posted on Feb 12, 2024 1:36PM
ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో ఖాళీ అవుతున్న మూడు రాజ్యసభ స్థానాలకు వైసీపీ తరఫు అభ్యర్థులను సీఎం వైఎస్ జగన్ ఖరారు చేసిన సంగతి తెలిసిందే. ఎంపికైన ముగ్గురు అభ్యర్థుల్లో మేడా రఘునాథరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, గొల్ల బాబూరావు ఉన్నారు. ఈ సందర్భంగా వారు అసెంబ్లీలోని సీఎం కార్యాలయంలో జగన్‌ను కలిసి తమకు రాజ్యసభ అభ్యర్థులుగా అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. రాజ్యసభ స్థానాలకు ఈ నెల 27న ఎన్నికలు నిర్వహించనుండగా, గురువారం నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నెల 15 వరకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగనుంది. 16న నామినేషన్ల పరిశీలన చేపడతారు. నామినేషన్ల ఉపసంహరణకు గడువు 20వ తేదీ వరకు ఉంటుంది. దీనికి సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్‌ను ఎన్నికల అధికారి ముఖేష్‌కుమార్ మీనా గతంలో విడుదల చేశారు. ఎన్నికల ప్రక్రియ ఈ నెల 29లోగా పూర్తిచేస్తామని స్పష్టం చేశారు.ఈ నేపథ్యంలో రాజ్యసభ బరిలో నిలిచిన వైసీపీ అభ్యర్థులు ముగ్గురూ ఏపీ ముఖ్యమంత్రి జగన్ తో భేటీ అయ్యారు. ఈ ముగ్గురు సోమవారం మధ్యాహ్నం నామినేషన్ దాఖలు చేశారు. రాజ్యసభలో ఖాళీ అయిన మూడు సీట్లకు టీడీపీ పోటీపడితే ఈ నెల 27న ఎన్నికలు నిర్వహించనున్నట్లు సమాచారం. టీడీపీ తన అభ్యర్థులను నిలబెట్టకుంటే ఎన్నిక ఏకగ్రీవం కానుంది. ఈ విషయంపైనే ముఖ్యమంత్రి జగన్ తో వైవీ సుబ్బారెడ్డి, బాబురావు, మేడ రఘునాథ్ రెడ్డి చర్చించినట్లు తెలుస్తోంది.