Leading News Portal in Telugu

Vikram Batra: కార్గిల్ హీరో కెప్టెన్ విక్రమ్ బాత్రా తల్లి కన్నుమూత..


Vikram Batra: కార్గిల్ హీరో కెప్టెన్ విక్రమ్ బాత్రా తల్లి కన్నుమూత..

Vikram Batra: కార్గిల్ యుద్ధ వీరుడు కెప్టెన్ విక్రమ్ బాత్రా తల్లి కమల్ కాంత్ బాత్రా(77) కన్నుమూశారు. ఆప్ మాజీ నేత అయిన కమల్ కాంత్ ఈ రోజు హిమాచల్ ప్రదేశ్‌లో మరణించారు. ఆమె మరణానికి హిమాచల్ ముఖ్యమంత్రి సుఖ్‌విందర్ సింగ్ సుఖు ఎక్స్‌లో తన సంతాపాన్ని వ్యక్తం చేశారు. ‘‘కెప్టెన్ విక్రమ్ బాత్రా తల్లి శ్రీమతి కమల్‌కాంత్ బత్రా మరణం గురించి విచారకరమైన వార్త తెలిసింది. మృతుల కుటుంబానికి అపారమైన దుఃఖాన్ని భరించే శక్తిని ఇవ్వాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాము’’ అంటూ ఆయన ఎక్స్ వేదికగా సంతాపం తెలియజేశారు.


కమల్ కాంత్ బాత్రా 2014 సార్వత్రిక ఎన్నికల్లో హిమాచల్ ప్రదేశ్ హమీర్‌పూర్ నుంచి ఆప్ తరుపున ఎంపీగా పోటీ చేశారు. అయితే, ఆప్ పనితీరు, సంస్థాగత నిర్మాణంపై అసంతృప్తిని వ్యక్తం చేస్తూ కొన్ని నెలల క్రితం పార్టీని వీడారు. ప్రధాని మోడీ కోసం తన వంతు ప్రయత్నం చేస్తున్నాడని,తన వాగ్దానాలన్నింటిని నేరవేర్చాలని ఆదే తన సూచన అని అన్నారు.

కార్గిల్ యుద్ధంలో వీరోచిత పోరాటంలో వీర మరణం పొందిన కెప్టెన్ విక్రామ్ బాత్రా(24) తల్లిగా ఆమె అందరికి సుపరిచితం. 1999లో పాకిస్తాన్‌తో భారత్ కార్గిల్ యుద్ధం చేసింది. ఈ యుద్ధంలో కెప్టెన్ విక్రమ్ బాత్రా హీరోగా నిలిచారు. అనేక కీలకమైన పాయింట్లను చేజిక్కించుకున్నారు. మరణానంతరం అత్యున్నత యుద్ధకాల శౌర్య పురస్కారం పరమవీర చక్ర ఇవ్వబడింది. అతని పరాక్రమానికి గుర్తుగా బాత్రాను “టైగర్ ఆఫ్ ద్రాస్”, “కార్గిల్ సింహం”, “కార్గిల్ హీరో” పిలుస్తుంటారు.

కెప్టెన్ బాత్రా జీవిత కథ ఆధారంగా సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా అద్వానీ జంటగా ‘షేర్షా’ చిత్రం 2021లో విడుదలైంది. కార్గిల్ యుద్ధంలో అత్యంత క్లిష్టమైన టార్గెట్ పాయింట్ 4875ని శత్రువుల నుంచి విజయవంతంగా చేజిక్కించుకోవడంలో బాత్రా పరాక్రమం తిరుగులేనిది. కెప్టెన్ బత్రాకు కోడ్ నేమ్ ‘షేర్షా’గా ఇచ్చారు. యుద్ధంలో పేలుడులో కాళ్లకు తీవ్రగాయాలైన లెఫ్టినెంట్ నవీన్ అనబేరు అనే అధికారిని రక్షించేందుకు కెప్టెన్ బాత్రా తన బంకర్ నుంచి పరిగెత్తి కాపాడే క్రమంలో శత్రువుల కాల్పుల్లో మరణించారు.