సీఎం రేవంత్ రెడ్డి బిగ్ స్కెచ్.. ఏమిటో తెలుసా? | revznth big sketch| brs| empty| general| elections| congress| win| mps
posted on Feb 10, 2024 5:52AM
దేశంలో కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉన్నా.. తెలంగాణలో మాత్రం ఆ పార్టీకి రోజు రోజుకు ప్రజాదరణ పెరుగుతోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం, సీఎంగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టడంతో ఆ పార్టీ శ్రేణుల్లో జోష్ పెరిగింది. దీనికి తోడు ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను సైతం సీఎం రేవంత్ రెడ్డి ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ వెలువడే నాటికి ఆరు గ్యారెంటీల్లో సగానికి పైగా హామీలను అమలు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అర్హులైన పేదలందరికీ ప్రభుత్వ పథకాలు అందించేలా ఇప్పటికే రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. గత ప్రభుత్వంలో అర్హత ఉండి ప్రభుత్వ పథకాలకు నోచుకోనివారికి సైతం ప్రస్తుతం కాంగ్రెస్ హయాంలో పథకాల లబ్ధి చేకూరుతుండటంతో పేద, మధ్య తరగతి ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరో రెండు నెలల్లో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అన్ని వర్గాల ప్రజల్లో కాంగ్రెస్ పార్టీపై అభిమానం పెరుగుతుండటం కలిసొచ్చే అంశం. అయితే, దాదాపు 15 పార్లమెంట్ స్థానాలను గెలుచుకోవటమే టార్గెట్ గా పెట్టుకున్న సీఎం రేవంత్ ఆ మేరకు తనదైన శైలిలో వ్యూహాలను అమలు చేస్తున్నారు.
త్వరలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో 12 నుంచి 15 స్థానాల్లో విజయం సాధించేలా రేవంత్ సారథ్యంలో కాంగ్రెస్ నేతలు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. అర్హులైన వారందరికీ ప్రభుత్వ పథకాలు అందేలా చేయడంతోపాటు బీఆర్ ఎస్ పార్టీలోని అసంతృప్త నేతలపై రేవంత్ రెడ్డి గురిపెట్టారు. బీఆర్ ఎస్ అధిష్టానంపై అసంతృప్తిగా ఉన్న నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు క్యూ కడుతున్నారు. కాంగ్రెస్ పట్ల ప్రజల్లో పెరుగుతున్న ఆదరణను చూసి మరికొంత మంది ప్రతిపక్ష పార్టీల్లోని నేతలు కాంగ్రెస్ గూటికి చేరేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే బీఆర్ ఎస్ పార్టీకి చెందిన పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్ నేత కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఢిల్లీలో రేవంత్ రెడ్డి సమక్షంలో వెంకటేశ్ నేతకు ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన పలువురు బీఆర్ ఎస్ ముఖ్యనేతలు సైతం కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. తాజాగా మాజీ మంత్రి, బీఆర్ ఎస్ ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, ఆయన సతీమణి వికారాబాద్ జెడ్పీ చైర్ పర్సన్ సునీత మహేందర్ రెడ్డిలు రేవంత్ రెడ్డిని కలిశారు. వీరు కూడా త్వరలో కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధమైనట్లు చెబుతున్నారు. రెండు మూడు రోజుల్లో ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ లో చేరనున్నారు.
గత ఎన్నికల్లో కాంగ్రెస్ మూడు ఎంపీ స్థానాల్లో విజయం సాధించింది. అధికారంలోఉన్న బీఆర్ ఎస్ పార్టీ తొమ్మిది ఎంపీ స్థానాల్లో విజయం సాధించింది. ఈ దఫా ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండటంతో 12 నుంచి 15 ఎంపీ స్థానాల్లో పార్టీ జెండా ఎగరవేయాలని రేవంత్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే పార్లమెంట్ నియోజకవర్గాల వారిగా ఇంచార్జిలను నియమించారు. వారు ఇప్పటికే ఆయా నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థుల ఎంపికపై దృష్టి పెట్టారు. ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గానికి తీవ్ర స్థాయిలో పోటీ నెలకొంది. ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థిగా ఎవరు బరిలో నిలిచినా విజయం ఖాయమన్న ధీమాతో అధిష్టానం ఉంది.
ఒక్కో పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో కాంగ్రెస్ పార్టీకి రోజురోజుకు పుంజుకుంటుండటంతో బీఆర్ ఎస్ సిట్టింగ్ ఎంపీలు సైతం కాంగ్రెస్ నుంచి బరిలోకి దిగేందుకు ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని బీఆర్ ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి చెప్పకనే చెప్పారు. చేవెళ్ల సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లేందుకు మొగ్గు చూపారని మీడియా చిట్ చాట్ లో మల్లారెడ్డి చెప్పడం తెలంగాణ రాజకీయాల్లో కలకలం రేపుతోంది.. రంజిత్ రెడ్డితోపాటు పలువురు సిట్టింగ్ ఎంపీలు, బీఆర్ ఎస్ లోని ముఖ్య నేతలు కొందరు కాంగ్రెస్ వైపు చూస్తున్నట్లు సమాచారం.. వీరంతా ఇప్పుడు కాకపోయినా, పార్లమెంట్ ఎన్నికల తరువాతైనా కాంగ్రెస్ గూటికి చేరడం ఖాయమని రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతుంది.