Leading News Portal in Telugu

Kelvin Kiptum Dies: ఘోర రోడ్డు ప్రమాదం.. మారథాన్‌ అథ్లెట్‌ కెల్విన్‌ కిప్టుమ్‌ మృతి!


Kelvin Kiptum Dies: ఘోర రోడ్డు ప్రమాదం.. మారథాన్‌ అథ్లెట్‌ కెల్విన్‌ కిప్టుమ్‌ మృతి!

Kelvin Kiptum Dead in Car Accident in Kenya: అథ్లెటిక్స్ ప్రపంచంలో విషాదం నెలకొంది. కెన్యాకు చెందిన మారథాన్‌ స్టార్‌ అథ్లెట్‌ కెల్విన్ కిప్టుమ్‌ ఆదివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మరణించాడు. అతడితో పాటు కోచ్‌ గెర్వైస్ హకిజిమానా కూడా మృతి చెందాడు. ఈ ప్రమాదంలో మరొక మహిళకు తీవ్రంగా గాయాలు అయ్యాయి. అతి వేగం కారణంగానే కిప్టుమ్‌ కారు అదుపు తప్పి బోల్తా కొట్టిందని అధికారులు తెలిపారు. ఎంతో భవిష్యత్ ఉన్న కిప్టుమ్‌.. 24 ఏళ్లకే మరణించడంతో అథ్లెటిక్స్ ప్రపంచం శోకసంద్రంలో మునిగింది.


కెన్యాలోని కప్తగట్‌ నుంచి ఎల్డోరెట్‌కు కెల్విన్ కిప్టుమ్‌ కారులో బయల్దేరాడు. అతడితో పాటు కోచ్‌ గెర్వైస్ హకిజిమానా, ఓ మహిళ కారులో ఉన్నారు. అతి వేగం కారణంగా కారు అదుపు తప్పి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో కిప్టుమ్‌, హకిజిమానా అక్కడిక్కడే మృతి చెందారు. మహిళకు తీవ్ర గాయాలు కాగా.. ఆమెను సమీప ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో కిప్టుమ్‌ కారు డ్రైవింగ్‌ చేస్తున్నాడని, అతి వేగమే ఈ ప్రమాదానికి కారణం అని పోలీస్ కమాండర్‌ పీటర్ ములింగే తెలిపారు.

2023 అక్టోబర్‌లో మారథాన్‌లో కెల్విన్‌ కిప్టుమ్‌ ప్రపంచ రికార్డు సృష్టించాడు. షికాగోలో జరిగిన పోటీల్లో 2 గంటల 35 సెకన్లతో వరల్డ్‌ రికార్డు నెలకొల్పాడు. కెన్యాకే చెందిన ఎలియడ్ కిప్చోగే పేరిట ఉన్న రికార్డును 34 సెకన్ల ముందే (2 గంటల 1 నిమిషం 9 సెకండ్స్) అధిగమించాడు. 24 ఏళ్ల కిప్టుమ్‌ తన మూడో పోటీలోనే ఈ ఘనత సాధించడం విశేషం. 2 గంటల లోపే మారథాన్‌ను పూర్తిచేయడం, పారిస్ ఒలింపిక్స్‌లో అరంగేట్రం చేయడం వంటి కలలు కన్నాడు. కానీ ఇంతలోనే కిప్టుమ్‌ను మృత్యువు వెంటాడింది.