Leading News Portal in Telugu

Priyanka Gandhi: ప్రియాంకాగాంధీకి అస్వస్థత.. ఆస్పత్రిలో చేరిక



Priyanak Health

కాంగ్రెస్ అగ్ర నేత ప్రియాంకాగాంధీ (Priyanka Gandhi) అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆమె ఆస్పత్రిలో చేరారు. ఈ మేరకు ప్రియాంకాగాంధీ ‘ఎక్స్‌’ ట్విట్టర్ ద్వారా విషయాన్ని తెలియజేశారు.

ఈరోజు రాహుల్‌గాంధీ (Rahul Gandhi) చేపట్టిన భారత్ జోడో న్యాయ యాత్ర (Bharat Jodo Nyay Yatra) ఉత్తరప్రదేశ్‌లో (Uttar Pradesh) ప్రవేశించనుంది. ఈ నేపథ్యంలో యాత్రలో పాల్గొనేందుకు ప్రియాంక సిద్ధమయ్యారు. కానీ అనారోగ్యం కారణంగా సోదరుడి యాత్రలో పాల్గొనలేకపోతున్నానని.. ఆస్పత్రి నుంచి కోలుకోగానే యాత్రలో పాల్గొంటానని పేర్కొన్నారు.

రాహుల్ గాంధీ చేపట్టిన యాత్ర ఈరోజు వారణాసి మీదుగా రాష్ట్రంలోకి ప్రవేశించనుంది. భాదోహి, ప్రయాగ్‌రాజ్, ప్రతాప్‌గఢ్ మీదుగా ఫిబ్రవరి 19న అమేథి చేరుకుంటుంది. ఆరోజు అమేథీ లోక్‌సభ నియోజకవర్గంలోని గౌరీగంజ్‌లో రాహుల్ గాంధీ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. అనంతరం మరుసటి రోజు రాయ్‌బరేలీకి యాత్ర చేరుకుంటుంది. ఆ రాత్రి అక్కడే బస చేసే అవకాశం ఉంది. అక్కడ నుంచి లక్నోకు వెళ్లనుంది. వాస్తవానికి ఈనెల 26 వరకు యూపీలో యాత్ర జరగాల్సి ఉన్న కూడా అక్కడ పబ్లిక్ ఎగ్జామ్స్ జరుగుతున్న నేపథ్యంలో ఈనెల 21కే యాత్రను ముగించాలని రాహుల్ నిర్ణయం తీసుకున్నారు.

2019 లోక్‌సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ చేతిలో అమేథీ స్థానంలో ఓడిపోయారు. ఇక సోనియాగాంధీ రాయబరేలీ ఎంపీగా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయకూడదని సోనియా నిర్ణయం తీసుకున్నారు. రాజస్థాన్ నుంచి రాజ్యసభకు పోటీ చేస్తున్నారు.

ఇదిలా ఉంటే ప్రియాంక ఆస్పత్రిలో చేరికపై పార్టీ నేతలు వాకబు చేస్తున్నారు. ఆమె ఆరోగ్యం గురించి ముఖ్యనేతలను అడిగి తెలుసుకుంటున్నారు.