
PM Modi: ప్రధాని నరేంద్రమోడీ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) పర్యటనలో ఆ దేశ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్‌పై ప్రశంసలు కురిపించారు. నా ‘సోదరుడు’ అంటూ సంబోధించారు. ఇరు దేశాల మధ్య బంధం మరింత బలపడాలని ఆకాంక్షించారు. యూఏఈ ప్రెసిడెంట్‌తో చర్చల తర్వాత అబుదాబిలో ప్రవాస భారతీయులను ఉద్దేశించి ‘ అల్హన్ మోడీ’ కార్యక్రమంలో ప్రధాని మోడీ ప్రసంగించారు. తాను తొలిసారి ప్రధాని అయిన తర్వాత 2015లో యూఏఈ పర్యటనను ప్రధాని గుర్తు చేసుకున్నారు.
30 ఏళ్లలో ఓ భారతీయ ప్రధాని యూఏఈకి వెళ్లడం అదే తొలిసారని, నేను కేంద్ర ప్రభుత్వంలో భాగమైన కొద్ది కాలానికి, దౌత్య ప్రపంచం కొత్తగా ఉన్న సమయంలో అప్పటి యువరాజు, ఇప్పుడు అధ్యక్షుడిగా ఉన్న అల్ నహ్యాన్ తన ఐదుగురు సోదరులతో కలిసి తనను రిసీవ్ చేసుకునేందుకు ఎయిర్‌పోర్టు వచ్చిన క్షణాలను ప్రధాని మోడీ గుర్తు చేసుకున్నారు. ఆ సమయంలో వారి ఆప్యాయత, కళ్లలోని మెరుపు తాను ఎప్పటికీ మరిచిపోలేదని ఆయన అన్నారు.
తన మొదటి సమావేశంలోనే తనకు దగ్గరగా ఉన్న వ్యక్తి ఇంటికి వచ్చినట్లు అనిపించిందని, నహ్యాన్ కూడా తనను కుటుంబ సభ్యుడిగా స్వాగతించారని, ఇది తన ఒక్కరికే స్వాగతం కాదని, యావత్ 140 కోట్ల మంది భారతీయులకు అని అన్నారు. 10 ఏళ్లలో ఇది తన 7వ యూఏఈ పర్యటన అని, ఈ రోజు కూడా సోదరుడు షేక్ మహ్మద్ బిన్ జాయెద్ విమానాశ్రయానికి వచ్చారని, అప్పుడు, ఇప్పుడు తన ఆప్యాయత ఒకేలా ఉందని, ఇదే అతని ప్రత్యేకత అంటూ కొనియాడారు. ప్రెసిడెంట్ అల్ నహ్యాన్ నాలుగు సార్లు స్వాగతించడం భారతదేశానికి ఆనందాన్ని కలిగిస్తోందని, యూఏఈలో భారతీయుల పట్ల శ్రద్ధ చూపే అధ్యక్షుడు ఉండటం చాలా అరుదు అని ప్రధాని కొనియాడారు.