
Australian Batsmen Harjas Singh form Chandigarh: సీనియర్ వన్డే ప్రపంచకప్ ఫైనల్ ఓటమి 140 కోట్ల మంది భారతీయులను ఇంకా బాధిస్తుండగానే.. జూనియర్ ప్రపంచకప్‌లోనూ పరాజయం పలకరించింది. సీనియర్ జట్టును దెబ్బకొట్టిన ఆస్ట్రేలియానే.. జూనియర్ జట్టు విజయానికి అడ్డుపడింది. అండర్-19 ప్రపంచకప్ 2024 ఫైనల్లో భారత్‌ను ఓడించిన ఆసీస్ నాలుగోసారి ఈ ట్రోఫీని ముద్దాడింది. దాంతో ప్రపంచకప్‌లో సీనియర్లకు ఎదురైన పరభావానికి కుర్రాళ్లు ప్రతీకారం తీర్చుకుంటారని అంతా భావించినా.. నిరాశే ఎదురైంది. ఆసీస్ ఛాంపియన్‌గా నిలవడంలో ఆ జట్టు మిడిలార్డర్ బ్యాటర్ హర్జాస్ సింగ్‌ది కీలక పాత్ర. అయితే ఆ హర్జాస్ సింగ్ మనోడే కావడం విశేషం.
ఆస్ట్రేలియా యువ బ్యాటర్ హర్జాస్ సింగ్ భారత సంతతికి చెందిన వాడే. హర్జాస్ మూలాలు పంజాబ్‌లోని చండీగఢ్‌లో ఉన్నాయి. హర్జాస్ తండ్రి ఇందర్జిత్ సింగ్ రాష్ట్ర బాక్సింగ్ ఛాంపియన్ కాగా.. అతడి తల్లి అవిందర్ కౌర్ రాష్ట్రస్థాయి లాంగ్‌జంప్ అథ్లెట్. ఇందర్జిత్ కుటుంబం 2000లో ఆస్ట్రేలియాకు వలస వెళ్లి స్థిరపడింది. 2005లో సిడ్నీలో హర్జాస్ సింగ్ జన్మించాడు. తల్లిదండ్రులది క్రీడా నేపథ్యం కాబట్టి.. చిన్నప్పటినుంచి హర్జాస్కు క్రీడలపై మక్కువ ఎక్కువ. రెవెస్బీ వర్కర్స్ క్రికెట్ క్లబ్లో 8 ఏళ్ల వయసులో అతడు కెరీర్ ప్రారంభించాడు. అద్భుతంగా ఆడుతూ అండర్-19కు చేరుకున్నాడు.
19 ఏళ్ల హర్జాస్ సింగ్ ఆస్ట్రేలియా జట్టు తరఫున అండర్-19 ప్రపంచకప్ 2024కు ఎంపికయ్యాడు. అండర్-19 ప్రపంచకప్ ఫైనల్ ముందు వరకూ హర్జాస్ మంచి ఇన్నింగ్స్ ఒక్కటి ఆడలేదు. ఆరు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 49 పరుగులే చేశాడు. అత్యధిక స్కోరు 17 పరుగులు. అయితే ఫైనల్లో మాత్రం అదరగొట్టాడు. 99 పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయిన దశలో జట్టును అదుకున్నాడు. ఆచితూచి ఆడుతూ హాఫ్ సెంచరీతో ఆస్ట్రేలియాకు గౌరవప్రదమైన స్కోర్ అందించాడు. 64 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లో 55 పరుగులు చేశాడు. భారత్ ఓటమికి హర్జాస్ ప్రధాన కారణం. ఇక హర్జాస్ బంధువులు పంజాబ్‌లో ఉన్నారు. చివరగా అతడు 2015లో భారత్‌కు వచ్చాడు.