Leading News Portal in Telugu

Chinta Mohan: తిరుపతి రాజధాని అవుతుంది.. మాజీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు


Chinta Mohan: తిరుపతి రాజధాని అవుతుంది.. మాజీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు

Chinta Mohan: ఆంధ్రప్రదేశ్‌ రాజధానిపై పలు వాదనలు తెరపైకి వస్తున్నాయి.. అయితే, తిరుపతి రాజధాని అవుతుంది, అవ్వాలని ప్రజలు కోరుతున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ ఎంపీ చింతామోహన్‌.. సీమలో కరువు పోయి అభివృద్ధి జరగాలంటే తిరుపతి రాజధానిగా మారితేనే సాధ్యం అన్నారు. విజయవాడలో మీడియాతో మాట్లాడిన చింతామోహన్‌.. సీమకు నీళ్లు లేవు.. రాళ్లు మిగిలాయి అని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక, బ్రహ్మంగారు కాల జ్ఞానంలో తిరుపతి రాజధాని అవుతుందని రాశారు.. అందుకోసం అందరూ ఎదురు చూస్తున్నారని తెలిపారు. తిరుపతి అందరికీ ఆమోద యోగ్యమైన ప్రాంతం.. భూములు, వనరులు, ఆహ్లాదకర మైన వాతావరణం అన్నీ ఉన్నాయని వెల్లడించారు.


మూడు రాజధానులు అని చెప్పిన వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ.. మళ్లీ హైదరాబాద్‌ ఉమ్మడి రాజధాని అనటం ఏంటి? అని నిలదీశారు చింతామోహన్‌.. స్వార్థ ఆర్ధిక ప్రయోజనాల కోసం హైదరాబాద్‌ను విడిచిన చంద్రబాబు.. తుళ్లూరు వచ్చారని విమర్శించిన ఆయన.. భూముల కోసం వైసీపీ.. విశాఖపట్నం వెళ్లిందని ఆరోపించారు. తిరుపతి రాజధాని చేయాలని అప్పటి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ చెప్పినా.. సంజీవయ్య కర్నూలుకి పంపించారని.. ఆ తర్వాత రాజధాని హైదరాబాద్‌ వెళ్లిందన్నారు. తుళ్లూరు నుంచి విశాఖ వెళ్లిన రాజధాని.. ఇప్పుడు
గాల్లో ఉంది అని ఎద్దేవా చేశారు. మరోవైపు.. రాష్ట్ర రాజకీయాలు భ్రష్ఠు పట్టాయి.. పాకిస్థాన్‌ కంటే ఘోరంగా ఏపీ పాలిటిక్స్ మారాయని ఫైర్‌ అయ్యారు. మళ్లీ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కావాలని అన్నీ వర్గాలు కోరుతున్నాయన్నారు. ఇక, వైఎస్‌ జగన్ పరిస్థితి అధ్వాన్నంగా తయారైంది.. జగన్ కు ఈ ఎన్నికల్లో 10 సీట్లు లోపు వస్తాయని జోస్యం చెప్పారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను అర్థరాత్రి చంద్రబాబు కలవాల్సిన అగత్యం ఏంటి? అని నిలదీశారు. చంద్రబాబు వల్ల ఎన్టీఆర్ ఆత్మ క్షోభ ఘోషిస్తోందన్న ఆయన.. వైఎస్‌ షర్మిల రావటం వల్ల కాంగ్రెస్ కు లాభం చేకూరింది.. కాంగ్రెస్ మైలేజ్ ను షర్మిల పెంచింది.. షర్మిల ను సీఎంగా చూడాలని ప్రజల్లో ఉంది.. కాంగ్రెస్ 130 స్థానాల్లో గెలుస్తుంది. రెండో స్థానంలో చంద్రబాబు నిలుస్తున్నారని వ్యాఖ్యానించారు కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ ఎంపీ చింతామోహన్‌.