posted on Feb 16, 2024 2:44PM
టీడీపీ అధినేత చంద్రబాబు ఉండవల్లిలోని తమ నివాసంలో రాజశ్యామల యాగం నిర్వహిస్తున్నారు. ఇవాళ తొలిరోజున చంద్రబాబు, నారా భువనేశ్వరి దంపతులు పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రాజశ్యామల యాగం మూడ్రోజుల పాటు జరగనుంది. ఆదివారం నాడు పూర్ణాహుతితో ముగియనుంది. ఆ క్రతువుకు పలువురు టీడీపీ నేతలు కూడా హాజరైనట్టు తెలుస్తోంది. వేదమంత్రాలతో చంద్రబాబు నివాసంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.
పురాణాల్లో చేసిన రాజసూయ యాగం-రాజకీయ నాయకులు నిర్వహించే రాజ శ్యామల యాగం రెండూ ఒకటేనా… రెండిటికీ మధ్య ఉన్న వ్యత్యాసం ఏంటి..రాజ్యలక్ష్మి వరించాలని..విజేతగా నిలిచేలా చేయాలని చేసేదే రాజశ్యామలయాగం. ఈ యాగం చేస్తే శత్రువు బలం తగ్గుతుంది, రాజకీయాల్లో విజయ లక్ష్మి వరిస్తుందని విశ్వసిస్తారు.యజ్ఞయాగాదులు దేవుడికోసం అనుకుంటే మీరు పొరబడినట్టే…మహాభారతంలో ధర్మరాజు తో శ్రీ కృష్ణుడు చేయించిన రాజసూయ యాగం, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్న రాజ శ్యామల యాగం ఒకటేనా అంటే…ఈ రెండు యాగాలు ఒకటే కాకపోయినా వాటి వెనకున్న ఆంతర్యం, పరమార్థం మాత్రం ఒకటే. ప్రారంభించిన కార్యంలో విజయం అందుకోవాలి, శత్రువులు క్షీణించాలి, సార్వ భౌమాధికారం సిద్ధించాలి, రాజ్యలక్ష్మి శాశ్వతంగా ఉండాలని చేస్తారు. రాజసూయ యాగం చేయడం చాలా పెద్ద క్రతువు అది నిర్వహించడం అంత సుసాధ్యం కాదు అందుకే అందుకు ప్రతిగా రాజశ్యామల యాగం నిర్వహిస్తారు.
ఇప్పటికే అనేక సార్లు యాగాలు చేసిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్..గత ఎన్నికలకు ముందు రాజ శ్యామల యాగం చేసి ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో విజేతగా నిలిచారు. ఎన్నికల విజయం తరువాత సహస్ర చండీ యాగం చేశారు.