మంగళగి వైసీపీ ఇన్ చార్జ్ గా కాండ్రు కమల?.. చిరంజీవులు చీటీ చిరిగిపోయిందా? | ycp to change mangalagiri incharge| kandru| kamala| replace| chiranjeevulu| jagan| fear
posted on Feb 15, 2024 8:21AM
వైసీపీ అధినేత జగన్ కు లోకేష్ పేరు వినగానే వణుకు పుడుతోందా? అంటే సాక్షాత్తూ వైసీపీ కేడరే ఔనని బదులిస్తోంది. లోకేష్ పేరెత్తితే జగన్ మోహన్ రెడ్డిలో తెలియని ఆందోళన కనిపిస్తోందని వైసీపీ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. గతంలో లోకేష్ వేరు.. ఇప్పటి లోకేష్ వేరు. ఆ మార్పు స్పష్టంగా కనిపిస్తోంది.
అధికార పక్షం ప్రజావ్యతిరేక విధానాలను లోకేష్ సమర్థవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్లగల్గుతున్నారు. యువగళం పాదయాత్రతో రాష్ట్రంలో పర్యటించిన లోకేష్ .. తాజాగా శంఖారావం యాత్ర పేరుతో పర్యటనలు చేస్తున్నారు. ఈ క్రమంలో జగన్ ప్రభుత్వంపై లోకేష్ స్పష్టమైన ఆధారాలతో విమర్శలు చేస్తున్నారు. మరోవైపు మంగళగిరిలో లోకేష్ ను ఓడించేందుకు జగన్ పడరానిపాట్లు పడుతున్నట్లు కనిపిస్తోంది. గత ఎన్నికల సమయంలో మంగళగిరి నియోజకవర్గంలో లోకేష్ ఓటమి పాలైన విషయం తెలిసిందే. ఓడిపోయిన నాటి నుంచి మంగళగిరి నియోజకవర్గాన్ని లోకేష్ వదిలిపెట్టలేదు. తెలుగుదేశం క్యాడర్ కు అండగా ఉంటూ, ఆ నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేశారు లోకేష్.
మంగళగిరి నియోజకవర్గంలో బలమైన క్యాడర్ ను లోకేష్ ఏర్పాటు చేసుకున్నారు. అన్ని వర్గాల మద్దతును కూడగట్టుకోవడంలో లోకేశ్ సఫలమయ్యారు. అయితే, లోకేష్ ను మరోసారి ఓడించేందుకు జగన్ పలు విధాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో జగన్ కు నమ్మినబంటుగా కొనసాగుతూ వచ్చిన ఆళ్ల రామకృష్ణా రెడ్డిని తప్పించి.. తెలుగు దేశం పార్టీ నుంచి వచ్చిన చిరంజీవులను నియోజకవర్గ పార్టీ ఇంచార్జిగా జగన్ నియమించారు. తాజాగా చిరంజీవులను కూడా నియోజకవర్గ పార్టీ ఇంచార్జి బాధ్యతల నుంచి జగన్ తప్పించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఆయన స్థానంలో కాండ్రు కమలకు ఇన్ చార్జి బాధ్యతలు అప్పగించేందుకు జగన్ రెడీ అయ్యారని పార్టీ శ్రేణుల నుంచి అందుతున్న సమాచారం.
తాజాగా ఆమెను సీఎంవో కార్యాలయానికి పిలిపించి మాట్లాడినట్లు సమాచారం. ప్రస్తుతానికి వైసీపీ అధిష్టానం నుంచి ఎలాంటి ప్రకటనా రాకపోయినా.. త్వరలో రాబోయే లిస్ట్ లో మంగళగిరి నియోజకవర్గం ఇంచార్జిగా కాండ్రు కమల పేరు వెలువడుతుందని వైసీపీ వర్గాలు గట్టిగా చెబుతున్నాయి. మొత్తానికి లోకేష్ ను ఓడించేందుకు జగన్ పడుతున్న తంటాలు అన్నీ ఇన్నీకావని తేటతెల్లం అవుతున్నది. మంగళగిరి నియోజకవర్గంలో లోకేష్ బలమైన నేతగా ఎదిగిన క్రమంలో జగన్ వ్యూహాలు అక్కడ ఏ మాత్రం పని చేసే అవకాశాలు లేవని రాజకీయాల్లో చర్చ జరుగుతోంది.