బీఆర్ఎస్ కు కటీఫ్?.. మజ్లిస్ దోస్తీ కాంగ్రెస్ తోనే! | majlis cutiof with brs| congress| friendship| medigadda| visit| ruling| party| mlas| old| city| political
posted on Feb 14, 2024 9:37AM
ఆల్ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తేహదుల్ ముస్లిమీన్ (ఏఐఎమ్ఐఎమ్) అలియాస్ మజ్లిస్.. హైదరాబాద్ పాత బస్తీలో తిరుగులేని ఆధిపత్యం ఉన్న ఈ పార్టీ రాజకీయాల గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. బీజేపీ వ్యతిరేకతే ఈ పార్టీ విధానం అని చెప్పవచ్చు. అయితే ఆ ముసుగులో బీజేపీకి ప్రయోజనం చేకూర్చేందుకు జాతీయ స్థాయిలో విస్తరణ పేరిట ముస్లిం జనాభా అధికంగా ఉండే నియోజకవర్గాలలో అభ్యర్థులను పోటీకి నిలబెడుతోందన్న విమర్శలు కూడా ఉన్నాయి.
అయితే మొత్తంగా ఈ పార్టీ పాత బస్తీలో తన పట్టును నిలుపుకోవడానికే అత్యధిక ప్రాధాన్యత ఇస్తుంది. ఆ పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ బీఆర్ఎస్ అధికారంలో ఉన్నన్ని రోజులూ తెలంగాణలో ఆ పార్టీకే మద్దతుగా నిలిచింది. బీఆర్ఎస్ అధినేత కూడా అప్పట్లో ఎలాంటి దాపరికం లేకుండా మజ్లిస్, బీఆర్ఎస్ లు మిత్రులు అని అప్పట్లో ప్రకటించారు కూడా. కానీ మజ్లిస్ లక్ష్యం వేరు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచీ కూడా మజ్లిస్ అధికారంలో ఉన్న పార్టీతోనే దోస్తానా చేసింది. ఉమ్మడి రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్(బీఆర్ఎస్) తో మజ్లిస్ పార్టీ దోస్తీ కొనసాగింది. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం కూడా ఒవైసీ ఆయనతో భాయీ భాయీ బంధం నెరిపారు. మజ్లిస్ పార్టీ ఏం చేసినా పాతబస్తీలో తన పట్టు నిలుపుకోవడమే లక్ష్యంగా చేస్తుందన్నది పరిశీలకుల విశ్లేషణ. అవును కాంగ్రెస్ రాష్ట్ర పగ్గాలు రేవంత్ చేపట్టిన తరువాత రాష్ట్రంలో కాంగ్రెస్ జోరు స్పీడందుకుంది. అధికారం కారు నుంచి హస్తానికి ట్రాన్స్ ఫర్ అవుతుందన్న విశ్లేషణలూ వెల్లువెత్తాయి. దీంతో మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ బీఆర్ఎస్ కు దూరం జరిగే ప్రయత్నాలు ప్రారంభించారని అప్పట్లోనే రాజకీయవర్గాలలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది.
ఆ ప్రచారం వాస్తవమేనని ఇప్పుడు నిస్సందేహంగా తేలిపోయింది. ఔను రేవంత్ సర్కార్ మేడిగడ్డ సందర్శనకు ఇచ్చిన పిలుపునకు మజ్లిస్ స్పందించింది. మేడిగడ్డ సందర్శనకు కాంగ్రెస్ తో పాటు మజ్లిస్ ఎమ్మెల్యేలు సైతం వెళ్లారు. అయితే రేవంత్ సర్కార్ మేడిగడ్డ సందర్శనకు రావాల్సిందిగా కోరినా బీఆర్ఎస్, బీజేపీలు స్పందించలేదు. దీంతో రాష్ట్రంలో ఎవరెవరు ఇప్పుడు మిత్రులు, ఎవరెవరు ఇప్పుడు మిత్రులు కాదు అన్నది విస్పష్టంగా తేలిపోయిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తొలి నుంచీ అంటే ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలకు ముందు నుంచీ కూడా బీఆర్ఎస్ బీజేపీకి బీ టీమ్ అన్న ఆరోపణలు బలంగా ఉన్నాయి. మద్యం కుంభకోణం కేసు విషయంలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుమార్తె, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు లభించిన, ఇప్పటికీ లభిస్తున్న వెసులు బాట్లను ఇందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చని కాంగ్రెస్ ఎప్పటి నుంచో ఆరోపిస్తున్నది. ఇక కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ అవినీతికి బ్రాండ్ అన్న ఆరోపణలను సైతం ఎప్పటి నుంచో కాంగ్రెస్ చేస్తోంది.
అయితే బీఆర్ఎస్ అధికారంలో ఉన్నంత కాలం ఈ విషయంలో మజ్లిస్ జోక్యం చే సుకోలేదు. కాళేశ్వరం అవినీతిపై కానీ, మేడిగడ్డ కుంగుబాటుపై కానీ మజ్లిస్ బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా స్పందించలేదు. కానీ ఎప్పుడైతే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందో ఆ వెంటనే మజ్లిస్ ఆ పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి మేడిగడ్డ సందర్శనకు వెళ్లింది. దీంతోనే మజ్లిస్ ఇప్పుడు ఎవరికి మిత్రపక్షంగా ఉందో తేటతెల్లమైపోయింది. అసలు రేవంత్ సర్కార్ మేడిగడ్డ సందర్శన కార్యక్రమం పెట్టుకున్నదే బీఆర్ఎస్ కు, కేసీఆర్ కు వ్యతిరేకంగా . అలాంటి మేడిగడ్డ సందర్శనకు మజ్లిస్ వెళ్లడం అంటే తాము కాంగ్రెస్ వైపు ఉన్నామని మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ కుండబద్దలు కొట్టేసినట్లే. అయితే మజ్లిస్ బీఆర్ఎస్ కు దూరం జరగడం ఏమీ ఆశ్చర్యకర పరిణామం కాదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. నిజానికి మజ్లిస్ కాంగ్రెస్ మిత్రపక్షం గా ఉన్నట్లు మేడిగడ్డ సందర్శనకు హాజరు కావడంతో తేలిపోయినా.. వాస్తవానికి మజ్లిస్ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకే మిత్రపక్షంగా వ్యవహరిస్తుందని, అలాగే అధికారంలో ఉన్న కాంగ్రెస్ కూడా తన రాజకీయ అవసరాల కోసమే మజ్లిస్ ను చేరదీస్తున్నదని అంటున్నారు.
ఇంకా స్పష్టంగా చెప్పాలంటే.. పాత బస్తీలో తన పట్టు నిలుపుకోవాలంటే మజ్లిస్ కు రాష్ట్రంలో అధికార పార్టీ అండ అవసరం. అలాగే అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి తన అధికారాన్ని సుస్థిరం చేసుకోవాలంటే.. జంపింగుల భయం లేకుండా ధీమాగా పాలన సాగాలంటే.. మజ్లిస్ తమకు మద్దతుగా నిలవడం కావాలి. అందుకే పరస్పర ప్రయోజనాల పరిరక్షణలో భాగమే మజ్లిస్, కాంగ్రెస్ దోస్తానా అని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.