మామ కోసం రంగంలోకి అల్లుడు.. కాంగ్రెస్ తరఫున ప్రచారానికి అల్లు అర్జున్!? | allu arjun to campaign for congress| chandrasekhar| reddy| goodbye| brs| join| hand
posted on Feb 16, 2024 11:13AM
పార్లమెంట్ ఎన్నికల ముంగిట బీఆర్ఎస్ పార్టీకి వరుస షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్ కు చెందిన నలుగురు కీలక నేతలు హస్తం గూటికి చేరగా, మరో నేత నుంచి ఊహించని షాక్ తగిలింది. స్వయానా టాలీవుడ్ టాప్ హీరో అల్లు అర్జున్ మామ అయిన చంద్రశేఖర్ రెడ్డి బీఆర్ఎస్‌కు గుడ్ బై చెప్పి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నట్లు ప్రకటించారు. తాను తెలంగాణ వాదిని అని చెప్పిన ఆయన బీఆర్ఎస్ హయాంలో తెలంగాణకు అన్యాయం జరిగిందన్నారు.
తాను గతంలో యువజన కాంగ్రెస్ లో యాక్టివ్ గా ఉన్నానని చంద్రశేఖరరెడ్డి చెప్పారు. ఇప్పుడు కాంగ్రెస్ లో చేరడమంటే సొంతింటికి వెడుతున్నట్లు అనిపిస్తోందని పేర్కొన్నారు. ఇప్పుడు జనం కాంగ్రెస్ వైపే చూస్తున్నారన్న ఆయన వచ్చే లోక్ సభ ఎన్నికలలో తాను పోటీ చేస్తాననీ, తన కోసం తన అల్లుడు, టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రచారం చేస్తారని చెప్పారు. కాగా మొన్నటి అసెంబ్లీ ఎన్నికలలో చంద్రశేఖరరెడ్డి నాగార్జున సాగర్ నుంచి బీఆర్ఎస్ టికెట్ ఆశించి భంగపడ్డారు. వచ్చే లోక్ సభ ఎన్నికలలో కూడా బీఆర్ఎస్ నుంచి పోటీకి అవకాశం దక్కకపోవడంతో పార్టీ వీడాలని నిర్ణయించుకున్నారు.
రాష్ట్ర విభజన తరువాత 2014లో బీఆర్ఎస్ లో చేరిన చంద్రశేఖరరెడ్డి, అప్పట్లో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలోని ఇబ్రహీంపట్నం నియోజకవర్గం నుంచి పోటీ చేసి తెలుగుదేశం అభ్యర్థి మంచిరెడ్డి కిషన్ రెడ్డి చేతిలో పరాజయం పాలయ్యారు. ఇప్పుడు ఆయన కాంగ్రెస్ గూటికి చేరనున్నట్ల ప్రకటించి సంచలనం సృష్టించారు.