టీ20 ఫైనల్‌కు సూపర్‌ జెయింట్స్‌!


SA20 2024: హెన్రిస్‌ క్లాసెన్‌ విధ్వంసం.. సౌతాఫ్రికా టీ20 ఫైనల్‌కు సూపర్‌ జెయింట్స్‌!

Durban Super Giants Reach SA20 2024 Final: డర్బన్‌ సూపర్‌ జెయింట్స్‌ టీమ్ సౌతాఫ్రికా టీ20 లీగ్‌ 2024 ఫైనల్‌లో అడగుపెట్టింది. గురువారం వాండరర్స్ స్టేడియంలో జోబర్గ్ సూపర్ కింగ్స్‌తో జరిగిన క్వాలిఫైయర్‌-2లో 69 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన డర్బన్‌.. తొలిసారి ఫైనల్‌కు చేరుకుంది. డర్బన్‌ గెలుపులో హెన్రిస్‌ క్లాసెన్‌ (74; 30 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్సులు), జూనియర్‌ డాలా (4 వికెట్స్) కీలక పాత్ర పోషించారు. ఫిబ్రవరి 10న కేప్‌టౌన్‌ వేదికగా జరగనున్న ఫైనల్లో సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్, డర్బన్ సూపర్ జెయింట్స్ తలపడనున్నాయి.


ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌ చేసిన డర్బన్‌ సూపర్‌ జెయింట్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసింది. హెన్రిస్‌ క్లాసెన్‌ విధ్వంసక ఇన్నింగ్స్ ఆడాడు. 30 బంతుల్లోనే 3 ఫోర్లు, 7 సిక్సర్లతో ఏకంగా 74 పరుగులు చేశాడు. క్లాసెన్‌ సిక్సులు వర్షం కురిపించడంతో డర్బన్‌ స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది. వియాన్‌ ముల్డర్‌ (50; 23 బంతుల్లో 3, ఫోర్లు, 3 సిక్సులు) హాఫ్‌ సెంచరీతో రాణించాడు. జోబర్గ్ సూపర్‌ జెయింట్స్‌ బౌలర్లలో నంద్రే బర్గర్‌, బ్రెస్‌వెల్‌ తలా రెండు వికెట్లు పడగొట్టారు.

212 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన జోబర్గ్ సూపర్‌ కింగ్స్‌ 17.4 ఓవర్లలో 142 పరుగులకే ఆలౌట్ అయింది. సూపర్‌ కింగ్స్‌ బ్యాటర్లలో మొయిన్‌ అలీ (30; 26 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్) టాప్‌ స్కోరర్‌. డోనోవన్ ఫెరీరా (24), డగ్ బ్రేస్‌వెల్ (23) వేగంగా ఆడినా అది సరిపోలేదు. డర్బన్‌ బౌలర్లలో జూనియర్‌ డాలా 4 వికెట్లతో కింగ్స్‌ పతనాన్ని శాసించాడు. నవీన్‌ ఉల్‌ హాక్‌, ప్రిటోరియస్‌ తలా రెండు వికెట్లు పడగొట్టారు. ఫిబ్రవరి 10న ఫైనల్ మ్యాచ్ జరగనుంది.