
Pakistan: దాయాది దేశం పాకిస్తాన్‌లో ప్రజాస్వామ్యం బయటకు మాత్రమే కనిపిస్తుంది, లోపల అంతా నడిపేది, నడిపించేది ఆ దేశ ఆర్మీ, ఐఎస్ఐ అనేది అందరికి తెలిసిన విషయమే. ఆర్థిక సంక్షోభం, ఉగ్రవాదం, వేర్పాటువాదం చెలరేగుతున్న నేపథ్యంలో ఆ దేశంలో ఎన్నికలు జరిగాయి. పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఎన్నికల్లో పాల్గొనకుండా నిషేధం విధించడంతో పాటు అతడి పార్టీ సింబర్ రద్దు చేసిన సమయంలో ఈ ఎన్నికలు జరిగాయి. అయితే, ఎన్నికల్లో నవాజ్ షరీఫ్ పార్టీ పాక్ ముస్లింలీగ్‌కి కానీ, బిలావల్ భుట్టో పార్టీ పాకిస్తాన్ పీపుల్స్ పార్టీకి కానీ క్లియర్ కట్ మెజారిటీ రాలేదు.
ఈ నేపథ్యంలో స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో రాజకీయ నాయకులు ‘‘పరిపక్వత, ఐక్యత’’తో వ్యవహరించాలని పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ పిలుపునిచ్చాడు. 25 కోట్ల జనాభా కలిగిన ప్రగతిశీల దేశంలో అరాచకం నుంచి ముందుకు సాగడానికి చేతులు కలపాలని ఆయన కోరాడు. పాక్ ఏర్పాటు తర్వాత నుంచి సగం కాలం ఆర్మీ జనరల్స్ పాలనలోనే ఉంది. దీంతో అక్కడి రాజకీయాల్లో పరోక్షంగా, ప్రత్యక్షంగా సైన్యం పాత్ర కీలకం. లండన్‌లో ప్రవాసంలో ఉన్న నవాజ్ షరీఫ్‌ని పాకిస్తాన్ పిలుపించి ఎన్నికల్లో పాల్గొనేలా చేసింది పాక్ ఆర్మీనే అనే వాదన ఉంది. తమకు అనుకూలంగా ఉండే ప్రభుత్వాన్ని అక్కడి ఆర్మీ కోరుకుంటోంది.
ఇదిలా ఉంటే, నవాజ్ షరీఫ్-బిలావల్ భుట్టోలు కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ మేరకు బిలావల్ భుట్టోతో మాజీ ప్రధాని షహబాజ్ షరీఫ్ చర్చలు జరిపారు. ఎవరు ఏ పదవి తీసుకోవాలనే దానిపై ఇరు పార్టీలు చర్చిస్తున్నాయి. 266 సీట్లు ఉన్న జాతీయ అసెంబ్లీలో నవాజ్ షరీఫ్ పార్టీకి 71 సీట్లు రాగా, భుట్టోకి 54 సీట్లు వచ్చాయి. చిన్నాచిత పార్టీలన్నీ కలిసి 27 స్థానాల్లో గెలిచాయి. ప్రభుత్వ ఏర్పాటుకు 133 స్థానాలు అవసరం. దీంతో అక్కడ హంగ్ ప్రభుత్వం ఏర్పాటు కానుంది.