Leading News Portal in Telugu

Komatireddy Venkat Reddy : నల్గొండను నాశనం చేసిందే కేసీఆర్


Komatireddy Venkat Reddy : నల్గొండను నాశనం చేసిందే కేసీఆర్

పదేండ్లు అధికారంలో ఉండి.. ఆంధ్రా నాయకులతో చెట్టాపట్టాలేసుకొని తిరిగి.. చేపల పులుసు తిని, రాయలసీమను రతనాలసీమ చేస్తనని శపథం చేసిన కేసిఆర్.. ఇప్పుడు అధికారం పోగానే గజినిలా గతం మరిచిపోయాడని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఒక ప్రకటనలో ఆరోపించారు. 2015 లో తెలంగాణ ప్రయోజనాలను ఆంధ్రాకు తాకట్టుపెట్టి తెలంగాణకు 299 టీఎంసీలకు ఒప్పుకొని ఇప్పుడు కల్లిబొల్లి మాటలు మాట్లాడుతున్నాడని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.


పదేండ్లు అధికారంలో ఉండి నల్గొండలో 70 శాతం పూర్తయిన ప్రాజెక్టులను కూడా పూర్తి చేయకుండా.. ఒక్క ప్రాజెక్టు కట్టకుండా మోసం చేసి.. మళ్లీ పార్లమెంట్ ఎన్నికలు రాగానే నాటకాలు మొదలు పెట్టారని ఆయన ఆక్షేపించారు. నాలుగు రోజులు నా ఇంటికి కలవడానికి వచ్చే ప్రజలందరు కలిస్తే కేసిఆర్ మీటింగ్ కు వచ్చినంత జనం ఉంటారని.. దానికోసం ఐదువందల మంది బిఆర్ఎస్ లీడర్లు ఇరవై రోజులు కష్టపడి, పది జిల్లాల నుంచి పైసలిచ్చి తీసుకొచ్చి మీటింగ్ పెట్టిన్రని కోమటిరెడ్డి ఎద్దేవా చేశారు.

ప్రజాస్వామ్యంలో ఎవ్వరైనా మీటింగ్ పెట్టుకోవచ్చని.. కానీ పబ్లిక్ మీటింగ్ లో మాట్లాడేటప్పుడు కొంత పరిణతితో నిజాలు మాట్లాడాలని ఆయన సూచించారు. కేసిఆర్ మీటింగ్ మొదలు పెట్టిన కాడికెళ్లి అయిపోయేదాక అబద్ధాలతో ప్రజల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేసిండని ఆయన ఆక్షేపించారు.

నల్గొండ ప్రాజెక్టులన్నీ పదేండ్లు పడావు పడిసి.. కనీసం కన్నెత్తి చూడని కేసిఆర్.. ప్రజల దగ్గరికి రావడానికి మోహం లేక తన ఏజెంట్లతో కృష్ణా వివాదాన్ని రగిలించి.. ఆ మంటల్లో చలికాగుతున్నడాని.. వారి దురాగతాల్ని ప్రజలు గమనిస్తున్నారని ఆయన అన్నారు. జీ.ఓ.నెంబర్ 46 తీసుకొచ్చి తెలంగాణ బిడ్డల పొట్టగొట్టి.. ఆంధ్రోళ్లకు అవకాశం కల్పించాడని ఆయన ఆరోపించారు. ఆంధ్రోళ్లు బ్రతకాలని నిత్యం ఆవేదన పడే సీమాంధ్ర సానుభూతిపరుడు కేసిఆర్ అని కోమటిరెడ్డి అన్నారు. సీమాంధ్ర కోసం ఎంతకైన పోరాడే కేసిఆర్ తెలంగాణలో రాజకీయాలు వదిలేసి ఆంధ్రాలో ARS (ఆంధ్రా రాష్ట్ర సమితి) పార్టీ పెట్టుకుంటే బావుంటుందని కోమటిరెడ్డి సూచించాడు.

రాళ్లు, రప్పలుండి వ్యవసాయం చేయని రియల్ ఎస్టేట్ భూములకు రైతుబంధు ఇచ్చి పేదల సొమ్మును పంచిపెట్టిన కేసిఆర్ కు మేం నిజమైన రైతులకు రైతు భరోసా ఇస్తే నచ్చడం లేదని అన్నారు. ఆయనలాగా ప్రజల సొమ్మును తన వంధిమాగాధులకు పంచిపట్టడం కాంగ్రెస్ కు అలవాటు లేదని తెగెసి చెప్పారు.

రైతుబంధు ఇవ్వడం లేదని ప్రచారం చేస్తున్న బీఆర్ఎస్ నాయకులను చెప్పుతో కొట్టాలని అంటే దాన్ని రైతులకు అపాదించాలని చూడటం కేసిఆర్ కుటిల బుద్ధికి నిదర్శనమన్నారు. తమకు కేసిఆర్ లా రైతులకు బేడీలు వేసిన చరిత్ర లేదని.. రైతుల్ని గుండెల్లో పెట్టుకున్న త్యాగమే ఉందని ఆయన స్పష్టం చేశారు.

తమకు మాట్లాడటం చేతకాక కాదని.. కేసిఆర్ వయసుకు మర్యాద ఇస్తే ఆయన నిలబెట్టుకోవడం లేదని కోమటిరెడ్డి అన్నారు. అదనపు నిధులున్న తెలంగాణను పది సంవత్సరాలు పాలించి అప్పుల తెలంగాణ గా మార్చి ఇప్పుడు నీతులు చెప్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. పదేండ్లలో ఒక్క ఇల్లు కట్టలేదు, ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు, ఒక్క రేషన్ కార్డు ఇవ్వని కేసిఆర్ కు అధికారం పోగానే ప్రజలు గుర్తుకు రావడం పట్ల కోమటిరెడ్డి ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

కేసిఆర్ కు ప్రజల మీద, ప్రజల సమస్యలమీద అంతప్రేమ ఉంటే.. ఆయన ఇంటి నుంచి ఐదు నిమిషాల్లో చేరుకునే అసెంబ్లీకి రాకుండా.. వంద కిలోమీటర్ల దూరంలోని నల్గొండకు పోవడం ఎందుకని నిలదీశారు. ఆయన కొడుకు అనుంగా అనుచరుడైన ఓ అధికారిని విచారిస్తే వేలకోట్ల ఆస్తులు దొరుకుతుంటే కేసిఆర్ కు భయం పట్టుకుందని కోమటిరెడ్డి ఆరోపించారు.

ఆయనేదో సీనియర్ రాజకీయ నాయకుడివని మర్యాద ఇస్తే.. కల్లు కంపౌండ్ కాడ తాగుబోతుకంటే అధ్వన్నంగా మాట్లాడుతున్నాడని కోమటిరెడ్డి నిప్పులు చెరిగారు. మెదక్ లో కేసిఆర్ పై ఒక సామాన్య కార్యకర్తను నిలబెట్టి గెలిపిస్తం.. దమ్ముంటే గెలవాలని కేసిఆర్ కు సవాల్ విసిరారు.. అధికారం పోగానే మతిభ్రమించి పిచ్చి కూతలు కూస్తే చూస్తు ఊరుకోమని.. ప్రజాస్వామ్యంగా దెబ్బకు దెబ్బ కొడతామని స్పష్టం చేశారు. పార్లమెంట్ ఎన్నికల కోసం ప్రజల్ని రెచ్చగొట్టాలని చూస్తున్న కేసిఆర్ కుత్సీత వైఖరి చూసి ప్రజలు నవ్వుకుంటున్నరని. ఒక్కొక్క బిఆర్ఎస్ ఎమ్మెల్యేను అరవై, డెబ్భై వేల మెజార్టీతో కాంగ్రెస్ నాయకులు ఓడించినా వారికి బుద్ధి రాలేదని ఆయన అన్నారు.

ఆయన తన బిడ్డ లిక్కర్ కేసుల కోసం, కొడుకు అవినీతి కేసుల కోసం తెలంగాణ బిడ్డల బ్రతుకుల్ని తాకట్టు పెట్టి ఇప్పడు అమాయకంగా, ఏం తెల్వదన్నట్టు నటించడం ఆయనకే చెల్లిందని ఎద్దేవా చేశారు. ప్రతీరోజు చావునోట్లో తలపెట్టిన్నని చెప్పుకు తిరిగే కేసిఆర్ దొంగ దీక్ష బండారం మొత్తం ప్రజలకు తెలియజేస్తామని కోమటిరెడ్డి హెచ్చరించారు. కేసిఆర్ దీక్ష చేసినన్ని రోజులు ఐవీఫ్లూయిడ్స్, మల్టీవిటమిన్లు, సంవత్సరాలకు సరిపడా న్యూట్రియెంట్స్ తీసుకొని తానేదో పెద్ద త్యాగాలు చేసినట్టు ప్రజల్ని మోసం చేయడం మానుకోవాలని హితవు చెప్పారు. ఆర్టీఐ చట్టం ద్వారా తీసుకున్న కేసిఆర్ దీక్ష రిపోర్టులను ప్రజల ముందు పెడతామని తేల్చి చెప్పారు. మణిపూర్ లో ఇరోమ్ షర్మిల అనే హక్కుల ఉద్యమకారిణి పదహారు సంవత్సరాలు ఐవీఫ్లూయిడ్స్, న్యూట్రియెంట్స్ తీసుకొని ఉద్యమం చేసిందని.. కానీ ఆమే ఎన్నడు కేసిఆర్ లా దీక్ష చేశానని చెప్పుకు తిరగలేదని.. నిజంగా ప్రజల కోసం పోరాడితే అంత నిజాయితీగా ఉంటారని ఆయన అన్నారు.

నల్గొండ బిడ్డ శ్రీకాంత చారి త్యాగంతో తెలంగాణ వస్తే.. వారి తల్లికి పదవిస్తానని పదేండ్లు అవమానించాడని ఆరోపించారు. ఇవ్వాల నల్గొండ మీటింగ్ బ్యానర్ పై ఏ ఒక్క తెలంగాణ ఉద్యమకారుడి ఫోటో లేకుండా కేవలం కేసిఆర్ ఒక్కని ఫోటో పెట్టుకొని.. నియంతగా వ్యవహరిస్తూ ఉద్యమకారుడు శ్రీకాంత చారి పేరు చెప్పడం ఎందుకని నిలదీశారు.
రాబోయే రోజుల్లో కేసిఆర్ చరిత్ర మొత్తం ప్రజల ముందు పెట్టి ఆయన అహంకారానికి కళ్లెం వేస్తామని కోమటిరెడ్డి తేల్చి చెప్పారు. నల్గొండ ప్రజలు రక్తంలోనే ఉద్యమం ఉందని.. వారు ఇలాంటి నియంతృత్వ భావజాలాన్ని, నియంతల్ని నమ్మరని ఆయన తేల్చిచెప్పారు.