Leading News Portal in Telugu

బీఆర్ఎస్ కు భారీ షాక్.. కారు దిగేసిన కీలక నేతలు | big shock to brs before general elections| key| leaders| join


posted on Feb 16, 2024 10:14AM

లోక్ సభ ఎన్నికల ముంగిట  బీఆర్ఎస్‌కు భారీ షాక్ తగిలింది.  పార్టీకి చెందిన నలుగురు ముఖ్య నేతలు కారు దిగి చేయందుకోవడానికి రెడీ అయిపోయారు. అసలే ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలలో పరాజయంతో డీలా పడిన బీఆర్ఎస్ కు ఇప్పుడు వరుసగా కీలక నేతలు గుడ్ బై చెబుతుండటంతో దిక్కుతొచని పరిస్థితి ఎదురైనట్లు కనిపిస్తోంది. పట్నం మహేందర్ రెడ్డి దంపతులు, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ దంపతులు, మాజీ మేయర్ తీగల కృష్ణారెడ్డి ఆయన కోడలు అనితా రెడ్డి, ప్రస్తుత డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్ రెడ్డి దంపతులు ఇహనో ఇప్పుడో కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకోనున్నారు.  ఏఐసీసీ ఇన్‌చార్జి దీపాదాస్ మున్షి, కాంగ్రెస్  వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ సమక్షంలో వీరు కాంగ్రెస్ లో  చేరనున్నారు.

ఇటీవల    పట్నం మహేందర్ రెడ్డి దంపతులు, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ దంపతులు, మాజీ మేయర్ తీగల కృష్ణారెడ్డి ఆయన కోడలు అనితా రెడ్డి, ప్రస్తుత డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్ రెడ్డి దంపతులు  సీఎం రేవంత్ రెడ్డితో వేర్వేరుగా భేటీ అయిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంగానే వీరు కాంగ్రెస్ గూటికి చేరుతారన్న ప్రచారం జరిగింది. ఆ ప్రచారం ఇప్పుడు వాస్తవ రూపం దాల్చింది.  శుక్రవారం (ఫిబ్రవరి 16) గాంధీభవన్ లో వీరి చేరిక కార్యక్రమం అట్టహాసంగా జరగనుందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.  ఏఐసీసీ ఇన్‌చార్జి దీపాదాస్ మున్షి వీరికి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించనున్నారు.  

అయితే బీఆర్ఎస్ నుంచి ఈ వలసల ప్రవాహం ఇక్కడితో ఆగే అవకాశం లేదంటున్నారు. మరీ ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ లో బీఆర్ఎస్ దాదాపు ఖాళీ అయిపోతుందని కాంగ్రెస్ వర్గాలే కాదు, బీఆర్ఎస్ శ్రేణులు కూడా అంటున్నాయి.  రాష్ట్ర ఆవిర్భావం తరువాత వరుసగా రెండు సార్లు అధికారం చేపట్టిన బీఆర్ఎస్ ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలలో విజయం సాధించి హ్యాట్రిక్ కొడదామని భావించినప్పటికీ, జనం అందుకు విరుద్ధంగా తీర్పు ఇచ్చారు. ప్రతిపక్షానికే పరిమితం చేశారు తొమ్మిదేళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్   జీహెచ్ఎంసీ పరిధిలో మాత్రం సత్తా చాటింది. జీహెచ్ఎంసీ పరిధిలో  కాంగ్రెస్   ఒక్కటంటే ఒక్క సీటు కూడా గెలవలేదు. అయితే ఎన్నికల ఫలితాలు వెలువడి నిండా మూడు నెలలు కూడా కాలేదు.. అప్పుడే గ్రేటర్ లో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. గ్రేటర్ లో తిరుగులేని బలం ఉందని భావిస్తున్న బీఆర్ఎస్ కు అది వాపు మాత్రమేనని అవగతమయ్యేలా పరిస్థితులు వేగంగా మారిపోతున్నాయి.  గ్రేటర్ లో బీఆర్ఎస్ ఖాళీ అవ్వడానికి  ఎంతో సమయం పట్టదన్నట్లుగా వలసల ప్రవాహం కొనసాగుతోంది. కేవలం కార్పొరేటర్లే కాకుండా ఎమ్మెల్యేలు సైతం కారు దిగిపోవడానికి తొందరపడుతున్నట్లుగా కనిపిస్తోందంటూ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.